అదొక ప్రముఖ దేవాలయం. దానిని సందర్శించడానికి రఘురాం కుటుంబం వచ్చారు. పూజాకార్యక్రమం జరిగినంత సేపు కూర్చోలేనన్న తాతగారిని, గలాభా చేస్తాడని వంశీని గుడిముందు వదిలి మిగిలిన వారంతా గుడిలోకి వెళ్ళారు. (తాత, మనవడు గుడి ముందు కాలక్షేపం చేస్తున్నారు) వంశీ: తాతా! ఐస్ క్రీం కొనివ్వవు? తాత: ఒరే వంశీ, ఇప్పటికే రెండు తిన్నావు, ఇక చాలు. వంశీ: తాత ఆ బొమ్మల కొట్టంలో ఎగిరే హెలికాప్టర్ వుంది. కాని పెట్టవా? తాత: చూద్దాం లేరా..! అమ్మా వాళ్ళు రానీ... కొని పెడతాను. వంశీ: తాతా! బోరు కొడుతోందీ! తాత: పద! గుడిలోకి వెళ్ళి, అక్కడి శిల్పాలు చూద్దాం. (తాత, మనవళ్ళు గుడిలోకి వెళ్ళారు) వంశీ: అబ్బ! ఎంత పెద్ద గుడో? ఎన్ని గోపురాలున్నాయో చూడూ! తాత: (గుడి విశేషాలు వివరించసాగాడు). వంశీ: తాతా! ఒక రూపాయి ఇవ్వవా? తాత: దేనికిరా? వంశీ: (మండపంలో అందంగా అలంకరించిన ఏనుగును చూపుతూ) ఆ ఏనుగుకిస్తే, అది దీవిస్తుంది. తాత: ఏనుగు దీవెన కోసమా? వంశీ: అవును తాతయ్యా!, నానమ్మ నిన్ననే చెప్పింది. గుడిలోని ఏనుగు చేత దీవెన పొందితే ఎంతటి కష్టమైనా... చిటికలో పోతుందట. తాత: వెర్రి తలకెక్కి, అదీ అలానే చెప్పి ఉంటుంది లేరా! వంశీ: ఏం తాతయ్యా రూపాయి ఇస్తావా? లేదా? తాత: ఏనుగు దీవెనతో నీకష్టం తీరితే? నిన్ను దీవించే ఏనుగు కష్టం ఎవరు తీరుస్తారు చెప్పు? వంశీ: ఏనుగుకు కష్టం ఏంటి తాతయ్యా? తాత: ఒరే వంశీ! పూజాకార్యక్రమానికి వెళ్ళిన నానమ్మ వాళ్ళు తిరిగి రావడానికి, మరో నాలుగు గంటలు పడుతుంది కదా! వంశీ:అవునూ.....! తాత , ఈ లోపు నీకో పందెం పెడతా, నీవు గెలిస్తే నీవడిగిన హెలీకాప్టర్ బొమ్మ కొని పెడతా? సరేనా? వంశీ:భలే భలే! ఏంటా పందెం? తాత: ఆ ఏనుగులా నువ్వు కూడా ఒకే చోటులో, నానమ్మ వాళ్ళు వచ్చేవరకు నిల్చోవాలి? వంశీ:ఓస్.. అంతేకదా! ఇదిగో ఈ బండ మీద నిల్చుంటా... దీనిని దాటను. సరేనా! తాత: అలాగే, ఏనుగు ఎవరినైనా దీవిస్తే! నీ చేతిని దాని తొండంలానే కదపాలి. వంశీ:భలే! ఇంకా...! తాత: ఏనుగు తిన్నప్పుడే తినాలి, తాగినప్పుడే తాగాలి. వంశీ:చాలా బాగుంది తాతా!, అలానే చేస్తాను. తాత: గుంపు చేరినా, గేలి చేసినా వెనకకు తగ్గరాదు. వంశీ:సరే తాతా!, ఇక పందెం ప్రారంభిస్తామా! (అరగంట పైగా గడిచింది. చుట్టు పక్కల జనం ఏనుగునూ అనుకరిస్తున్న వంశి వైపు చూస్తూ వెళుతున్నారు), వంశీ:తారా! ఇంకెంత సేపూ.....? తాత: ఏం....? హెలికాప్టర్ బొమ్మ వద్దా! (గంట గడిచింది. వంశీ చుట్టు గుంపు పెరిగింది) వంశీ: తాతా! కాళ్ళు నెప్పి పెడుతున్నాయి? తాత: నీ కంటే రెండు గంటల ముందు నుండే ఏనుగు నిల్చింది. వంశీ: నీళ్ళు కావాలి! తాత: ఏనుగు తాగితే నీవు తాగవచ్చు. (2 గంటలు గడిచాయి. ఏనుగు వద్ద కంటే వంశీ చుట్టే జనం ఎక్కువగా