కట్టెపుల్లని, కాగితాన్ని తాకి చూడండి అవి ఘన పదార్థాలు కదూ! అవి కోట్ల కొలది కంటికి కనబడనంత చిన్న కణాలతో ఏర్పడతాయి. ఆ చిన్న కణాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కదిలే కణాలకు గతిజశక్తి ఉంటుంది కదా! కదిలే కణాల గతిజశక్తినే ఆ పదార్థం లేక వస్తువు ఉష్ణశక్తి అంటాం కదూ! ఏ వస్తువు లేక పదార్థానికి ఎంత ఎక్కువ ఉష్ణశక్తి ఉంటే అది అంత వేడిగా ఉంటుంది కదూ! పదార్థాలు లేక వస్తువులు ఎంత వేడిగా ఉన్నాయో ధర్మామీటరుతో తెలుసుకొంటాం కదా! ధర్మామీటరు వస్తువుల, పదార్థాల ఉష్ణోగ్రతను తెలుపుతుంది కదా నేస్తాలూ! ఉష్ణోగ్రత పదార్థం లేక వస్తువు సగటు గతిజశక్తికి కొలమానము. కణాలు ఎంత ఎక్కువ సగటు వేగంగా కదులుతుంటే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉంటుంది. రెండు పదార్థాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటే వాటి కణాల సగటు గతిజశక్తి కూడ సమానంగా ఉంటుంది. ఉష్ణోగ్రతను సెల్సియస్ లేక ఫారన్ హీట్ స్కేళ్ళలలో కొలుస్తారు. నీరు 32°F లేక 0°C దగ్గర గడ్డకడితే 212°F లే 100°C వద్ద మరుగుతుంది. నేస్తాలూ, ఉష్ణశక్తి ఎలా కదులుతుందో చేసి తెలుసుకొందాం. ఒక మంచు ముక్కను గ్లాసులో వేసి కొంచం సేపు పరశీలించండి. మంచుముక్క ఉష్ణోగ్రత 0°C (32°F). మంచుముక్కకు ఉష్ణ శక్తి ఉంటుంది. కానీ తక్కువ. దానిలోని నీటి అణువులు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. గదిలో ఉన్న గాలి వేడిగా షుమారు 30°C ఉంటుంది. అంటే గాలికణాలు చాల వేగంగా కదులుతుంటాయి. కొంచం సేపటికి గాలి ఉష్ణశక్తి మంచుముకకు బదిలీ అవుతుంది. ఆ విధంగా మంచు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల మంచులోని నీటి కణాలు వేగంగా కదలటం మొదలవుతుంది. మంచు ఉష్ణోగ్రత 0°C కంటే పైకి పెరుగుతుంది. ఆ విధంగా మంచు కరిగి నీరుగా మారుతుంది. నీటి ఉష్ణోగ్రత పెరిగే కొలది నీటి కణాలు వేగంగా కదలటం మొదలవుతుంది. అంటే నీటి కణాలకు ఎక్కువ ఉష్ణశక్తి బదిలీ అయిందన్నమాట. ఎక్కువ సేపు వాటిని గ్లాసులోనే ఉంచితే గాలి ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రత ఒకటే అవుతాయి కదూ! ఒక వస్తువులోని ఉష్ణ శక్తి దాని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటే ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకు ఎక్కువ ఉష్ణశక్తి ఉంటుంది. అదే విధంగా తక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకు తక్కువ ఉష్ణశక్తి ఉంటుంది. ఉష్ణ శక్తి కదులుతుందా! నేసాలూ! మీరంతా వేడి అనేపదాన్ని వాడతారు ఉదా! వేడి అంటే ఏమిటి? ఉష్ణశక్తి వెచ్చటి వస్తువులనుంచి చల్లని వస్తువులకు బదిలీకావటాన్ని వేడి అంటారు. కమ్మరికి ఈ విషయం బాగా తెలును. వారు మంటలను ఉపయోగించి ఇనుమును వేడిచేసి అది వెత్తగా అవంగానే కావలసిన ఆకారంలోకి అది చల్లబడకముందే మలుస్తారు. నేస్తాలూ, ఉష్ణశక్తి బదిలీ ఎన్ని విధాలుగా అవుతుందో తెలుసా! కణాలు ఒకదానికొకటి ఢీకొనటం వలన ఉష్ణ శక్తి బదిలీ కావటాన్ని ఉష్ణవాహకత అంటారు. చల్లని ఘనపదార్థంలోని కణాలకు ఉష్ణశక్తి ఎక్కువగా