"అమ్మా... ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?" "నాన్నా... చంద్రుడు మన వెంట ఎందుకు వస్తాడు?""టీచర్... చీమలు వరుసగా ఎందుకు నడుస్తాయి?".... ఇలాంటి ప్రశ్నలు మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగి ఉంటే మీరు కూడా ఆ శాస్త్రవేత్తల వరుసలోకే వస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు మీలాగే ప్రశ్నలు అడిగిన చిన్నారే! నిజానికి మానవ నాగరికత సాధించిన ప్రతి గొప్ప విజయం ఒక ప్రశ్నతోనే మొదలైంది. అందుకే "ప్రశ్నే ప్రగతికి మూలం" అంటారు.చిన్నప్పుడు పిల్లలు వందల ప్రశ్నలు అడుగుతారు. కొన్నిసార్లు పెద్దవాళ్లు నవ్వుతారు. కొన్నిసార్లు విసుక్కుంటారు. "ఎన్ని ప్రశ్నలు అడుగుతావు?" అంటారు. కానీ ప్రశ్నించే గుణమే మనిషిని ఇతర జీవుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక పక్షి గూడు కడుతుంది. వేల సంవత్సరాల క్రితం ఎలా కట్టిందో ఇప్పటికీ అలాగే కడుతోంది. ఒక తేనెటీగ తేనెపట్టు నిర్మిస్తుంది. అది కూడా ఎప్పటినుంచో అదే పద్ధతి! కానీ మనిషి మాత్రం మారాడు. గుహలో జీవించిన స్థితి నుంచి అంతరిక్షంలోకి వెళ్లే స్థాయికి ఎదిగాడు. ఆ మార్పుకు కారణం ఒక్కటే... ప్రశ్న. "ఇంకా మెరుగ్గా ఎలా చేయవచ్చు?" అనే ప్రశ్న. ప్రపంచాన్ని మార్చిన ప్రశ్నలు మనిషి మొదటిసారి అగ్నిని చూసినప్పుడు కూడా ఒక ప్రశ్నే వేసి ఉండాలి. "ఇది ఏమిటి?"ఆ ప్రశ్న లేకపోతే అగ్ని ఉపయోగం తెలిసేది. కాదు. వంట పుట్టేది కాదు. నాగరికత ఈ స్థాయికి చేరేది కాదు.మనం నేడు జీవిస్తున్న ప్రపంచం చాలా సౌకర్యవంతంగా ఉంది. అనారోగ్యం వస్తే మందులు ఉన్నాయి. దూరంలో ఉన్న వారితో క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాం. విమానాల్లో దేశాలు దాటుతున్నాం. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వాడుతున్నాం. శుద్ధమైన నీరు తాగుతున్నాం. కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయనుకుంటే పొరపాటే. ఒకప్పుడు ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉండేది. వ్యాధులు వస్తే ప్రజలు గుంపులు గుంపులుగా మరణించేవారు. సమాచారం చేరడానికి వారాలు పట్టేది. ప్రయాణాలు నెలల తరబడి సాగేవి. అనేక ప్రశ్నలకు సమాధానాలు ఉండేవి కాదు. ఆ పరిస్థితులను మార్చింది సైన్సు. ఒకప్పుడు స్మాల్ పాక్స్ (పెద్దమ్మ వారు) అనే వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టేది. ఊళ్లు ఖాళీ అయ్యేవి. కుటుంబాలు నాశనం అయ్యేవి. అప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ అనే వైద్యుడు ఒక చిన్న విషయం గమనించాడు. ఆవుల పాలు పితికే కొందరు మహిళలకు స్మాల్ పాక్స్ రావడం లేదు. చాలామంది దాన్ని పట్టించుకోలేదు. జెన్నర్ మాత్రం "ఎందుకు?" అని ప్రశ్నించాడు. సంవత్సరాల పాటు పరిశీలించాడు. విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రయోగాలు చేశాడు. చివరకు ప్రపంచపు తొలి వ్యాక్సిన్‌కు మార్గం చూపించాడు. నేడు స్మాల్ పాక్స్ భూమి మీద నుంచి పూర్తిగా అంతరించిపోవడం వెనుక ఒక వైద్యుడు అడిగిన ఆ చిన్న ప్రశ్న ఉంది.అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కథ కూడా ఇలాగే! ఒక రోజు అతని ప్రయోగశాలలో బాక్టీరియా నమూనా చెడిపోయింది. సాధారణంగా దానిని చెత్తబుట్టలో పడేయాలి. కానీ ఫ్లెమింగ్ ఆగి గమనించాడు. ఒక బూజు చుట్టూబాక్టీరియా పెరగడం లేదు. "ఎందుకు?" అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అతన్ని కొత్త అన్వేషణ వైపు నడిపించింది. ఆ చిన్న పరిశీలనే పెన్సిలిన్ ఆవిష్కరణకు దారి తీసింది. తరువాత అంటి బయోటిక్స్ కొట్లాది మంది ప్రాణాలను కాపాడాయి. శామ్యూల్ మోర్స్కు శాస్త్రం మీద పరిశోధనలు చేయాలనే ఆలోచన మొదట లేదు. తన భార్య అనారోగ్య వార్త ఆలస్యంగా అందుకోవడం వల్ల ఆమె చివరి క్షణాల్లో పక్కన ఉండలేకపోయాడు. ఆ బాధ అతన్ని వెంటాడింది. "సమాచారం వేగంగా చేరటానికి అవకాశం లేదా?" అనే ప్రశ్న అతని మనసులో పుట్టింది. డబ్బు లేకపోయినా, సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఎగతాళి చేసినా అతను ఆగలేదు. చివరకు టెలిగ్రాఫ్‌ను అభివృద్ధి చేశాడు. మొబైల్ ఫోన్లు అందుబాట్లోకి వచ్చే దాక అతడు రూపొందించిన టెలిగ్రామ్ వ్యవస్థ ప్రపంచానికి అత్యవసర సమాచారాన్ని అందించటానికి ఎంతగానో ఉపయోగపడింది.