పోగైనారు) (ఓడిపోరాదనే మొండి పట్టుదలతో) ఈ ఏనుగు అలానే ఎంతసేపని నిలబడుతుంది. దానికి విసుగు పుట్టదా! తాత: ఒక్క పూటకే నీవిలా అంటే, ప్రతి రోజు అది అలానే వుండాలే? దాని కష్టమెంత? (రెండున్నర గంటలు గడిచింది. తాతామనవళ్ళ చుట్టూ పెద్దగుంపు పోగైంది) వంశీ: (నడుములోనేమో సలుపు... చేయి ఊపి ఊపి భుజం నొప్పి) తాతా! ఈ ఏనుగుకు దాహం కాదా? నా నోరు పిడచగట్టుకుపోతుంది, గంట నుంచి లఘుశంఖ బాధిస్తుంది. తాత: మరి ఏనుగుకు రోజు ఇలాంటి సమస్యలుండవా? (పోగైన జనంలో ఏనుగు కష్టం గుర్తించిన చర్చ మొదలైంది) వంశీ:పందెం పేరుతో నన్నిలా ఏడిపిస్తే నాకు భలే కోపం వస్తుంది తాతా! యాత్రికుడు: నీకు మల్లె ఆ ఏనుగుకు కోపం వస్తే... ప్రమాదం కదండీ! తాత: అందుకే దాని కాలును బలమైన చైనుతో స్థంభానికి కట్టారు. అంతేగాక అదుపు చేయడానికి మావటివాడు అంకుశమనే.., ముల్లు కర్రతో పొడుస్తుంటాడు. యాత్రికురాలు: ఎంత క్రూరత్వం? మరో స్థానికుడు: తాత గారు మొదట్లో ఈ ఏనుగును మచ్చిక చేసుకోవడానికి 15 రోజుల పైనే హింసించారు. తాత: హింసించడమా? ఎలా? స్థానికుడు: ఇది మావటి మాట వినే వరకు తిండి, నీరు ఇవ్వలేదు. ముందు కాలును, వెనుక కాలును మోకులతో లాగి దూరదూరంగా రోజుల తరబడి కట్టి వుంచారు. తాత: అంటే అది కూర్చోలేదు, పడుకోలేదన్న మాట! ప్రక్కనున్న వృద్ధురాలు: దేవుడా! జీవహింస మహాపాతకం! ఈ తప్పంతా మావటిదే! తాత: లేదమ్మా. ఆవేశంలో ఏనుగులు మావటీలను తొక్కి చంపిన సంఘటనలు చాలానే వున్నాయి? పూజారి: ఔనండి! ఈ విధంగా ఏనుగులను గుడిముందు నిలపాలని ఏ పురాణాలలోనూ చెప్పలేదు. యాత్రికురాలు: మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ మూఢాచారాల్ని దూరం చేయలేవా? తాత: అమ్మ 'వైల్డ్ లైఫ్ యాక్ట్' క్రింద చాలా చట్టాలే చేశారు. 'బ్రూక్రాస్' లాంటి స్వచ్ఛంధ సంస్థలు వాటి అమలుకు ప్రయత్నిస్తూనే వున్నాయి. పూజారి: జనంలో మార్పు రావాలి కానీ...., చట్టాలు ఏం చేస్తాయి? మావటి: అయ్యా! మీ అందరికంటే ఈ ఏనుగు కష్టం నాకే బాగా తెల్సు, కాని ఇలా చెయ్యకపోతే నా పొట్ట నిండదు. దానికి బ్రతుకు లేదు. తాత: నిన్ను మేము తప్పు పట్టడం లేదు. అధికారులతో మాట్లాడి దీనికో పరిష్కారం కనుగొంటాను. మావటి: మంచిదయ్యా! ఈ ఏనుగు దీవెనకే మహత్తుంటే నేను మారాజులా వుండేవాడిని కదా! (అంటూ ఏనుగుతో గజశాల వైపు బయలుదేరాడు) యాత్రికులు: తాతగారూ! ఒట్టేసి చెపుతున్నాం, ఇకపై ఏనుగు దీవెనకై మేం ఎగబడము. తాత: మంచిదండీ....! వంశీ: (వంశీ తన ఓటమిని అంగీకరిస్తూ ఎప్పుడో, తాత గారి ఒడిలో ఒదిగి పోయివున్నాడు) తాతా! నాకు కొనిస్తానన్న బొమ్మ బదులు, ఏనుగుకు మంచి పండ్లు కానివ్వవూ? తాత: సరే పదరా! (పండ్ల బుట్టతో తాత మనవళ్ళు గజశాల వైపు నడిచారు.) ఆధారం: జి. చంద్రశేఖర్