చెకుముకి నేస్తాలు అమ్మ ఎన్నో రుచికరమైన వంటకాలు తినిపిస్తుంది కదూ! నోరూరించే వడ, దోస, పూరి, చపాతి, ఇడ్లి, జొన్నరొట్టె ఇలాంటివి మరింకెన్నో కొసరి కొసరి తినిపిస్తుంది కదూ! మీకు సమతుల ఆహారం అందించటమే ఆమె ప్రధాన ఉద్దేశం. సమతుల ఆహారం అటే ఏమిటో మీకు తెలుసా? తినే ఆహారంలో శక్తినిచ్చే స్టార్చ్, ఆరోగ్యంగా పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, నూనె పదార్థాలు ఉంటే సమతుల ఆహారం అంటారు. నేస్తాలు... మనం తినే ఆహారంలో స్టార్స్, ప్రోటీన్లు, నూనె, కొవ్వు పదార్థాలు ఉన్నాయేమో పరీక్ష చేసి చూద్దామా మరి. పైన ఇచ్చిన వంటకాలలో ఏదైనా తీసుకుని పరీక్షించవచ్చు. పరీక్ష చేయడానికి కొన్ని రసాయన పదార్థాలు, పరీక్ష నాళికలు కావాలి. వీటి కొరకు మీ పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలి. కావలసిన ద్రావణాలు - తయారుచేసుకొనే విధానం: అయోడిన్ ఘన పదార్ధం. నీటిలో కరగదు కనుక పొటాషియం అయోడైడ్ ద్రావణంలో కరిగించాలి. పరీక్ష నాళికలో చిటికడంత పొటాషియం అయోడైడని నీటిలో కరిగించి , దానిలో అతి తక్కువ అయోడిన్ ఘన పదార్థాన్ని వేసి కరిగించాలి. ఈ ద్రావణంతో మనం తినే పదార్థంలోని స్టార్చ్ ని పరీక్షించవచ్చు, 2 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం: 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ను 100 మిల్లీ లీటర్ల ద్రావణం వచ్చేటట్లు నీటిలో కరిగించాలి. 10 శాతం సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ అంటే సుమారు 50 పెలెట్ల సోడియం హైడ్రాక్సైడ్ను నీటిలో కరిగించి 100 మిల్లీలీటర్ల ద్రావణం తయారు చేసుకోవాలి. పైన చెప్పిన ఏదైన వంటకాన్ని ఉదాహరణకు జొన్నరొట్టె ముక్కను తీసుకుని, మెత్తగా చేసి పరీక్ష నాళికలో వేసి నీటిని కలిపి బాగా గిలకరించాలి. దాన్ని రెండు భాగాలు చేసుకోవాలి. పరీక్ష నాళికలో వున్న ఒక భాగానికి రెండు లేదా మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలిపి గిలకరించి పరిశీలించండి. మీ పరిశీలనలో ద్రావణం నీలిరంగుకు మారినట్లయితే స్టార్స్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. నీలిరంగు రానట్లయితే అందులో స్టార్చ్ లేనట్లు. పరీక్ష నాళికలో రెండో భాగాన్ని తీసుకుని పది (10) చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని డ్రాపర్తో వేసి బాగా కలిపిన తరువాత నాలుగు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి బాగా గిలకరించాలి. మూడు నాలుగు నిమిషాలలో దావణం ఊదారంగులోకి మారితే ప్రోటీన్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. తినే పదార్థాన్ని తెల్ల కాగితం పై వేసి రుద్దండి. కాగితం పాక్షిక పారదర్శకంగా మారినట్లయితే నూనె లేక కొవ్వు పదార్థం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఈ విధంగా పాఠశాలలో మీరు శాస్త్రవేత్తలలాగ పరీక్షలు చేసి సమతుల ఆహారం తింటున్నామా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర లభించే కందిపప్పు, పెసర పప్పు, మినప పప్పు, శనగ పప్పు, అలసంద పప్పు మొదలగు పప్పుల పొడిని తయారుచేసుకుని ప్రతీ దాంట్లో స్టార్స్, ప్రోటీన్ల కొరకు పరీక్షలను చేసి, ఎ సైస్సు ప్రాజెక్టును రూపొందించండి. ఆధారం: ప్రొ. ఎం. ఆదినారాయణ