ఒక ప్లాస్టిక్ బంతిని (8 అంగుళాల వ్యాసం) తీసుకొని దానికి 2 అంగుళాల చతురస్రాకార అద్దాన్ని (మొహం చూసుకొనే అద్దం) సెల్లోపిన్ టేపుతో ఏదో ఒకవైపు అతికించాలి. బంతికి ఎక్కడో ఒకచోట రంధ్రం చేసి దానిలో ¼ వంతు ఇసుక పోస్తే బంతి ఎలా ఉంచితే అలా కదలకుండా నిలబడుతుంది. తరువాత ఎండలోకి వెళ్ళి అద్దం అతికించిన బంతిని నేలపై ఉంచి సూర్యుని వెలుతురు మన ఇంట్లోకి వచ్చేట్టుగా అమర్చాలి. అద్దం నుంచి బయలుదేరిన సూర్యుని కాంతి మన ఇంట్లో గోడమీద గుండ్రంగా పడుతుంది. (అద్దం చతురస్రాకారంగా ఉంది కదా అద్దం ప్రతిబింబించే సూర్యుని వెలుతురు కూడా చతురస్రాకారంగానే ఉండాలి కదా అనుకునేరు... అలా ఉండదు అది గుండ్రంగా ఉంటుంది) మీ ఇంటిలో గోడపైన పడే సూర్యుని ప్రతిబింబానికి మీరు అద్దం ఉంచిన ప్రదేశానికి మధ్య దూరం 30 మీటర్లు లేదా అంతకు మించి ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకొన్న తరువాత ఒక అట్ట ముక్కను తీసుకొని దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం (పెన్సిల్ దూరేంత) చేసి అద్దం ముందు ఒక అడుగు దూరంలో ఉంచాలి. ఆ రంధ్రం గుండా, అద్దం నుంచి వెలువడిన కాంతి వచ్చేట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు గోడ మీద సూర్యుడి ప్రతిబింబం ఏర్పడుతుంది. బాగా గమనిస్తే సూర్యుడి ప్రతిబింబంలో నల్లటి మచ్చలు కొన్ని కనిపిస్తాయి. ఇవి సూర్యునిపై నున్న సన్ స్పాట్స్ అన్నమాట. శుక్రుడు సూర్యుని అంచుకి వచ్చి సూర్యుడిలోకి దూరేటప్పుడు చాలా స్పష్టంగా ఒక నల్లని మచ్చలాగా సూర్య ప్రతిబింబంలోకి దూరడం మీరు గమనించవచ్చు. ఇలా దూరిన శుక్రుని ప్రతిబింబం నెమ్మదిగా సూర్యుని మీద ప్రయాణిస్తుంది. సూర్యుడు వెలుపలి దాకా వెళ్లేంతవరకు చూడొచ్చు. అయితే ట్రాన్సిట్ 8, జూన్ 2004 రోజున గంట 10.43 ని,,లకు మొదలై సాయంత్రం గం,, 4.56 ని. ల వరకు జరుగుతుంది. కాబట్టి ఆ ని. లో, సూర్యుడు తూర్పు నుండి పడమర వరకు ప్రయాణిస్తాడు. కాబట్టి మీరు మీ అద్దాన్ని (బంతిని) తదనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఈ పద్దతిలో ట్రాన్సిట్ ని అవకాశం ఉంటే ఎంత మందికైనా సురక్షితంగా చూపించవచ్చు. నిర్వహణ : సి.హెచ్. ఆనందరాంసింగ్, జి. కామయ్య, నెల్లూరు.