ఒక రోజు అక్బర్ చక్రవర్తి సభలో ఆసీనుడై ఉన్నాడు. బీర్బల్ ఇంకా సభకు రాలేదు. ఇంతలో అక్బర్ సభికులని అయిదు ప్రశ్నలు అడిగాడు. అవి పూలన్నింటిలో ఉత్తమమైనవి ఏది? అకులన్నింటిలో ఉత్తమమైన ఆకు ఏది? అతి శేష్టమైన పాలు ఎవరివి? తీయనైనది ఏది? అందరి కన్నా గొప్పరాజు ఎవరు? సభికులందరూ తమకు తోచినట్లు సమాధానాలు చెప్పారు. చివరి ప్రశ్న అయిన గొప్ప రాజు ఎవరు అనే ప్రశ్నకు మాత్రం అందరూ అక్బర్ చక్రవర్తే గొప్పరాజు అని జవాబు ఇచ్చారు. కాసేపటికి బీర్బల్ సభకు వచ్చాడు. అక్బర్ కు సాదరంగా వందనం చేసి తన స్ధానంలో కూర్చున్నాడు. అక్బర్ ఈ అయిదు ప్రశ్నలను బీర్బల్ ను అడిగాడు. దానికి బీర్బల్ జహాపనా! ఈ ప్రశ్నలు చాలా సులువైనవి. పూలలో కెల్లా ఉత్తమమైనది పత్తిపువ్వు. అది మన శరీరాన్ని కప్పే దుస్తులను ఇస్తుంది. అకులన్నింటిలో ఉత్తమమైన ఆకు తమలపాకు. అది శత్రువుల్ని కూడా మిత్రులుగా మారుస్తుంది. తల్లిపాలే పాలలో శేష్టమైనవి. అవి బిడ్డలకు ఆహారాన్ని. రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. మాటలలోని సౌమ్యత్వమే అన్నిటికన్నా తీయనైనది. అందరి కంటే గొప్పరాజు ఆ భగవంతుడే అతని ఆజ్ఞ పాలనలోనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. అవి జవాబు ఇచ్చాడు. బీర్బల్ తెలివికి వివేకానికి అక్బర్ మగ్గుడై అతనికి బహుమతులు ఇచ్చాడు. ఆధారం: ఎం. మురళీ కృష్ణ