పరమాణు నిర్మాణం పదార్ధము అతిచిన్న కణాలచేత నిర్మితం అవుతుంది. ఈ కణాల మద్య దూరము, కణాల మధ్య ఉండే ఆకర్షణ బలాలు పదార్ధ స్థితిని బట్టి మారతాయి. వీటిని అనుసరించి పదార్ధ స్థితులను మూడు రకాలుగా వర్గీకరించవచ్యును. ఘనస్థితి ద్రవస్థితి వాయుస్థితి ఘనపదార్ధాలు ఘనపదార్ధాలలో అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. అణువుల మద్య ఆకర్షణ బలాలు అధికంగా ఉంటాయి. నియమిత ఆకారము, ఘనపరిమాణము ఉండి స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఘనపదార్ధాలు నియమిత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఘనపదార్ధాలను మరల మెత్తని ఘనపదార్ధాలు, కుప్పగా పోయగల ఘనపదార్ధాలు, కుప్పగా పోయలేని ఘనపదార్ధాలు అని వర్గీకరించవచ్చును. ద్రవపదార్ధాలు ద్రవపదార్ధాలలోని అణువుల మధ్య దూరం ఘనపదార్ధాలకంటే ఎక్కువగానూ, వాయు పదార్దాల కంటే తక్కువగాను ఉంటుంది. అణువుల మధ్య ఆకర్షణ బలం ఘనపదార్ధాలకంటే తక్కువగానూ, వాయు పదార్దాలకంటే ఎక్కువగానూ ఉంటుంది. ప్రవహించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. నిర్ధిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయి. నిర్ధిష్ట ఆకారాన్ని కలిగి ఉండవు. ఏ పాత్రలోపోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఒత్తిడిన కలిగించి ఘనపరిమాణాన్ని తగ్గించే ప్రక్రియను సంపీడ్యత అంటారు. ఒత్తిడిని కలిగించి ద్రవపదార్ధాల ఘనపరిమాణాన్ని మార్చలేము కనుక వీటిని అసంపీడ్యాలు అంటారు. వాయు పదార్ధాలు సాపేక్షంగా అణువుల మధ్య దూరం ఎక్కువగానూ, ఆకర్షణా బలాలు అత్యల్పంగానూ ఉన్న పదార్ధాలు వాయు పదార్ధాలు. వాయు పదార్దాలకు నిర్ధిష్ట ఆకారం, ఘనపరిమాణం ఉండదు. వాయు పదార్ధాల్లోని కణాలు నిరంతరం స్వేచ్చగా చలిస్తూ ఉంటాయి. స్థితిమార్పు ఉష్ణోగ్రతను మార్చడం ద్వారా పదార్ధాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చవచ్చును. ఉదాహరణకు మంచునువేడి చేసినపుడు ద్రవస్థితి (నీరు) లోకి మారుతుంది. నీటిని మరింత వేడిచేసినట్లయితే వాయు (భాష్ప) (ఆవిరి) స్థితిలోకి మారుతుంది. పరమాణువు - అణువు పదార్ధము అతిచిన్నవైన అణువులు, పరమాణువులచేత నిర్మితం అని కణాదుడు ''వైశేషిక సూత్ర''అనే పుస్తకం లో భారతీయ మహర్షి చెప్పెను. పదార్ధము పరమాణువుల చేత నిర్మితము అని డెమోక్రటిస్ అనే గ్రీకు శాస్ర్తవేత్త చెప్పెను. పదార్ధములోని అతిచిన భాగాన్ని పరమాణువు అని పిలిచారు. కారణం పరమాణువు (ఆటం) అనే పదం గ్రీకు పదం నుంచి అవిర్భవించింది. గ్రీకు భాషలో ఈ పదానికి అర్ధం విభజింపవీలుకానిది అని. డాల్టన్ పరమాణు సిద్ధాంతం పదార్ధము అతి చిన్న కణాలచేత నిర్మితమవుతుంది. ఈ చిన్న కణాలను పరమాణువులు అని పిలుస్తారు పరమాణువు విభజింప వీలుకాదు. ఒక మూలకానికి చెందిన పరమాణువులు అన్ని ఒకేలా ఉంటాయి. వేరు వేరు మూలకాలకు చెందిన పరమాణువులు వేరువేరుగా ఉంటాయి. పరమాణువులే రసాయన చర్యలలో పాల్గొంటాయి. పరమాణువుల కలయిక వలన సంయోగ పరమాణువులు ఏర్పడతాయి. పరమాణువులోని మౌలిక కణాల ఆవిర్భావం పరమాణువులోని మౌలిక కణాల గూర్చిన పరిశోధనలకు 1878లో క్రూక్స్ జరిపిన ప్రయోగాలతో బీజం పడింది. క్రూక్స్ ఉత్సర్గనాళం అనే పరికరాన్ని తయారు చేశారు. రెండు వైపులా మూయబడిన ఒక గాజు గొట్టం రెండు చివరలా రెండు ఎలక్ర్టోడుల అమర్చబడి, లోపలి గాలి పీడనాన్ని మార్చడానికి ఒక వాయు రేచక యంత్రంతో కూడిన అమరికయే ఉత్సర్గనాళం. దీనిలో గరిష్టంగా 10,000వోల్టుల విద్యుత్‌ను, 0.001mm పీడనాన్ని కలిగించవచ్చు. 0.001 mm పీడనం వద్ద క్రూక్స్ ఆకుపచ్చని రంగు చారలను గమనించెను. ఋణ ధృవకిరణాలు 1897వ సంవత్సరంలో జేజే.థామ్సన్ అనే శాస్ర్తవేత్త క్రూక్స్ ఉత్సర్గనాళికతో చేసిన ప్రయోగాలలో భాగంగా ఋణ ధృవకిరణాల ఉనికిని గుర్తించారు. ఋణ ధృవ కిరణాలు ఉత్సర్గనాళంలోని ఋణ ధృవం నుంచి ధన ధృవం వైపుకు ప్రయాణిస్తాయి. ఇవి జింకుసల్ఫైడ్ తెరమీద ప్రతిదీప్తిని కలుగచేస్తాయి. ఋణ ధృవ కిరణాలు ఋజుమార్గంలో ప్రయాణం చేస్తాయి. విద్యుత్ క్షేత్రంలో ఆనోడువైపుకు ప్రయాణిస్తాయి. అయస్కాంత క్షేత్రంలో కాథోడు వైపుకు ప్రయాణిస్తాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు