భారత్ లో విద్యాభ్యాసం అనంతరం వైద్య వృత్తిని చేపట్టిన తొలి మహిళ మహిళా సాధికారతకు అసాధారణ చిహ్నంగా నిలిచిన డాక్టర్ కాదంబినీ గంగూలీ కలకత్తా విశ్వవిద్యాలయంతో అడ్మిషన్ సాధించిన తొలి మహిళ. చెక్కు చెదరని సంకల్పం, పట్టుదల, అంకిత భావంతో ముందడుగేసిన ఆమె దేశంలోనే కాదు.. యావత్ దక్షిణాసియాలోనే తొలి మహిళా ఫిజీషియన్ అయ్యారు. వైద్య వృత్తిని చేపట్టడంతో పాటు ఆమె బొగ్గు గనుల్లో పని చేసే మహిళా కార్మికుల జీవితాలు మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రతికూల పరిస్థితులను సైతం దీటుగా ఎదుర్కొంటూ ముందడుగు వేయాలన్న సంకల్పం గల కోట్లాది మంది మహిళలకు విజయవంతమైన వైద్యురాలు, స్వాతంత్య్ర యోధురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త అయిన డాక్టర్ కాదంబినీ గంగూలీ స్ఫూర్తిగా నిలుస్తారు. జననం: జూలై 18, 1861మరణం: అక్టోబర్ 3, 1923 స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో మహిళల విద్యా వ్యాప్తిలో ఎంతో కీలక పాత్ర పోషించిన కాదంబినీ బోస్... భాగల్ పూర్ లో 1861 జూలై 18న జన్మించారు. ఆడపిల్లలను పాఠశాలకు పంపాలన్న ఆలోచనే తప్పు అనే ఆలోచనా సమాజంలో ఉన్న రోజుల్లో ఆమె పాఠశాల విద్య ప్రారంభించారు. ఆమె ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని 1883 సంవత్సరంలో బ్రిటిషర్లు భారతదేశాన్ని పాటిస్తున్న సమయంలో తొలి మహిళా పట్టభద్రురాలయ్యారు. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాకుండా, గడప దాటి ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగ రంగాల్లో రాణించి స్వయం సమృద్ధి సాధించాలని కాదంబినీ మహిళలను ఎంతో ఉత్తేజితం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆమె ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త, మహిళా సాధికారత ఉద్యమకారుడు అయిన ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. వైద్యంలో డిగ్రీ సంపాదించాలని కాదంబినీని ఆయన ప్రోత్సహించారు. ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ కాదంబిని తాను చేపట్టిన రంగంలో అద్భుత విజయం సాధించారు. ప్రారంభంలో ఇబ్బందులను అధిగమించి ఆమె కలకత్తా వైద్య కళాశాలలో చేరారు. 1886లో భారతదేశంలో తొలి మహిళా డాక్టర్ గా అర్హత సాధించి చరిత్ర నెలకొల్పారు. తదుపరి విదేశాలకు వెళ్లిన ఆమె గ్లాస్గో, ఎడిన్బరో విశ్వవిద్యాలయాల నుంచి అడ్వాన్స్డ్ వైద్య డిగ్రీలు సాధించారు. బ్రిటన్ లో పని చేస్తూ, చదువుతూనే ఆమె గైనకాలజీలో స్పెషలైజ్ చేసి అదనంగా మూడు సర్టిఫికేషన్లు పొందారు. 1890లో భారత్ కు తిరిగి వచ్చిన ఆమె ప్రైవేట్ ప్రాక్టీస్ చేపట్టారు. మెడికల్ కెరీర్ చేపట్టడమే కాకుండా మహిళల హక్కుల ఉద్యమంలో చురుగ్గా పని చేశారు. అందరూ మహిళా సభ్యులతో 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు వెళ్లిన తొలి మహిళా ప్రతినిధివర్గంలో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. బంకీమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచనలు ఆమెలో దేశభక్తి స్ఫూర్తిని రగిలించడంలో కీలక పాత్ర పోషించాయి. ఒక వైద్యురాలుగా ఆమె బిజీ జీవితం గాని, ఎనిమిది మంది పిల్లల తల్లిగా పోషించిన బాధ్యతలు గాని ఆమె భారత మహిళా హక్కుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి ఏ మాత్రం అడ్డు కాలేదు. సమాజంలో బాల్య వివాహాలు, సతి వంటి దురాచారాలు ప్రబలంగా ఉన్న రోజుల్లో ఆమె మహిళల స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం సాగించారు. సామాజిక సంస్కరణ కార్యక్రమాలు, అనేక ఇతర ఉద్యమాల్లో కూడా ఆమె చురుకైన పాత్ర పోషించారు. బొగ్గు గనుల్లో పని చేసే మహిళా కార్మికుల సంక్షేమానికి ఆమె ఎంతో కృషి చేశారు. 1898లో భర్త మరణానంతరం ఆమె కోల్కతాలో జీవితాంతం మెడికల్ ప్రాక్టీస్ కొనసాగించారు. 1923 అక్టోబర్ 3వ తేదీన ఆమె కన్ను మూశారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్