ఉండదు. దానికి ఉష్ణశక్తిని యిచ్చినట్లయితే కణాలు వేగంగా కదలటం మొదలయి వెచ్చగా మారుతుంది. వెచ్చటి ఘనపదార్థాలు చల్లని ఘన పదార్థాలను తాకినప్పుడు వెచ్చని పదార్థాల నుంచి ఉష్ణశక్తి చల్లని పదార్థాలకు బదిలీకావడాన్ని వాహకత అంటారు. నేస్తాలూ! లోహాలు చక్కటి ఉష్ణవాహకాలు, లోహపాత్రలో పాలు పోసి వేడి చేయండి. త్వరగా వేడెక్కుతాయి కదా! లోహపాత్ర సులభంగా ఉష్ణశక్తిని వాహకత ద్వారా బర్నర్ నుంచి గ్రహించి పాలకు బదిలీ చేస్తుంది కదూ! వేడి పాలను చెంచాతో కలిపితే చెంచా చివర వేడెక్కుతుంది కదా! ఇది కూడా ఉష్ణవాహకత ద్వారా జరుగుతుంది కదూ! వాహకత ద్వారా ఉష్ణశక్తి వెచ్చటి వస్తువుల నుంచి చల్లటి వస్తువులకు బదిలీ అవుతుందన్న ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నేస్తాలూ! మంచుముక్కను చేతితోపట్టుకొంటే ఏమి జరుగుతుంది? మీరేమనుకొంటారు మంచుముక్క నుంచి చల్లదనం చేతిలోకిపోతుందనుకొంటారు కదూ! అది సరి కాదు నేస్తాలూ! ఉష్ణశక్తి చేతి నుంచి మంచుముక్కకు వాహకత ద్వారా బదిలీ అవుతుంది. ఆ విధంగా ఉష్ణశక్తి చేతి నుంచి నష్టపోవటం వల్ల చల్లగా అనిపిస్తుంది. తెలిసిందికదూ! నేస్తాలూ! వేడి వేడి కాఫీ లోకి చల్ల నిపాలు నెమ్మదిగా పోని కదపకుండా పరిశీలించండి. పాలు రిబ్బన్ లాగా, మేఘాలులాగా సుడులు తిరుగుతూ కాఫీలో కలుస్తుంది. రెండిటి ఉష్ణోగ్రతలు ఒకటి కాగానే సుడులు తిరగటం ఆగిపోతుంది. ప్రవాహం ద్వారా ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. దీనినే ఉష్ణ సంవహనం అంటారు. ప్రవాహం ద్రవం ద్వారా కానీ వాయువు ద్వారా కానీ కావచ్చు. ఉష్ణ సంవహనం ప్రవాహంలోని ఉష్ణోగ్రత భేదాల వల్ల జరుగుతుంది. వేడిగా ఉన్న ప్రవాహం ఘనపరిమాణం పెరగటం వలన దాని సాంద్రత తగ్గుతుంది. వేడిగా ఉన్న ద్రవ ప్రవాహం సాంద్రత చల్లని ద్రవ ప్రవాహసాంద్రత కంటే తక్కువగా ఉండి వేడిగా వున్న ద్రవం పైకి కదులుతూ కలసిపోతుంది. ఆ విధంగా వేడి ద్రవంపైకి, చల్లని ద్రవం క్రిందికి కదులుతూ ఉష్ణశక్తి వేడి ద్రవం నుండి చల్లని ద్రవానికి బదిలీ అయి రెండింటి ఉష్ణోగ్రతలు సమానమవుతాయి. నేస్తాలూ! ఇక మూడవ ప్రక్రియలో ఉష్ణశక్తి బదిలీకి పదార్థం అవసరం లేదు. ఉష్ణశక్తి వికిరణాల తరంగాల ద్వారా బదిలీ అవుతుంది. నేస్తాలూ! సూర్యకాంతి ద్వారా పదార్థాలకు ఉష్ణశక్తి బదిలీ కావడము ప్రతి రోజూ చూస్తూనే ఉన్నారు కదా? సూర్యునికి భూమికి మధ్య ఉన్న ప్రదేశం ద్వారా సూర్య కిరణాలు (ఉష్ణశక్తి). భూమిపై పడి భూమి ఉపరితల పదార్థాలను వేడి చేస్తాయి. నేస్తాలూ! పాలు మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేస్తారు కదూ! ఉష్ణశక్తి మైక్రోవేవ్ వికిరణాల ద్వారా పాలకు బదిలీ అవుతుంది. నేస్తాలూ! వేడిపాలు చల్లార కుండా థర్మాస్ ఫ్లాస్క్‌లో పోస్తారు కదూ! థర్మాస్ ఫ్లాస్క్ ఉష్ణ బంధకంగా పనిచేసి పాలనుంచి ఉష్ణశక్తి బయటకుపోకుండా ఉంటుంది. నేస్తాలూ! మీరు చలికాలంలో ఉన్నదుస్తులు ధరిస్తారు కదూ! కారణం మీ శరీర ఉష్ణశక్తి బయట చల్లని పరిసరాలకు బదిలీ కాకుండా ఉన్ని దుస్తులూ ఉష్ణ బంధకాలుగా పనిచేస్తాయి కదూ! ఆధారం: ప్రొ. ముండ్రా ఆదినారాయణ