చాల సులభమైన ప్రయోగం చేసి చూద్దామా! మనకు కొన్ని పేపర్ కప్పులు, క్రొవ్వొత్తి, అగ్గిపెట్ట, నీరు, పట్టకారు కావాలి. క్రొవ్వొత్తిని వెలిగించి పెట్టుకోవాలి. ఒక పేపర్ కప్పుని పట్టకారుతో పట్టుకొని వెలిగే క్రొవ్వువత్తి పై పెట్టండి. ఎమి జరుగుతుందో ఊహించండి. పేపరు కప్పు అంటుకొని మండిపోవడం మీరు గమనించారు కదూ! మరో కప్పును మూడు వంతులు నీటితో నింపి పట్టకారుతో పట్టుకొని క్రొవ్వొత్తి మంటలో వుంచండి. ఏమి జరుగుతుందో ఊహించారా! పేపరు కప్పు ఉండదు. కప్పులోని నీరు వేడెక్కడం మీరు గమనించండి. అలానే వేడిచేస్తూ పోతే నీరు మరుగుతుంది కూడా! నీటికి బదులు పాలు తీసుకొని వేడిచేసి, వేడివేడి పాలును త్రాగవచ్చు. నీటితోగాని పాలతో గాని నింపిన పేపరు కప్పు ఎందుకు మండిపోలేదు. ఆలోచించండి. ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన 'జ్వలన ఉష్ణోగ్రత' వుంటుంది. ఆ పదార్ధం దాని జ్వలన ఉష్ణోగ్రతకు చేరగానే మండిపోతుంది. ఉదాహరణకు ఒక కట్టె ముక్కను, ఒక పేపర్ ముక్కను తీసుకొని క్రొవ్వువత్తి మంటలో వుంచండి. ఏమి గమనిస్తారు? పేపరు వెంటనే అంటుకొని మండుతుంది. కట్టెముక్క మాత్రం కొంత సేపు వేడి చేసిన తరువాత అంటుకుంటుంది కదూ! అంటే కట్టె ముక్క జ్వలన ఉష్ణోగ్రత పేపరు జ్వలన ఉష్ణోగ్రతకంటే ఎక్కువని తెలుస్తుంది కదూ! పేపరు కప్పు క్రొవ్వొత్తి మీద పెట్టగానే మండి పోవడానికి కారణం అది త్వరగా జ్వలన ఉష్ణోగ్రతకు చేరినదన్నమాట. అయితే నీరువున్న, పేపర్ కప్పు తను గ్రహించిన ఉష్ణశక్తిని నీటికి బదలాయించటం వలన, నీరు వేడెక్కుతుందిగాని కప్పు మాత్రం జ్వలన ఉష్ణోగ్రతకు చేరదు. కప్పులోని నీరు మరిగినా పేపరు కప్పు మాత్రం మండిపోదు. అయితే పేపర్ కప్పు ఎప్పుడు మండిపోతుందో ఆలోచించండి! కప్పులోని నీరు అంతా ఆవిరి అయిపోయిన తరువాత మాత్రమే మండిపోతుంది. మరో ప్రయోగం చేద్దాం. ఒక పేపర్ కప్పులో ఇసుక తీసుకొని క్రొవ్వువత్తి మంటలో, పెట్టండి. ఏమి జరుగుతుందో ఊహించండి. పేపరు జ్వలన ఉష్ణోగ్రత 233o అంటే పేరు కప్పతో పాటు యినుక వేడెక్కుతుంది. అంత ఉష్ణోగ్రత వద్దకు రాగానే పేపర్ కప్పు తగలబడిపోతుంది. యిసుక ఆవిరయిపోవాలంటే చాలా అధికమైన ఉష్ణోగ్రతకు పోవాలి కదా మరి. అందువల్ల ఈ ప్రయోగంలో పేపర్ కప్పు ముందుగానే మండిపోతుంది. ప్రయోగ పరిశీలనల్లో తెలుసుకొన్నది. నీటి బాష్పీభవన స్థానం కంటే పేపర్ కప్పు జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువ. ఇసుక బాష్పీభవన స్థానం కంటే పేపర్ కప్పు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. అదేవిధంగా ఒక కాగితం జ్వలన ఉష్ణోగ్రత ఒక కట్టెముక్క జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ. ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ.