కుక్కపిల్ల, అగ్గిపుల్ల... సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్నీ... కవితామాయయేనోయ్ అన్నీ. తలుపుగొళ్ళ, హారతి పళ్ళెం... గుర్రపు కళ్ళెం. కాదేదీ కవిత కనర్హం... అన్నాడు మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు). అంటే కవిత్వం అంటే ఏ మేఘాల పైననో, మహారాజుల, రాణుల గురించో, ప్రేయసి గురించో మాత్రమే కవిత్వం వ్రాయడం కాదు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళపై కూడా కవిత్వం వ్రాయవచ్చు , అని శ్రీశ్రీ అనే పెద్ద కవి చెప్పారు. మీరు కూడా వాటిపై ఓ కవిత్వం వ్రాయండి. సులభమే. వ్రాన్ చెకుముకికి పంపండి. బాగున్న కవితలు మన చెకుముకిలో ప్రచురిస్తారు. సరేనా... అదలా వుంచితే అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, చక్కెర బిళ్ళ కాదేదీ ప్రయోగానికి అనర్హం అని మనం నిరూపిస్తాం... ఎలాగంటారా. రండి. చేసి చూద్దాం. కావలసిన పరికరాలు: చిన్న నీటిపాత్ర, నీరు, అగ్గిపుల్లలు, సబ్బుబిళ్ళ, చక్కెర బిళ్ళ. చేయు విధానము: నీటిపాత్రలో నీరు పోయండి. నీటిపాత్రలో అగ్గిపుల్లలను (10 పుల్లలు) పటములో చూపిన విధంగా వృత్తాకారంగా అమర్చండి. వృత్తంలో మధ్యలో కాస్త ఖాళీ వుండేలా అమర్చండి. (అగ్గిపుల్లలు తేలిక గనుక నీటిపై తేలియాడుతూ వుంటాయి. పుల్లలు అమర్చేటప్పుడు నీటి పైపొర తాకకండి). ఇప్పుడు సబ్బుముక్కతో అగ్గిపుల్లల మధ్యగా నీటిని తాకించండి. అంటే అగ్గిపుల్లలు అలిగినట్లుగా వృత్తకేంద్రం నుంచి దూరంగా పాత్ర అంచుల వైపుగా జరుగుతాయి. తరువాత చక్కెర బిళ్ళను (చక్కెర బిళ్ళలు వునాకారంగా దొరుకుతాయి) అదే వృత్తం మధ్య నీటిని తాకించండి. చక్కెర కోసం చీమలు వచ్చినట్లు అగ్గిపుల్లలు అలకమాని మరలా వృత్తం వైపుగా వస్తాయి. ఇది ఎలా సాధ్యం ... అసలు ఏమి జరిగింది. తలతన్యత: నీటి పైపొర సాగదీసిన రబ్బరు పొరలాగ వనిచే స్తుంది. ఈ లక్షణాన్ని తలతన్యత (Surface Tension) అంటారు. ఈ కారణంగా దోమలు నీటిపై వాలి తేలుతూ వుంటాయి. ఈ తలతన్యత వల్లనే అగ్గిపుల్ల కదలకుండా తేలియాడుతూ వుంటుంది. వృత్తంలో కదలకుండా వుంటాయి. ఈ స్థితిలో మనం సబ్బుబిళ్ళను నీటిమధ్యలో తాకగానే కాస్త సబ్బు నీటిలో కరుగుతుంది. ఈ సబ్బు నీటి తలతన్యత తగ్గుతుంది. నిజానికి నీటిపొర చిరిగి అంచులవైపుగా కుదించుకు పోతుంది. అలా కుదించుకు పోయేటప్పుడు అగ్గి పుల్లలను కేంద్రం నుండి అంచులవైపుగా లాగుతూ పోతుంది. అందువల్ల అగ్గిపుల్లలు అలిగిపోయినట్లు కేంద్రం నుండి దూరంగా జరిగాయి. మరలా చక్కెరబిళ్ళను నీటిపై తాకించగానే చక్కెర నీటిని కాస్త పీల్చుకుంటుంది. అలా కేంద్రం వద్ద నీరు పైకి ప్రసరించగానే అంచులనుంచి నీరు కేంద్రం వైపుగా సాగుతుంది. అలా సాగేటప్పుడు తనతోపాటు అగ్గిపుల్లలను కేంద్రం వైపుగా లాగుతూ పోతుంది. అప్పుడు పుల్లలు అలకమాని చక్కెర కోసం చీమలు వచ్చినట్లు కేంద్రం వైపుగా కదిలాయి. అదన్నమాట. సబ్బు నీటి తలతన్యత తగ్గిస్తుంది. అందువల్లనే గుడ్డలు ఉతికేటప్పుడు సబ్బు వేస్తే నీటి తలతన్యత తగ్గిగుడ్డల రంధ్రాలలో నీరు ప్రవహించి మురికిని తొలగింస్తుందన్నమాట. చూశారా మనం ఎంచక్కా అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, చక్కెర బిళ్ళలతో ప్రయోగం చేసాము కదా. ఇక ముందు కవిత వ్రాయడమే తరువాయి. తీసుకోండి కలం, కాగితం... వ్రాసేయండి కవిత్వం... పంపేయండి చెకుముకికి... సరేనా... ఆధారం: యుగంధర్