మేజిక్ షో కు విద్యార్థులంతా కెమిస్ట్రీ ల్యాబ్ లో సమావేశమయ్యారు. మెజీషియన్ సుబ్బు లోపలికి వచ్చాడు. ఆయన చేతిలో ఒక పొట్లం ఉంది. ఆ పొట్లం విప్పి అందరికీ చూపించాడు. “ఇది రంపపు పొట్టు. మీ స్కూల్ కు వస్తూనే కొత్తగా కడుతున్న పాఠశాల గదుల దగ్గర వడ్రంగి పని వారు పనిచేస్తుండడం గమనించి, అక్కడ ఉన్న రంపపు పొట్టును కొంచెం పట్టుకొచ్చాను ఈ పొట్టును చక్కెరగా మారుస్తాం. అదే ఈ రోజు కెమిస్ట్రి మేజిక్,” అన్నాడు మెజీషియన్. రంపపు పొట్టు నుంచి చక్కెరా? ఇది ఎలా సాధ్యం అనుకున్నారంతా. కెమిస్ట్రీ టీచర్ లక్ష్మిని పిలిచి కాగితం మీద కొన్ని రసాయనాల పేర్లను రాసి వాటిని ల్యాబ్ నుంచి తీసుకురమ్మన్నాడు. కొన్ని నిమిషాల్లోనే అవి సిద్ధం అయ్యాయి. మెజీషియన్ ఒక పింగాణి గిన్నెను తీసుకుని అందులో 3 చెంచాల రంపపు పొట్టును ఉంచాడు. దానిలో కొంత నీటిని పోశాడు. తరువాత కెమిస్ట్రీ టీచర్ తెచ్చిన సీసాలోని ద్రవణాన్ని కలిపి గాజుకడ్డీతో కలియబెట్టాడు. పింగాణీ గిన్నెను ల్యాబ్ లో ఉన్న ఓవెన్ (oven)లో పెట్టమని టీచర్ చెప్పాడు. ఈలోగా లంచ్ బెల్ మోగింది. ”లంచ్ అయిన తర్వాత మళ్లీ కలుద్దాం.” అన్నాడు మెజీషియన్. మేజిక్ షో మళ్లీ మొదలయ్యింది. ఓవెన్ నుంచి పింగాణి గిన్నెను తీసి దానికి మరికొంత నీటిని కలిపి గాజు కడ్డీతో కలియబెట్టాడు. వేరే సీసాలో ఒక్క రంగులేని ద్రావణం ఉంది. దాన్ని పింగాణి గిన్నెలోని ద్రావణానికి కొంచెం కొంచెంగా కలిపాడు. మొదట్లో పొంగువచ్చి, క్రమంగా ఆగిపోయింది. ఇలా ఏర్పడిన ద్రావణాన్ని మరో సీసాలో పోసి మూతపెట్టి బాగా కదిపాడు. సీసాను టేబుల్ మీద ఉంచాడు. కొంతసేపటికి తెల్లని పదార్థం సీసా అడుగుకు చేరింది. పైకి తేటగా ఉన్న ద్రావణాన్ని వేరే పింగాణీ గిన్నెలోకి వడపోశాడు. ఈ పింగాణి గిన్నెను స్టౌ మీద కొద్దిసేపు ఉంచి ద్రావణంలో నీరు ఆవిరయ్యేంత వరకు వేడి చేశాడు. చివరికి పింగాణి గిన్నెలో స్పటికాకారపు ఘనపదార్థం మిగిలింది. ”ఇదిగో ఈ పదార్థాన్ని చూడండి. ఇదే చక్కెర మీలో ఎవరైనా వచ్చి రుచి చూడండి. మీకే తెలుస్తుంది.” అన్నాడు మెజీషియన్. ఎప్పుడూ సైన్స్ అంటే ఎంతో ఆసక్తి చూపించే అనిష్ సాకేత్ వెళ్లి ఆ పదార్థాన్ని కొంచెం రుచి చూశారు. ”భలే భలే, తియ్యగా ఉంది. ఇది చక్కెరే.” అన్నారు. విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. కెమిస్ట్రీ టీచర్ విద్యార్థుల ముందుకు వచ్చింది. ఈ రోజు ”మెజీషియన్ చాలా మంచి మేజిక్ చేసి చూపించారు. ఈ మేజిక్ లో రసాయన చర్యలు ఇమిడి ఉన్నాయి. వీటిని మీరంతా తెలుసుకోవాలి. నేను క్లుప్తంగా చెబుతా వినండి.” అని చెప్పింది. ”రంపపు పొట్టులో సెల్యులోజ్ అనే కార్పొహైడ్రేట్ ఉంటుంది. దీనికి మొదట కొంత నీటిని కలిపి తర్వాత టీచర్ తెచ్చిన సజల సల్ఫూరికామ్లాన్ని కలిపారు. అధిక ఉష్ణోగ్రత (ఓవెన్)లో పెట్టి వేడిచేశారు. ఆమ్ల సమక్షంలో సెల్యూలోజ్ జలవిశ్లేషణకు గురై చక్కెర ద్రవణాన్ని ఇచ్చింది. దీనిలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని మరో స్వచ్ఛమైన సున్నపుతేట (కాల్షియం హైడ్రాక్సైడ్)తో తటస్థీకరించాడు. సల్ఫూరికామ్లం కాల్షియం హైడ్రాక్సైడ్ తో చర్యనొంది కాల్షియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడింది. పైన తేటగా ఉన్న ద్రవణంలో చక్కెర కరిగి ఉంది. దీన్ని వడబోసి ఆవిరి చేస్తే చక్కెర స్ఫటికాలు లభిస్తాయి. ఇదే మెజీషియన్ తయారు చేసిన చక్కెర. రుచికి తియ్యగా ఉంది కదా. ఇది ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే తగినంతగా శుద్ధి చేయలేదు కదా.” అంటూ ముగించింది టీచర్ లక్ష్మి ”చాలా చక్కగా వివరించారు మేడమ్.” అంటూ మెచ్చుకున్నాడు మెజీషియన్. అంతా చప్పట్లు కొట్టారు. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం