నిజం ఎప్పుడూ నిష్టరంగానే ఉంటుంది. సత్యాన్ని చెప్పటం అంత తేలికేమీ కాదు. దానిదేముంది ఉన్న విషయమేగా చెబుతున్నది అనుకుంటాం. కాని ఆ మాటలు, ఆ సత్యం ఆనాటి సమాజాన్ని శాసించే వాళ్లకు నచ్చకపోతే...! నచ్చటం కాదు ఏకంగా వాళ్ల పునాదుల్నే కదిలిస్తే....! సత్యం పలికిన వాడికి భూమ్మీద నూకలు చెల్లినట్టే. అయినా కొందరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సత్యం కోసం నిలబడతారు. అందుకే వారు చిరస్మరణీయులు, స్థల, కాలాలతో నిమిత్తం లేకుండా ప్రపంచ ప్రజల గౌరవాన్ని పొందుతారు. అంతటి విశిష్ట వ్యక్తే గియోర్డానో బ్రూనో (Giordano Bruno) ఆధునిక విజ్ఞాన శాస్త్రం (Modern Science) అప్పటికింకా పురుడు పోసుకోలేదు. మతం, నమ్మకాలు బలంగా ఉన్న రోజులు. సమస్త విశ్వం భూమి చుట్టూనే తిరుగుతుందని నమ్మేకాలం. సకల గ్రహాలు భూమి కేంద్రంగా తిరుగుతుంటాయని గట్టి విశ్వాసం. సిద్ధాంతానికి తెరతీసిన రోజుల్లోనే ఇటలీ దేశంలో నేపుల్స్ సమీపంలో ఉన్న నోలా (Nola) పట్టణంలో 1548లో జన్మించాడు బ్రూనో, బ్రూనో తాను నమ్మిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. ఈ గ్రహాలకు కేంద్రం సూర్యుడు కాని భూమి కాదని తేల్చిచెప్పాడు. కోపర్నికస్ కంటే కూడా ముందుకెళ్లి మనకు కనబడే నక్షత్రరాసుల సూర్యుడు, దాని చుట్టూ ఉండే గ్రహాలని చెప్పాడు. ఆ గ్రహాల్లో భూమ్మిదలాగే జీవం ఉన్నాఉండొచ్చునని సూత్రీకరించి ప్రపంచ మేధావుల్లో సంచలనాన్ని సృష్టించాడు. సత్యాన్వేషణకు హేతువు (Reason), తర్కం (Logic) ఆధారంగా ఉండాలి కాని మత నమ్మకం (Religion belief) కాదన్నాడు. ఇందుకు ఆనాటి రోమన్ కాథలిక్ చర్చి ఆగ్రహించి బ్రూనోపై చర్యకు పూనుకుంది. బ్రూనో ప్రభుత్వానికి దొరక్కుండా చాలా కాలం ఐరోపా అంతటా పర్యటించి ఆనాటి గొప్ప మేధావులు, ఆలోచనాపరులను కల్సుకుని కొత్త విషయాలను అధ్యయనం చేశాడు. కోపర్నికస్ చెప్పిన ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతానికి 'ఛాంపియన్'గా నిలిచాడు. నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులనేర్పరిచాడు. ఎట్టకేలకు 1593లో ఇటలీ ప్రభుత్వం, రోమన్ కాథలిక్ చర్చి బ్రూనోను అరెస్టు చేసి 8 ఏండ్ల పాటు జైల్లో పెట్టింది. అయినా బ్రూనో మతపెద్దల హుకుంకు లొంగలేదు. సత్యాన్ని మాత్రమే చెబుతానని, మీ నమ్మకం హేతుబద్దం కాదనీ వాదించాడు. చిట్ట చివరకు బ్రూనోను ఫిబ్రవరి 17, 1600 సం.లో సత్యం పలికి నందుకు ‘సజీవ దహనం చేశారు. ఆయన బలిదానం జ్ఞాన సముపార్జనకు, సత్యాన్వేషణకు, హేతుబద్ద ఆలోచనలకు గొప్ప స్పూర్తిగా మిగిలిపోయింది. ఆయనను సజీవంగా దహనం చేసిన చోట 1889లో స్మారక స్థూపాన్ని నిర్మించారు. విజ్ఞాన శాస్త్రం కోసం ప్రాణాలిచ్చిన అమరుడు బ్రూనో కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు గొప్ప తత్వవేత్త, గణితమేధావి అంతకు మించిన కవి.