“విద్యుల్లత” అంటే ఏమిటో తెలుసా? మెరుపు తీగ. వర్షాకాలంలో ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ విద్యుల్లతలు (మెరుపులు - lightning) మెరుస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయో మీకు తెలుసు కదా. అత్యధిక, వ్యతిరేక విద్యుదావేశాలు గల మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు విద్యుత్తు గాలి గుండా ప్రవహించి మెరుపులు ఏర్పడతాయి. ఇక్కడ తీగలు లేకుండానే విద్యుత్తు ప్రవహించింది కదా. మరి మనం కూడా ఇలా తీగలు లేకుండానే విద్యుత్తుతో ఒక చమత్కారం చేద్దామా. సెల్ (ఘటము - battery)తో బల్బు వెలిగించాలి. వైర్లు లేకుండా... అని మీ స్నేహితునితో పందెం కాయండి. ఎలాగూ వాళ్ళు చేయలేరు కనుక మీరు చేసి చూపండి. ఎలా... అంటారా? రండి చేసి చూద్దాం. పటములో చూపిన విధంగా సెల్ (ఘటము - battery), పెన్సిల్, టార్చ్ బల్బ్, కత్తెర (చిన్నది) అమర్చండి. అంటే తీగలు (వైర్లు) లేకుండానే బల్బు వెలుగుతుంది. అంటే మీరు పందెం గెలిచారు. ఇది ఎలా జరిగింది? పెన్సిల్ నందు గల నల్లని ముక్క గ్రాఫైట్ తో తయారు చేయబడింది. గ్రాఫైట్ అలోహం అయినప్పటికీ మంచి విద్యుత్తు వాహకము. ఇక కత్తెర ఇనుముతో తయారుచేయబడింది. ఇనుము విద్యుత్ వాహకమని మనకు తెలుసు కదా. బొమ్మలోని అమరికలో ఋణ విద్యుత్తు దృవం నుండి విద్యుత్తు కత్తెర ద్వారా ప్రయాణించి బల్బులోని ఫిలమెంటు ద్వారా ప్రవహించి వెలువడి పెన్సిల్ ముక్క (graphite) గుండా ప్రవహించి ధన ధృవాన్ని విద్యుత్ వలయాన్ని పూర్తి చేసింది. కనుక బల్బు వెలిగింది అన్నమాట... సరేనా! ఆధారం: యుగంధర్