తెలుగు సాహిత్యంలో వచ్చిన శతక ప్రక్రియ మానవ సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేస్తుందనుటలో ఏ మాత్రం సందేహం లేదు. సాహిత్యంలో తాత్వికాంశాలను జోడించి ఉమానాలుగా అనేకాంశాలను ఉదహరిస్తూ శతక కవులు సులభంగా చిన్న చిన్న పదాలతో పద్యాలను రాశారు. కాలజ్ఞానిగా గుర్తింపుని సొంతం చేసుకున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 'కాలికాంబ హంస కాళికాంబ' మకుటనియమంతో అనేక పద్యాలను రచించారు. కాళికాంబ శప్తశతిలో 701 పద్యాలు మానవ సమాజ వికాసానికి ఎంతో తోడ్పడగలవు. సమాజంలో వేదాలను స్త్రీలు, వెనుకబడిన జాతులు చదవకూడదనే ఆచారం వుండేది. దీన్ని వీరబ్రహ్మంగారు పూర్తిగా నిరసించారు. ''వెలదులకును వేదవిద్యాదికారమ్ములేదటంచు బ్రహ్మ లిఖిత మంచునోరుతెఱచి మఱచినారు వాణిని నిన్నుకాళికాంబ! హంస! కాళికాంబ!'' పుట:678. చదువు నేర్చిన వారికి ('వాణి') చదువుల తల్లి కటాక్షమే వుందంటారు. చదువు నెరిగిన వారు స్త్రీలను మరచిపోవడం జరుగుతుందని, వేదాలు బ్రహ్మచే రాయబడినవని చెప్పడాన్ని వీరబ్రహ్మంద్రేస్వామి నిరసించారు. వేదాలను అందరు చదవాలని, అందులోని వాస్తవికాంశాలను అందరు తెలుసుకుంటే సమాజం చైతన్యవంతంగా ముందుకు పయనిస్తుందని ఆవేదన చెందారు. మతం మనుషుల మధ్య బేధాలను సృష్టిస్తుంది. దీనివల్ల మనిషిని మనిషే చంపుకుంటున్న తీరుని నిరసించారు. ఇది మతం కాదు 'మత్తు' మనిషికున్న విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతున్న విధానాన్ని బ్రహ్మంగారు నిరసించారు. మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదుహితము గూర్పవలయు నెల్లరకునుహితము గూర్పలేని మతము మానగవలె పద్యం: 694. 'మత్తు'లో వున్నవారు కుటుంబసభ్యులను, తమ యోగక్షేమాలను చూసిన వారిని హింసించి చంపడం చూస్తుంటాం. దాన్ని బ్రహ్మంగారు నిరసించారు. మత్తు కలిగించే మతము వద్దు హితాన్ని బోధించేదేదన్నా వుంటే అదే మతం కావాలని, సమాజశ్రేయస్సు ప్రధానమనంటారు. కులమతాల జాడ్యములలోన దపియించుదీనజనుల సేద దేర్చువాడమానవుండె ధరను మాధవుండనువాడ (పుట:700 దేవుడిగా పూజింపబడాలంటే కులమతాలను వదిలి దీనులైన జనుల క్షేమాన్ని కాంక్షించేవారే దైవంగా పూజింపబడతారనంటారు. ప్రజల క్షేమమే మన మతం కావాలనంటారు. మనుషులు ఒకరోజు మరణించక తప్పదు. అల్పప్రాణులు పుడుతుంటాయి. గిట్టుతుంటాయి. వాటి ప్రాణానికి విలువలేదు. మాయలో పుట్టి మొత్తం నాదేనంటూ స్వార్థంతో అత్యంత ధనవంతునిగా జీవించేవారు తెలుసుకోవాల్సిన గొప్ప విషయాన్ని తెలియజేశారు. విశ్వమంత మాయ వేడుకులను మాయనేను, మేను మాయ నీవు మాయమాయలోన బుట్టి మలయు సమస్తంబు పుట:97. ఎన్నో తరాలు మట్టిలో కలసిపోయాయి. వారంతా వెంట ఏదీ తీసుకుపోలేదన్న విషయాన్ని గుర్తించాలని స్నేహశీలంగా జీవించాలనంటారు. దళిత బహుజన జాతులు స్వయంగా పనులు