ఉద్దేశ్యం: కాల్షియం కార్బైడ్ కు నీటిని కలిపి, ఎసిటలీన్ వాయువును తయారుచేసి తద్వారా మంటలను ఎక్కువ చేయడం. కావలసిన పరికరాలు: చిన్న ప్లాస్టిక్ లేదా స్టీలు పళ్ళెము, పేపరు ముక్కలు, అగ్గిపెట్టె. కావలసిన రసాయనాలు: ఇసుక, కాల్షియం కార్బైడ్ (CaC2) ప్రయోగ విధానం: ప్లేటులో ఇసుకను తీసుకొని, పైభాగంలో కొంచెం కాల్షియం కార్బైడ్ ను చల్లి (CaC2) దానిపై పేపరు ముక్కలను వేసి అగ్గిపుల్లతో మండించాలి. తర్వాత కొంచెం కొంచెం నీటిని చల్లుతూ వుంటే మంటలు ఎక్కువవుతుంటాయి. పరిశీలనలు: కాల్షియం కార్బైడ్ నీటిలో చర్య జరిపి ఎసిటలిన్ వాయువును విడుదల చేయును. CaC2+2H2O→C2H2+Ca(OH)2 ఎసిటలీన్ వాయువు ఇంధనం కాబట్టి మంటలను ఏర్పరుచును. ఇది గాలిలోని ఆక్సీజన్ తో చర్యనొంది కార్బన్ డై ఆక్సైడ్, నీరును ఏర్పరుస్తుంది. నీటిని చల్లుతూవుంటే ఎసిటలీన్ వాయువు మరింత ఉధ్భవించి మంటలను ఎక్కువ చేస్తుంది. మీకు తెలుసా? నీటిలో మంటలు ఆర్పడం సైన్స్ చెబుతుంది. అదే సైన్స్ నీటిని చల్లడం ద్వారా మంటలను ఎక్కువ చేయవచ్చు. కాని ఈ రహస్యం తెలియని వారికి ఇది ఏదో మాయో, మంత్రమో అని భావించి మంత్రగాళ్ళ చేతిలో చిక్కి మోసపోతారు. ఉపయోగాలు: ఎసిటలీన్ వాయువును లోహాలను అతకడానికి ఉపయోగిస్తారు. పరిశ్రమలలో ఎసిటలీన్ వాయువును ఉపయోగించి అనేక కర్బన పదార్థాలు తయారుచేస్తారు. ఆధారం: కె. లక్ష్మారెడ్డి