కావలసినవి : తెల్లటి కార్డు / పెళ్లి పత్రిక, జిగురు, కత్తెర బ్లేడు, పెన్సిలు. చేసేవిధానం: కొంత మందం గల తెల్లటి 16X27 సెం.మీ గల కార్డ్ బోర్డు తీసుకోవాలి. దీనికి మధ్య భాగంలో నిలువుగా వెన్నెముకను గీయాలి. వెన్నెముక్కకు ప్రక్కల నుండి 12 జతల ప్రక్కటెముకలు కుడి వైపుకు, ఎడమ వైపుకు పెన్సిల్ తో గీయాలి. (ప్రక్కటెముకలు గీసేటప్పుడు వాటి మధ్య కొంత ఖాళీ ఉండేటట్లు గీసి, ఖాళీ బోర్డు తీసేస్తే ప్రక్కటెముకలు తయారవుతాయి) మొదటి ఆరు జతలు విడివిడిగా ఉండేట్లు చూడాలి. ఏడు నుండి పదవ ప్రక్కటెముకలు, వెన్నెముక నుండి విడివిడిగా బయలు దేరి చివరలో ఏడవ జత దగ్గర కలుసుకునేట్లు చూడాలి. పదకొండు, పన్నెండు ప్రక్కటెముకలు వెన్నెముక నుండి బయలుదేరిన కొంత దూరంలోనే కత్తిరించి అలా గాలిలో ఉంచేయాలి. వీటిని మొండి ఎముకలు అంటారు. ఫోటోలో ముందువైపు కనబడుతున్న రొమ్మెముకను (13.5x3.5 సెం.మీ. ) కార్డు బోర్డు లో రెండు ఒకే సైజులో కత్తిరించి ఉంచాలి. ఈ రెండింటి మధ్యకు ప్రక్కటెముకల చివరలు వచ్చునట్లు ఉంచి, వాటిని జిగురుతో నెమ్మదిగా అతికించాలి. ఇలా వెనుక భాగాన ఉన్న వెన్నెముక, ముందువైపున ఉన్న రొమ్మెముక , రెండింటిని కలుపు ప్రక్కటెముకలు అన్నీ కలిపి పెట్టెవలే తయారవుతాయి. ఇలా సరదాగా ఉర: పంజరం నమూనాను తయారుచేసి అట్ట పెట్టెలో భద్రపరచవచ్చు. పాలిధీన్ కవర్ వేసి గోడకు తగిలించవచ్చు. నిర్వహణ : టి. శాంతాభాస్కర్, కొంగారెడ్డిపల్లె. చిత్తూరు.