చేసి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటారు. శ్రామికులుగా, పాలేర్లుగా పనులు చేస్తుంటారు. వీరు చేసే పనిని బట్టి 'కులము'ను నిర్ధారించారు. కులం పేరుతో తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదనంటారు. శూద్రులను తక్కువ చేసి చూడటాన్ని నిరసించిన వీరబ్రహ్మంగారు శూద్రులే ఈ సృష్టిలో ముందున్నదంటారు. అందుకు నిదర్శనంగా వేదాలను అధ్యయనం చేసి తెలుసుకోండని పిలుపినిచ్చారు. ''ఇలకు దిగెడువేళ కులమెవ్వరికి లేదుమొదలు శూద్రుడుగను పుట్టువందుశ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ'' పుట:116. విప్రులని ఎవరినైతే అంటున్నామో వారు ఒకప్పటి శూద్రుడేనంటూ పుట్టుకతో కులము ముసుగేసుకొని పుట్టరని మనుషుల మధ్య బేధభావన పోవాలని కులాన్ని నిరసించారు. విద్య మనిషిని మనిషిగా గుర్తుస్తుంది. విద్య విజ్ఞత నేర్పుతుంది. సమాజాన్ని బలపరుస్తుంది. మనిషిని వివేకవంతుడిగా ముందుకు నడిపిస్తుంది. అనేకరకాలైన విద్యలు నేర్చినవారు మూర్ఖత కలిగివుంటే ఆ చదువుకి ఫలితం లేదనంటారు. ''చదివి చదివి ముదిమిగదిసి మూర్ఖతరేగచదువు మర్మ మెఱుగు జాడ గనరునేర్పు లేని చదువు నిష్ప్రయోజనమౌను'' పుట:145. 'నేర్పు' మనిషి జీవించగలిగేలా చేసేది విద్య అటువంటి విద్యకు ఫలితం సమాజశ్రేయస్సు అని అంటారు. కోటి విద్యలు కూటికొరకు. అన్నం ప్రతి కులపువానికి కావాలి, ప్రతి మతం వానికి కావాలి. సృష్టిలో ప్రతి జీవికి బ్రతకడానికి ఆహారం కావాలన్నది ప్రధానం. ఇక్కడ మనకి అన్నం కావాలి. ఈ అన్నం కోసమే కదా మనిషి తన చుట్టు ఏర్పరచుకున్న కంచెలకు కారణమంటారు. మనుషులందరు అన్నదమ్ములవలె కలసిమెలసి వుంటే ఘర్షణులండవ నంటారు. ''కూటి వలన నేరుపాటయ్యె ప్రాణులుకూడులేక వేఱు కులము లేదుకూటిమర్మమెఱుగు గురుమూర్తి యొక్కడే'' పు:175. కూడు కోసం జరిగే కొట్లాటల్లో మనిషిని మనిషి హతమార్చుకోడం తరతరాల నుండి వస్తున్న విధానం బ్రహ్మంగారి కాలం నుండి ఆధునిక కాలం వరకు కొనసాగుతూనే వుంది. మార్పు రావాల్సిన అవసరం వుంది. 'మరణం' చాల విచారకరమైనది. కొంతమంది పంతంపట్టి చచ్చి సాధించాలనుకుంటారు. చనిపోతే సాధించేది వుండదని వారి జీవితం అంతమైనట్టే అవుతుందని బ్రతికి సాధించుకోవాలని ధైర్యాన్ని నింపుతారు. ''చచ్చి యెవరినైన సాధింపగా లేముచాక బాధకముల సాధకములసమయజేసి పరము సాధించు కొనరయాకాళికాంబ! హంస! కాళికాంబ! మనిషి పుట్టిన తరువాత చేయవలసిన మంచి పనులు చేసి, తమకున్న స్థానాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం వుందనంటారు. వీరబ్రహ్మంగారు ఈ శతకంలో సమాజ శ్రేయస్సుని కాంక్షించి అనేక సోదాహరణలతో సులభగ్రాహ్యంగా పద్యాలను రచించారు. మంచి మనిషి మంచి సమాజాన్ని నిర్మించగలిగినట్లైతే అసమానతలు తొలగి లభించే వనరులను అందరు పంచుకొని జీవించగలుగుతారు. - డాక్టర్ జి.శైలమ్మ ఆధారం : ప్రజాశక్తి