గాలి కూడా ఒక పదార్థమనీ, దానికి కూడా మిగతా పదార్థాల్లాగే బరువు అనేది ఉంటుందని మీ అందరికీ తెలిసిందే కదా. దానికి అసలు బరువునేది ఉంటుందా... ఉండదా? ఉంటే అది ఎంత వుంటుంది. అన్న విషయాలను తెలుసుకునేందుకు పనికొచ్చే చక్కటి ఓ రెండు ప్రయోగాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా... సన్నగా, పొడవుగా వుండే (వెదురు పుల్లలాంటి) ఒక కట్టెపుల్లను తీసుకోండి. సరిగ్గా దాని మధ్య భాగంలో దారాన్ని కట్టి దాన్ని గాల్లో, వేలాడదీయండి. గాల్లో వేలాడుతున్నపుడు ఈ కట్టెపుల్ల నేలకు సమాంతరంగా ఉండేలా, దారాన్ని కొంచెం అటూ ఇటూ మార్చి సరిచేయండి. ఓ రెండు గాలిబుడగలను (బెలూన్ లను) తీసుకుని ఆ రెండింటిలోనూ (దాదాపు) సమానంగా గాలిని ఊదండి. ఆ తరువాత వాటి మూతులు దారంతో బిగించి కట్టేయండి. కట్టెపుల్ల మధ్యభాగానికి సమానదూరంలో చెరోవైపున ఓ బెలూన్ ని తిన్నగా వేలాడతీయండి. ఇలా బెలూన్ లను వేలాడదీశాక కూడా ఆ కట్టెపుల్ల సరిగ్గా భూమికి సమాంతరంగా ఉండాలి. ఒకవేళ అలా లేకుండా కట్టెపుల్ల ఎటో ఒక వైపుకి కొంచెం వాలి ఉన్నట్లయితే బెలూన్లను కొంచెం అటూ ఇటూ జరపడం ద్వారా దానిని సరి చేయాలి. ఆ విధంగా మన ప్రయోగానికి కావలసిన అసలు సాధనం తయారవుతుంది. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెలూన్ ల త్రాసులో ఏదో ఒక వైపున ఉన్న బెలూన్ ని సూదితో గుచ్చి పేల్చివేయాలి. ఏం జరుగుతుందో తెలుసా... ఒక బెలూన్ పేలిపోయిన వెంటనే మన బెలూన్ల త్రాసు రెండో వైపున మొగ్గు చూపుతూ అటువైపున వాలిపోతుంది. ఆ బెలూన్ లో గాలి ఉండడం వల్ల ఆ గాలికి కొంత బరువు ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని మీకు వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ మనం ఈ రెండో వైపున ఉన్న బెలూన్ ని కూడా పేల్చి వేసినట్లయితే వెంటనే మన కట్టెపున్న తిరిగి మామూలుగా అంటే తిన్నగా అయిపోతుంది. ఎంత బరువుంటుంది? ఒక లీటరు ద్రవం పట్టే సీసాలో గాలిని నింపండి. ఈ గాలిని 1 లీటరు గాలి అని అనుకుందాం. ఇప్పుడే సీసా మీద మూత పెట్టి, గాలితో సహా దాని బరువును తూకం వేయండి. ఆ తరువాత సీసాలోని గాలిని పూర్తిగా తీసివేసి (ఇది కొంచెం కష్టమైన పనే) మళ్లీ సీసాను తూకంవేయండి. మొదటి బరువు నుంచి రెండో బరువును తీసేస్తే మీకు ఒక లీటరు గాలి బరువు ఎంతో తెలిసిపోతుంది. ఇలాంటి ప్రయోగాన్ని పరిశోధనాశాలలో చేసి 1 లీటరు గాలి బరువు సుమారు 1 గ్రాము ఉంటుందని తేల్చారు. గాలి సాంద్రత, ఉష్ణోగ్రత, అందులో ఉండే నీటి ఆవిరి తదితర అంశాలను బట్టి గాలి తాలూకు బరువు వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఉండే అవకాశమూ ఉంది. అలాగే ఒకేచోట వేర్వేరు సమయాల్లో వేర్వేరు బరువులతో ఉండే అవకామూ ఉంది.