ఆరిఫ్: రే! రాజా...! మార్రే! ఉస్తే నై చోడ్ నా...! మార్రే! (రాయి కోసం వెతుకుతున్నాడు) రాజ: కొట్టు! కొట్టు...! (ఎగిరెగిరి చెట్టు కొమ్మలో దేన్నో కొడుతున్నాడు). అబ్దుల్లా: ఒరే...! రాజ, దగ్గరకు పోవద్దు! కరిచిందా రంగులు మారి చస్తావ్! శివ: అయ్యో! కనిపించలేదే? రాజు: అదిగోరా! ఆకుల పైన..! ఆకుపచ్చరంగులోకి మారింది. (స్కూల్ కాంపౌండ్ ఆవల జరుగుతున్న అలజడికి వంశి, స్నేహితులు అక్కడికి చేరారు). వంశి: ఒరే! ఏందిరా? రాజు: ఊసరవెల్లి! దూరంగా పో...! వంశి: ఎక్కడరా? నన్ను చూడనివ్వండి! (చెట్ల కొమ్మలలో పెద్ద సైజు తొండలాంటిదే, తలపై రంపపు పళ్ళ లాంటి విచిత్రమైన మడతలున్నాయి. స్ర్పిoగులా చుట్టుకొన్న తోక, బాగా ఉబ్బినట్లున్న కళ్ళతో, ఊగి ఊగి నెమ్మదిగా నడుస్తుంది) వంశి: భలేగుందే! ఆరీఫ్ : ఏకమార్ దో తుకడా! (బలంగా రాయి విసిరాడు. గురితప్పింది) వంశి: ఒరే! దాన్ని చంపద్దురా! వదిలేయండి రా! అబ్దుల్లా: వంశీ దూరం జరుగు! కొట్టరా శివా ఏయ్! వంశి: సార్! సార్! ఇలా రండి. వీళ్ళంతా ఊసరవెల్లిని చంపేస్తున్నారు! (విషయం తెల్సి జీవశాస్త్రం సార్ పి.ఇ.టి. సార్ అక్కడికి వచ్చారు) పిఇటి సార్: (విజిలేస్తూ) దూరంగా రండి! ఏయ్ రాయి వేయద్దు! (పిల్లలు వెనక్కు తగ్గారు) సైన్స్ సార్: ఎక్కడరా, అది? (తొంగిచూస్తూ) ఆరీఫ్: అదిగో సార్, కొమ్మపై నుండి నేలపై పడింది. అబ్దులా: సార్! మళ్లీ రంగు మారిపోయింది సార్. అబ్దులా: సార్! దాన్ని కొట్టేస్తా...! పిఇటి: రాజా! ఆ రాయి ఇలా ఇవ్వరా! సైన్స్ సార్: సార్! సార్! మీరు కూడానా...? పిఇటి: అది కరిస్తే పిల్లలకు ప్రమాదం సార్! సైన్స్ సార్: అదో మూఢనమ్మకం సార్. అది విష జంతువు కాదు. మనిషిని గాయపరచగల్గినంత పదునైన దంతాలు దాని నోట్లో లేవు. పిఇటి: లేదు సార్! మన పెద్దోళ్ళంతా చెప్తుంటారు కదా! దాని విషం ఎక్కితే రంగులు మారి చనిపోతామని. సైన్స్ సార్: సరే! ఊసరవెల్లి కరిచి రంగులు మారి చనిపోయిన వారిని మీరు చూశారా? కనీనం విన్నారా? అలాంటివి జరిగివుంటే టి.వి. ప్రసారాలలో ఇంటర్ నెట్లో చూపేవారు కదా! పిఇటి: (ఆలోచనగా) ఔను సార్! రంగులు మారి చనిపోయారనడానికి ఆధారాలు లేవు. సైన్స్ సార్: ప్రపంచ వింతలంటు శిథిలమైన కట్టడాలను కాపాడే మనం మూర్ఖంగా ఆలోచిస్తూ ప్రకృతి వింతలైన ఇలాంటి జంతువులను మాత్రం కొట్టి చంపుతాం! వంశి: సార్ ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? పిఇటి: తనను తినే వరభక్షకాలకు కన్పించకుండా దాక్కోవడానికి పరిసరాల రంగు పొందుతుంది. సైన్స్ సార్: అది కూడా వాస్తవం కాదు సార్. (అందరు సైన్స్ సార్ చెప్పేది శ్రద్దగా వింటున్నారు) సైన్స్ సార్: శరీరపు రంగు మార్చడం ద్వారా దాని మనస్సులోని చిరాకు, భయం, కోపం లాంటి ఉద్వేగాలను వ్యక్తం చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అబ్దులా: అంటే