కాగితాన్ని తీసుకొని దాన్ని చతురస్రాకారంలో కత్తిరించండి. తరువాత పటంలో చూపిన గీతల వెంబడి దాన్ని రెండుసార్లు మడతపెట్టండి. (అప్పడది ఒక త్రిభుజాకృతిలో మీకు కనిపిస్తుంది. త్రిభుజాకృతిలో ఉండే ఈ కాగితాన్ని 2 వ నెంబరు పటంలో చూపిన విధంగా ఒక పద్ధతి ప్రకారం కత్తిరించండి. ఒక వైపున మొదలుపెట్టిన కత్తిరింపుని రెండవ అంచు దాకా కొనసాగించకూడదు. రెండో అంచుని చేరడం కన్నా కొంచెం ముందే ఈ కత్తిరింపుని నిలిపివేయాలి. ఒకసారి ఇటువైపు నుంచి కత్తిరిస్తే ఒకసారి అటువైపు నుండి కత్తిరించాలి. మొత్తం కత్తిరింపు పూర్తయ్యాక మడతల్ని విప్పి కాగితాన్ని మళ్లీ చతురస్రాకారంలోకి తీసుకురావాలి. తరువాత మీ చేతివేళ్ల సాయంతో దాని నాలుగు అంచులను పట్టుకొని దాన్ని సున్నితంగా రెండు చేతివేళ్ళతో బయటకు లాగాలి. అంతే చక్కటి కాగితం ఉట్టి తయారవుతుంది. ఇలాంటి కాగితం ఉట్లను ఒక దానిలో మరొకదాన్ని ఒకే పద్ధతి ప్రకారం, జిగురుతో అతికించడం ద్వారా చక్కటి కాగితపు గొలుసులను కూడా తయారు చేయవచ్చు. ఇందుకై రంగురంగుల కాగితాలను ఉపయోగిస్తే ఆ గొలుసులు మరింత అందంగా కన్పిస్తాయి. ఇక్కడ ఇచ్చిన పటంలో ఓ రెండు ఉట్లను ఒక దానిలో ఒకటి అతికించగా వచ్చిన కాగితపు గొలుసును మీరు చూడవచ్చు.