'తమసోమా జ్యోతిర్గమయ' దీపం తాను కాలిపోతూ ప్రపంచానికి వెలుగును ఇస్తుంది. ‘చీకటిని తిడుతూ కూర్చోకు. ప్రయత్నించి ఓ చిరుదీపం వెలిగించు. నిన్ను, నీ పరిసరాలను కాంతివంతం చేసుకో.’ అన్నారు. ప్రకృతిలో చిన్న దీపం మిణుగురు పురుగు అయితే పెద్దదీపం సూర్యుడు కదా, ఇంట్లో వాడే క్రొవ్వొత్తి వెలుగు చూశారా... నిట్టనిలువుగా పెద్ద వెలుగుతో ప్రకాశవంతంగా వుంటుంది కదా. ఈ పెద్ద వెలుగు నుండి ఓ చిన్న వెలుగును పుట్టిదామా? ఆ....ఎలాగంటారా? రండి.... చేసి చూద్దాం. కావలసిన పరికరాలు: క్యాండిల్, అగ్గిపెట్టె, అల్యూమినియం ఫాయిల్ (హెటల్ పార్శిల్ బాక్స్ అల్యూమినియం మూత తీసుకోవచ్చు) క్లిప్పు పెన్సిల్ చేయు విధానము: మొదట అల్యూమినియం ఫాయిల్ ను ఓ పెన్సిల్ పై చాపలాగ చుట్టగా చుట్టాలి. పెన్సిల్‌ను తీసివేస్తే దాదాపు 6 సెం.మీ.ల పొడవు గల గుండ్రటి గొట్టం తయారవుతుంది. అదలావుంచి కేండిలోని అగ్గిపుల్లతో వెలిగించి టేబుల్ పై నిలువుగా అమర్చండి. ఇప్పుడు అల్యూమినియం గొట్టంను నలిగిపోకుండా మధ్యలో క్లిప్పు సహాయంతో పట్టుకొని గొట్టం ఒక కొసను క్యాండిల్ వెలుగు మధ్యలో వుండేలా అమర్చండి. (పటంలో చూపిన విధంగా) అలా అమర్చిన తరువాత గొట్టం రెండవ కొన నుండి పొగ వెలువడుతుంది. అగ్గిపుల్ల గీచి రెండవకొన వద్దకు తీసుకెళితే ఆశ్చర్యంగా పొగమంటను గ్రహించి వెలగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూస్తే క్యాండిల్ పై పెద్దవెలుగు, దాని నుండి 6 సెం.మీ. దూరంలో గొట్టం చివర చిన్నవెలుగు వెలుగుతూ వుంటుంది. పెద్దవెలుగు వెలిగినంత సేపు చిన్న వెలుగు కూడా వెలుగుతూనే వుంటుంది. అసలు ఏం జరిగింది. ఇది ఎలా సాధ్యం? వివరణ: క్రొవ్వొత్తి క్రొవ్వుతో తయారు చేయబడుతుందని మీకు తెలుసు కదా. ఈ క్రొవ్వు (వాస్) స్టెరీన్… రసాయన నామము (గ్లిజరాల్ టై స్టిరేట్) అనే కర్బన రసాయన పదార్థంతో తయారవుతుంది. దీన్ని జంతువుల క్రొవ్వు నుండి మరియు 'పాం' చెట్టు నుండి తయారుచేస్తారు. క్రొవ్వొత్తి వెలుగుతూ వున్నప్పుడు ఆ వేడికి స్టెరీన్ కరిగి ఆవిరై ఆక్సీజన్‌తో కలిసి మండి వెలుగుతూ వుంటుంది. ఈ వెలుగు అంచుల వద్ద మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో వుంటుంది. అక్కడ వున్న సెరీన్ పూర్తిగా మండుతుంది. కానీ వెలుగు మధ్య ఆవిరిరూపంలో వున్న సెరీన్ ఆక్సిజన్ అందక అలాగే వుంటుంది. మనం అమర్చిన అల్యూమినియం గొట్టం వెలుగు మధ్య వుంచినపుడు గొట్టం గుండా ఆవిరి సెరీన్ వెలువడింది. అగ్గిపుల్లతో వెలిగించినప్పుడు ఈ సెరీన్ వెలిగి చిన్న వెలుగు మండుతూనే వుంటుంది. అదన్నమాట. ఆధారం: యుగంధర్ బాబు