అది మనల్ని చూచి భయపడిందా? శివా: కాదురా కోపం వచ్చి భయపెట్టడానికే రంగుమారింది. సైన్స్ సార్: భావాల వల్లనే కాకుండా కాంతి, ఉష్ణోగ్రత, తేమ కూడా దీని రంగును నిర్ధారిస్తాయి. వంశి: మరి అది రంగు ఎలా మార్చుకోగలదు? సైన్స్ సార్: బల్లిలాగానే ఊసరవెల్లి చర్మానికి రంగు లేదు. కాని చర్మం క్రింద పొరలుగా ఉన్న కణాలలో నలుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణకాలు వుంటాయి. ఆ పొరలలో ఏ కణాలు వ్యాకోచిస్తాయో, దానికనుగుణంగా ఊసరవెల్లి రంగు కన్పిస్తుంది. రాజ: సార్ మరి ఎందుకు అది ఊగి ఊగి నడుస్తుంది? సైన్స్ సార్: అది చెట్లకొమ్మలపై తిరగడానికి పాదంలో అనుకూలతలు పొందిన జీవి. దాని పాదంలో రెండు వేళ్ళు ముందుకు వెనక్కు వుండి కొమ్మలను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పిఇటి: అదే పాదంతో నేల పై నడవాలంటే బ్యాలెన్స్ కుదరక ఊగుతుందన్నమాట! అబ్దులా: సార్ నేను చూసినప్పుడు అది తోకతో కొమ్మను చుట్టి తలకిందులుగా వేలాడింది సార్. శివ: పొడుగ్గా నాలుక చూపి మమ్మల్ని బెదిరించింది సార్. సైన్స్ సార్: (నవ్వుతూ) అది ఏదో చిన్న కీటకాన్ని వేటాడుతూ అలా వేలాడి ఉంటుంది. వంశి: దాని తోక ఎంత బలమైంది సార్, దాని బరువంతా మోసిందే? సైన్స్ సార్: అంతే కాదు! దాని నాలుక దాని శరీరమంత పొడవు వుండి, కీటకాల వేటలో సహకరిస్తుంది. శివ: సార్! అది నాలుక చాపినప్పుడు అక్కడ ఎలాంటి కీటకం లేదండి? సైన్స్ సార్: నీకు కనిపించలేదేమో? శివ: మరి ఊసరవెల్లికెలా కనిపించింది? సైన్స్ సార్: చూపు విషయంలో కూడా అది మనకంటే గొప్పది. శివ ఎలాసార్? సైన్స్ సార్: దానికి నాన్ స్టీరియో టైపిక్ విజన్ వుండటం వలన అది 180°ల కోణంలో ఏవైపైన తల కదపకుండా చూడగలదు. ఏ కంటికాకంటినే వేరుగా తిప్పుతూ 10 మీటర్లు దూరంలోని చీమను కూడా స్పష్టంగా చూడగలదు. వంశి: అమ్మో ఎంత వింత? సైన్స్ సార్: గుడ్లు పెట్టే విషయంలో మరో వింత ఉంది. పిఇటి: ఏమిటి సార్ అది? సెన్స్ సార్: తడవకు 6 నుండి 24 గుడ్లు పేడుతుంది వీటిలోని జాతి రకమును బట్టి వాటి పొదుగు కాలం 6 నెలల నుండి సంవత్సరాల వరకు ఉంటుంది. పిఇటి: ఈ లోపు ఆ గుడ్లను వేరే జంతువులు తినేస్తాయి కదా? సైన్స్ సార్: అందుకే వాటి సంఖ్య చాలా తక్కువ మనకు కనిపించేది అరుదుగానే పిఇటి : ఇన్ని వింతలున్న ఈ జంతువును మనషి ఎందుకు చేసుకోలేకపోయాడంటారు? సైన్స్ సార్: అన్ని జంతువులు మనిషికి లొంగాలన్న నియమమేది లేదే? పిఇటి: మరి ఊసరవెల్లి దుర్గంధపూరిత వాయువులను వదలడం కూడా అవాస్తవమేనా? సైన్స్ సార్: అంతే కదా! అబ్దులా/శివ: సార్ ఊసరవెల్లి ఇప్పుడు చాలా అందంగా కన్పిస్తుంది సార్! రాజ/ ఆరీఫ్: ఇకపై వీటిని చంపము సార్. పిఇటి: ఇతరులను కూడా చంపనీయ సరేనా! (అందరు బడి లోకి దారితీసారు కొమ్మల్లోని ఊసరవెల్లి బతికిపోయింది. రచన: చంద్రశేఖర్ రామల్ పేట