మెజీషియన్ భలే గమ్మత్తులు చేస్తున్నాడు. ఎవరూ చేయలేరనుకున్నవి కూడా చేసి చూపిస్తున్నాడు. ఇదేదో మాయలా ఉందనుకున్నా బాగా ఆలోచిస్తే ప్రతీ మేజిక్ లోను ఏదో సైన్స్ దాగి ఉందని సైన్స్ టీచర్ చెబితే తెలిస్తోంది. మేజిక్ షో విద్యార్థుల్లో ఎంతో ఆసక్తిని, సైన్స్ బాగా చదవాలన్న పట్టుదలను పెంచుతోంది. మెజిషియన్ సుబ్బును స్టేజిమీదకు ఆహ్వానించారు హెడ్మాస్టర్ రామారావు. సైన్స్ టీచర్ లక్ష్మీ కూడా స్టేజి మీదికి వచ్చింది. మేజిక్ షో మొదలయ్యింది. బూరెలయినా, గారెలయినా, పాయసమయినా మరేదైనా మరీ వేడిగా ఉంటే మనం తినలేం.ఎందుకంటే నోరు కాలుతుంది. అలాంటిది, నిప్పును నోట్లో పెట్టుకుంటే, అమ్మో! నాలుక కాలి బొబ్బెలెక్కుతుంది. అవునా? అన్నారు మెజీషియన్. అవును సార్ అన్నారు విద్యార్థులంతా. కాని మండుతున్న అరటిపండును, మంటల్లో ఉన్న జీడిపప్పును తీసుకొని నోట్లో పెట్టుకొని తింటాను చూడండి, అన్నాడు మెజీషియన్. టేబుల్ మీద ఉన్న అరటిపండును తీసుకొని దాని తొక్కలు తీసి అందరికి చూపించాడు. మెజీషియను సుబ్బు అరటి పండు ఒక చివరను చేత్తో పట్టుకొని, రెండో చివరను గాజు గ్లాసులో ఉన్న రంగులేని ద్రవంలో ముంచాడు. సైన్స్ టీచర్ మెజీషియన్ చెప్పినట్టే చేసింది. అరటిపండు మండటం ప్రారంభించింది. వెంటనే మండుతున్న పండును నోట్లో పెట్టుకొని చక్కగా తినేశాడు. అంతా చప్పట్లు కొట్టారు. “థాంక్యూ, థాంక్యు.” అన్నాడు మెజీషియన్. నేనిప్పుడు ఇంకో మేజిక్ చేస్తాను. ఈ పింగాణీ గిన్నెలో జీడిపప్పు ఉంది. ఈ పప్పు మంటల్లో ఉన్నా నేను తీసుకొని తింటా అంటూ, గాజుగ్లాసులోని ద్రవాన్ని ఆ పప్పు మీద కొంచెం చల్లి ఏదో మంత్రాలు చదివినట్లు నటించాడు.సైన్స్ టీచరును అగ్గిపుల్లతో అంటించమన్నాడు. టీచర్ అగ్గిపుల్లను వెలిగించి జీడిపప్పును తాకించింది. వెంటనే మంటలు వచ్చాయి. మెజీషియన్ ఒక ఫోర్క్ తో మండుతున్న జీడిపప్పును తీసుకొని నోట్లో వేసుకొని తినేశాడు. అంతా చప్పట్లు కొట్టారు. ఇదంతా ఈ గ్లాసులోని మంత్రజాలం, మహిమ అన్నాడు మెజీషియన్. అనిష్ కి మాత్రం ఏదో సందేహం పీకుతూనే ఉంది. దీంట్లో కూడా ఏదో సైన్స్ రహస్యం ఉండే ఉంటుంది. సైన్స్ టీచర్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. సైన్స్ క్లాస్ అయ్యింది. తర్వాత ఇంటర్వెల్ లో వెళ్ళి సైన్స్ టీచర్ని అడిగాడు. ఈ మేజిక్ ను మనం కూడా చేయగలం అని అంది టీచర్. మెజీషియన్ ఉపయోగించింది మంత్రజాలం కాదు. ఇది ఇథైల్ ఆల్కహాల్ అనే రసాయనం. ఇది రంగులోని ద్రవం. ఇది తేలిగ్గా మండి చల్లని మంటనిస్తుంది అని చెప్పింది టీచర్. ఈ మేజిక్ కు కావల్సినవి ఇథైల్ ఆల్కహాల్, అరటిపండు, జీడిపప్పు, పింగాణీ గిన్నె, ఫోర్క్, అగ్గిపెట్టె. గాజు గ్లాస్ లో ఇథైల్ ఆల్కహాల్ తీసుకోవాలి. అరటిపండు తొక్కతీసి, ఒక చివర ఆల్కహాల్ లో ముంచి అగ్గిపుల్లతో అంటిస్తే మంటనిస్తుంది. మండుతున్న పండును నోటిలో పెట్టుకునే క్షణం ముందు ఊదితే మంట ఆరిపోతుంది. పండును చక్కగా తినేయవచ్చు. అలాగే జీడిపప్పును ఆల్కహాల్ లో తడిపి అంటిస్తే మండుతుంది. ఫోర్క్ సాయంతో మండుతున్న జీడిపప్పును తీసుకొని నోట్లో పెట్టుకునే ముందు మంటను ఊది ఆర్పేసి, నోట్లో వేసుకోవాలి. మండుతున్నది ఆల్కహాల్ కదా. మంటను ఆర్పిన వెంటనే అరటిపండు, జీడిపప్పు, ఇంకేదైనా చల్లబడిపోతుంది. నోట్లో వేసుకునే క్షణంలోనే మంటను ఆర్పుతాం కాబట్టి మండుతున్న పండును, పప్పును మెజీషియన్ తింటున్నట్లే ప్రేక్షకులకి కన్పిస్తుంది. నోరుకాలదు, అయినా ఇలాంటి మేజిక్ లు చేసేందుకు అనుభవం అవసరం. జాగ్రత్తగా ఉండాలి. అనిష్ కి అర్థమయ్యింది. ఆధారం: ఇ.ఆర్. సుబ్రమణ్యం