రైట్ సోదరులు పెద్ద శాస్త్రవేత్తలు కాదు. వాళ్లకు సైకిల్ దుకాణం ఉండేది. వాళ్లు పక్షులను చూస్తూ ఒక కల కన్నారు. "మనిషి కూడా ఎగరలేదా?" అని ప్రశ్నించారు. వందల ప్రయోగాలు చేశారు. యంత్రాలు కూలిపోయాయి. చేతులకు గాయాలయ్యాయి. ప్రజలు నవ్వుకున్నారు. అయినా వాళ్లు వెనక్కు తిరగలేదు. చివరకు 1903లో వారి విమానం ఆకాశంలోకి ఎగిరింది. నేడు ప్రపంచం చిన్నదిగా కనిపించడం వెనుక ఆ ఇద్దరు సోదరుల పట్టుదల ఉంది.మన దేశానికి చెందిన సి.వి. రామనక్కు నోబెల్ బహుమతి ఒక్కరోజులో రాలేదు. ఓడ ప్రయాణంలో సముద్రం నీలంగా కనిపించడాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. "అలా ఎందుకు కనిపిస్తోంది?" అనే ప్రశ్న ఆయన మనసును పట్టుకుంది. పరిమిత వనరులతో, సాధారణ పరికరాలతో, ఎన్నో రోజుల పరిశోధన తర్వాత ఆయన కొత్త సత్యాన్ని కనుగొన్నారు. ఆ పరిశోధనే రామన్ ఎఫెక్ట్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒక సాధారణ ప్రశ్న ప్రపంచ స్థాయి ఆవిష్కరణగా మారింది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టిన కథ కూడా ఒక ప్రశ్నతోనే మొదలైంది. "భూమి దాటి వెళ్లలేమా?" అనే కలతో వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు దశాబ్దాల పాటు శ్రమించారు.అనేక రాకెట్లు విఫలమయ్యాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా వారు ఆగలేదు. చివరకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు, అది ఒక్క మనిషి విజయం కాదు.ప్రశ్నించడానికి భయపడని మానవజాతి విజయం. ప్రశ్న : శాస్త్రవేత్తల ప్రత్యేక సాధనం! ఈ కథలన్నీ మనకు ఒక గొప్ప పాఠం చెబుతున్నాయి. అందరిలాంటి శాస్త్రవేత్తలు కూడా మనుషులే! వారికి అద్భుత శక్తులు లేవు. వారికీ మనలాగే సందేహాలు వచ్చాయి. మనలాగే వైఫల్యాలు ఎదురయ్యాయి. కానీ వారు ప్రశ్నలను వదిలిపెట్టలేదు.శాస్త్రంలో వైఫల్యం అంతిమం కాదు. అది కొత్త సమాచారం మాత్రమే! ఒక ప్రయోగం విఫలమైతే, "ఇది ఎందుకు పనిచేయలేదు?" అనే మరో ప్రశ్న పుడుతుంది. అదే తదుపరి ప్రయోగానికి దారి తీస్తుంది. అదే కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది.పిల్లలూ! సైన్సు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే సూత్రాలు కాదు. సైన్సు అంటే ఆశ్చర్యపడటం. గమనించడం. ప్రశ్నించడం. పరిశీలించడం. పరీక్షించడం. నిరూపించడం.ఒక చీమను గమనించండి. ఒక పక్షిని గమనించండి. ఒక మొక్కను గమనించండి. వర్షాన్ని గమనించండి. ఆకాశాన్ని గమనించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రశ్నలతో నిండి ఉంది. మీరు అడిగే ప్రతి ప్రశ్న ఒక కొత్త జవాబును తీసుకొస్తుంది.గుర్తుంచుకోండి. ప్రశ్న అడగడం బలహీనత కాదు. అది జ్ఞానానికి మొదటి మెట్టు. సందేహించడం తప్పు కాదు. అది సత్యాన్ని వెతికే మొదటి అడుగు. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు మీలాగే చిన్న పిల్లలే! వారికీ ఆశ్చర్యాలు కలిగాయి. సందేహాలు వచ్చాయి. కానీ వారు ప్రశ్నలను మనసులో దాచుకోలేదు. వాటికి సమాధానాలు వెతికారు. ప్రపంచాన్ని మార్చేది మీ ప్రశ్నే! నేడు ప్రపంచానికి కొత్త ప్రశ్నలు అవసరం. కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి? అందరికీ శుద్ధమైన నీరు ఎలా అందించాలి? కొత్త వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి? భూమిని ఎలా రక్షించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేది మీ తరమే. భవిష్యత్తు శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు మీలోనే ఉన్నారు. అందుకే ఎప్పుడూ ఆశ్చర్యపడండి. ఎప్పుడూ గమనించండి. ఎప్పుడూ ప్రశ్నించండి. ఒక చిన్న ప్రశ్న ప్రపంచాన్ని మార్చవచ్చు. ఒక చిన్న పరిశీలన కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక చిన్న సందేహం కొత్త నాగరికతకు దారి తీయొచ్చు!ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప కథ వెనుక ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచాన్ని మార్చే ప్రశ్న మీ మనసులో కూడా ఉండవచ్చు. ఆధారం: మన బడి మాస పత్రిక