”ఈ రోజు సైన్స్ మేజిక్ చేసే ముందు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా, ఏం, అడగమంటారా?” అన్నాడు మెజిషియన్. ”అడగండి చెబుతాం.” అన్నారు విద్యార్థులంతా. ”సరే వినండి. చాలా చిన్న ప్రశ్న సుమా. మీరెప్పుడైనా ఇంధ్రధనస్సు (Rainbow) చూశారా?”, ”ఓ... చూశాం సార్.” అన్నారు విద్యార్థులు. ”అయితే ఎప్పుడు చూశారు? అదెలా ఉంది?” మెజిషియన్ సుబ్బు మరో రెండు ప్రశ్నలు వేశాడు. ”నెలక్రిందట తుఫాన్ వచ్చింది కదా. తుఫాన్ తగ్గిన తర్వాత బయటకి వచ్చి తూశాను. ఆకాశంలో ఇంధ్రధనస్సు కన్పించింది. మా ఇంట్లో అంతా చూశారు. చాలా బాగుంది. ఏడు రంగులు ఒక వరుసలో ఒకదానితో ఒకటి అతుక్కుంటూ ధనస్సులాగా వంగి ఉంది.” ఎంతో ఉత్సాహంగా చెప్పింది అశ్రిత. ”చాలా బాగా చెప్పావ్ అశ్రిత. ఇంధ్రధనస్సు చూడాలంటే, మళ్లీ తుఫాన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడనక్కర్లేదు. నేను ఇప్పుడే, ఇక్కడే ఇంధ్రధనస్సు సృష్టిస్తా చూడండి. ఇదే ఈ రోజు సైన్స్ మేజిక్.” అన్నాడు మెజీషియన్. మెజిషియన్ టేబుల్ మీద ఒక ట్రే ఉంచి అందులో నీరు పోశాడు. ఒక సమతుల దర్పణం అంటే అద్దంను సగం వరకు నీటిలో మునిగేలా ఏటవాలుగా ఉంచి అది జారిపోకుండా ఒక చిన్న గులకరాయిని అడ్డుపెట్టాడు. ఒక చేతో టార్చిలైట్ ను పట్టుకుని దాని కాంతిని అద్దం నీటిలో మునిగి ఉన్న భాగం మీద పడేట్లు చేశాడు. రెండో చేత్తో ఒక తెల్లని కార్డు పట్టుకుని అద్దం పై భాగంలో కొంతసేపు అటు ఇటు కదిల్చాడు. అంతే కార్డు మీద ఇంద్రధనుస్సు కన్పించింది. వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు వరుసగా కన్పించాయి. విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. ఈ మేజిక్ ను మనం కూడా చేసి మన ఇంట్లోనే ఇంద్రధనుస్సును సృష్టించగలం. ఇది చాలా సులువు. ఇందుకు కావల్సినవి ఎక్కువ లోతులేని ఒక పళ్లెం, నీరు, టార్చ్ లైట్, తెల్లని కార్డ్ బోర్డ్, ఒక అద్దం. మెజీషియన్ చేసినట్లుగానే, పళ్లెంలో సగం దాకా నీరు పోసి అద్దం కింది భాగం నీటిలో మునిగేటట్లు ఏటవాలుగా పళ్లెంలో ఉంచాలి. అద్దం జారిపోకుండా దాని కింద ఒక చిన్న గులకరాయి అడ్డు పెట్టాలి. ఇప్పుడు టార్చిలైట్ వెలిగించి దాని నుంచి వచ్చే తెల్లటి కాంతిని నీటిలో అద్దం ముగిని ఉన్న చోట పడేట్లు చేయ్యాలి. ఒక తెల్లకాగితం లేదా తెల్లటి కార్డి బోర్డును అద్దం పైన ఉంచి దానిపైన ఇంధ్రధనస్సు కనిపించేదాకా కోణాన్ని సర్దుబాటు చేయాలి. అన్ని రంగులతో ఇంద్రధనస్సు కనువిందు చేస్తుంది. ఇదో ఫిజిక్స్ మేజిక్! ఇలా ఎందుకు జరుగుతోంది? ఇందులో ఇమిడి ఉన్న సైన్స్ ఏమిటి? మనం తెలుసుకుందాం ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడడంలో కాంతి వక్రీభవనం, పరావర్తనం ఇమిడి ఉన్నట్లుగానే మేజిక్ చేసి మన ఇంట్లో సృష్టించుకున్న ఇంద్రధనస్సులో కూడా అవే సూత్రాలున్నాయి. కాంతి ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించినప్పుడు వంగుతుంది. దీన్నే వక్రీభవనం (Refraction) అంటున్నాం. టార్చిలైటును వెలిగించినప్పుడు తెల్లటి కాంతి పుంజం వస్తుంది. ఈ కాంతిని నీటిలోకి పంపినప్పుడు, గాలి నుంచి నీటిలోకి ప్రయాణిస్తుంది కదా. వక్రీభవనం వల్ల కాంతి వంగుతుంది. కాని తెల్లని కాంతి కేవలం ఒక్క రంగు మాత్రమే కాదు. ఇది ఏడు రంగుల కలయిక. తెల్లటి కాంతి వంగినప్పుడు అందులోని అన్ని రంగులు అంటే వైలెట్ (Violet), ఇండిగో (నీలిమందు రంగు), నీలం (Blue), ఆకుపచ్చ (Green), పసుపు (Yellow), నారింజ (Orange), ఎరుపు (Red) కూడా వంగుతాయి. కాని ఈ రంగులు నీటిలో ప్రయాణించే వేగాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వేర్వేరు కోణాల్లో వంగుతాయి. ఇప్పుడు ఈ కాంతిని అద్దం (Mirror) సాయంతో నీటి నుంచి తిరిగి వెనక్కి పరావర్తనం (reflection) చెందిస్తే వక్రీభవనం వల్ల తెల్లటి కాంతి నుంచి విడిపోయిన ఏడు రంగులు తెల్లకాగితం మీద పూర్తి ఇంద్రధనస్సుగా మనకు కన్పిస్తాయి. ఆధారం: డా. ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం