టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్... వాట్సప్... వీడియోగేమ్స్... ఇలా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఆడుకుంటూ మీరు ఆరుబయట ఆడుకోవడం మానివేసారు కదూ... ఆరుబయట స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.... హాయిగా ఆడుకుంటూ మీరు ఎపుడైనా గాలిపటం ఎగురవేశారా! పద పదవె వయ్యారి గాలిపటమా... పక్షిలాగ ఎగురుకుంటూ పదవే... అని పాతకాలం పాట. గాలిపటం కాగితంతో చేస్తారు కదా. కాగితం బలమైందా? బలహీనమైందా? దాని బలమెంతో మీకు తెలుసా? చూద్దామా... రెండు గ్లాసుల మధ్య కాస్త దూరం వుంచి గ్లాసులపై ఓ కాగితం అమర్చి (పటము 1లో) దానిపై ఇంకొక గ్లాసు ఉంచితే కాగితం గ్లాసు బరువును తట్టుకొని అలాగే ఉంటుందా? ఉండదు పటము 1లో చూపినట్లు కాగితం వంగిపోతుంది కదా. మరి ఇప్పుడు ఓ పందెం అదే కాగితం పై గ్లాసును నిలబెడతాను అని మీ స్నేహితులతో పందెం కాయండి. ఓ మీరు తప్పక గెలుస్తారు. ఎలాగంటారా? రండి! చేసి చూద్దాం! కావలసిన వస్తువులు: గాజుగ్లాసులు 3, ఒక ఏ4 సైజు కాగితం అంతే. చేయు విధానం: మొదట పటం 1లో చూపినట్లు కాగితంపై గాజుగ్లాసు మెల్లిగా ఉంచితే అవి క్రిందకు జారిపోతుంది కదా. తరువాత పందెం కాస్తాము కదా. ఇప్పుడు అసలు ప్రయోగం చేద్దాం. ఏ4 కాగితాన్ని విసనకర్ర మడతలులాగా మడవాలి. ఎలాగంటే రెండు సెంటీమీటర్ల వెడల్పుతో కాగితపు చివరన వెడల్పు భాగంలో ఓ మడత మడవండి. తరువాత రెండో మడత వెనుకకు మడవండి. ఇలా ముందుకు ఓ మడత వెనుకకు ఓ మడత చీర కుచ్చిళ్ల మడతలలాగ మడవాలి (దాదాపు 14 మడతలు వస్తాయి సుమా). పటము 2లో లాగ ఈ మడతలు దగ్గర దగ్గరగా వుండాలి. అంటే 2 సెం.మీ. ఎత్తులో కాస్త ఏటవాలుగా కాగితపు గోడలు నిలువుగా నిలబడి ఉంటాయన్న మాట. ఇప్పుడు రెండు గ్లాసులపై ఈ మడతలు కాగితాన్ని అమర్చి మూడవ గ్లాసును ఈ కాగితంపై నిలబెట్టండి (పటం 8). అంతే కాగితం వంగిపోకుండా గ్లాసును అలాగే నిలబెట్టుతుంది. చూసారా మీరు పందెం గెలిచేసారు కదా... ఇంతకీ కాగితానికీ అంత బలం ఎలా వచ్చింది? వివరణ: కాగితాన్ని మడత పెట్టడం వల్ల 2 సెం.మీ. ఎత్తుగల కాగితపు ముక్కలు వరుసక్రమంలో నిలువుగా నిలబడి దగ్గరదగ్గరగా అమర్చబడి ఉంటుంది. కాగితం పరచబడి ఉన్నప్పటి కంటే నిలువుగా ఉన్నప్పుడు పీడనానికి, ఒత్తిడికి తక్కువగా స్పందిస్తాయి. కాబట్టి నిలువుగా ఉన్న కాగితపు మడతలు గ్లాసు బరువును తట్టుకుంటాయి. అంతే కాక గ్లాసు బరువు ఒకే కాగితంపై వడక అన్ని కాగితపు వరుస మడతల పై విభజింపబడుతుంది. అందువల్ల గ్లాసు పడిపోకుండా నిలబడుతుంది అదన్న మాట. ఇదే సూత్రంపై ఇంటి పై కప్పు కోసం వాడే సిమెంటు రేకులు, ఇనుపరేకులు వంపు వంపుగా తయారు చేస్తారు. సమతలంగా ఉన్న రేకు కంటే వంపులు తిరిగిన రేకులు ఎక్కువ దృఢంగా ఉంటాయి. అదే విధంగా టీవీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్... పార్సిల్లు కోసం వాడే అట్టపెట్టెలు మీరు గమనించి వుంటారు. దీని తయారీలో కూడా రెండు కాగితపు పొరల మధ్య మరొక దళసరి కాగితం వంపులు వంపులుగా (చీర కుచ్చిళ్లలాగ) అమర్చి అతికించి వుంటారు. దీన్నివల్ల అట్ట పెట్టి సులభంగా వంగిపోకుండా దృఢంగా వుంటాయి. ఆధారం: పలమనేరు యుగంధర్ బాబు