ధరిణికి గిరి భారమా. గిరికి తరువు భారమా తరువుకి కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా... చిన్నప్పుడు మా అమ్మ ఈ పాత సినిమా పాట పాడేది. భూమికి కొండ భారమా, కొండకు చెట్టు భారమా, చెట్టుకు కాయభారమా, కనిపెంచి పెద్ద చేసే తల్లికి పిల్లలు భారమా అని అర్థం. అమ్మను మించిన ప్రేమమూర్తి లేదు కదా. మరి ఈ బరువుకు సంబంధించి ఓ చిన్న వస్తువులతో పాటు కంటికి కనిపించని... ఆ... చెప్పండి... కాంతి వుంది. ఇంకా... ఆ... యస్ గాలి ఉంది. కదా. గాలిలో ఏమేమి వున్నాయి. కరెక్ట్... ఆక్సీజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్... వున్నాయి కదా. వీటిలో కార్బన్ డై ఆక్సైడ్ గాలి కంటే బరువైనది. గాలిలోన బరువైన గాలి వేరయా అదే కార్బన్ డై ఆక్సైడ్ అయ్యా... అనుమానమా కార్బన్ డై ఆక్సైడ్ బరువైనది కాదని అనుమానమా? అనుమాన నివృత్తికి ప్రయోగమే మార్గం. అయితే ఇంకెందుకు ఆలస్యం. రండి. ప్రయోగం చేసి చూద్దాం. ప్రయోగానికి కావలసిన పరికరాలు: గాజుసీసా, పేపరు, పెన్సిల్, ఓ పెద్ద పాత్ర, వివిధ సైజుల్లో, క్రొవ్వొత్తులు 3, వెనిగర్ గుడ్డలసోడా (వాషింగ్ సోడా) చేయు విధానమ: గాజు సీసాలో తయారయిన వాయువు పాత్రలోనికి పంపడానికి సైఫన్ (పంపు గొట్టం) కావాలి. కాబట్టి మొదట పంపు గొట్టం తయారుచేస్తామా? పొడవాటి పెన్సిల్ పై కాగితాన్ని చుట్టూ చుట్టండి. చుట్టుతూ చివరగా పేపరు అంచుకు గమ్ (బంక) పూసి అతికించండి. పెన్సిల్ కు గన్ అంటుకోకుండా జాగ్రత్త తీసుకోండి. గమ్ ఆరిపోయిన తరువాత పెన్సిల్ ను లాగి తీసివేస్తే... పేపరు గొట్టం తయారు. దీన్ని పంపుగొట్టంగా చేయడానికి ¾ వంతు దగ్గర కత్తరించి కొంతకోణంతో తిరిగి అతికించాలి. దీనికై పేపరు ముక్కలు, గమ్ వాడండి. పటంలో చూపిన విధంగా పంపుగొట్టం తయారు. తరువాత పెద్దపాత్రలో 3 క్పొవ్వొత్తులను కాస్త ఎడంగా అమర్చి వెలిగించండి. (పటము). సీసాలోనికి సగం వరకు వెనిగర్ ద్రవం పోయండి. (హోటళ్ళలో ఫ్రైడ్ రైస్ తయారీకి ఈ వెనిగర్ వాడుతారు. పచారీకొట్లలో దొరుకుతుంది.) ఆపై గుడ్డలసోడా (వాషింగ్ సోడా) పొడిని పోసి పేపరు గొట్టాన్ని అమర్చండి. బాటిల్ లో బుడగల రూపంలో వాయువు వెలువడి పేపరుగొట్టం గుండా ప్రయాణించి పాత్రలోనికి చేరుతుంది (పేపరు గొట్టం బాటిల్ నుంచి పాత్రలోనికి పటంలో చూపిన విధంగా అమర్చాలి.) ఇప్పుడు క్రొవ్వొత్తులను గమనిస్తూ వుండండి. మొదట చిన్న క్రొవ్వొత్తి ఆరిపోతుంది. తరువాత దానికున్న కాస్త పెద్ద కొవ్వొత్తి ఆరిపోతుంది. ఆపై చివరగా పెద్ద కొవ్వొత్తి ఆరిపోతుంది. ఇలా ఎలా జరిగింది. అసలు సంగతి ఏమిటి? వివరణ: వెనిగర్, సోడా రసాయన చర్య నొంది కార్బన్ డై ఆక్సైడ్ వెలువడింది. ఇది పేపరుగొట్టం గుండా ప్రయాణించి పాత్రను చేరింది. ఇది గాలి కంటే బరువైంది కనుక మొదట పాత్ర క్రింది భాగంకు చేరుతుంది. ఇంకా ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ క్రిందికి చేరుతూ పాత్రలోని గాలిని పైకి నెట్టుతూ పాత్ర మొత్తం ఆక్రమించడం మొదలవుతుంది. అంటే వాయువు పాత్రలో క్రింద నుండి పైకి వ్యాపిస్తూ గాలిని తొలిగిస్తూ పోతుంది. కార్బన్ డై ఆక్సైడ్ నిప్పును ఆర్పివేసే గుణం కలిగివుంది. కాబట్టి పైకి వ్యాపించేటప్పుడు మొదట చిన్న క్రొవ్వొత్తిని ఆపై కాస్త పెద్ద కొవ్వొత్తిని ఆర్పివేసి పాత్ర అంతాకార్బన్ డై ఆక్సైడ్ వ్యాపించిందన్నమాట. రసాయన చర్యను గమనించండి. 2CH3COOH + Na2CO310(H2O) → 2CH3COONa + 11H2O + CO2 కాబట్టి కార్బన్ డై ఆక్సైడ్ గాలికంటే బరువైనది అని నిరూపణ అయింది కదా. ఈ లక్షణం వల్లనే కార్బన్ డై ఆక్సైడ్ ను అగ్నిమాపక పరికరాలలో ఉపయోగిస్తారు. అగ్నిమాపక పరికరాన్ని వినియోగించనప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ తయారై మంటలపై వ్యాపించి గాలిని తొలిగిస్తుంది. అప్పుడు ఆక్సీజన్ అందక, మంటలు ఆరిపోతాయి. కాబట్టి గాలిలోన బరువైన కార్బన్ డై ఆక్సైడ్ గాలి వేరయా... అంటే ఒప్పుకుంటారు కదా... సరేనా... ఆధారం: యుగంధర్ బాబు