తెలుసా ప్లాస్టిక్ కథ చేతిలో డబ్బులుంటే చాలు చంగుమంటూ షాపు దగ్గరకు వెళ్లి చాక్లెట్లు, బిస్కెట్, చిప్స్ ప్యాకెట్లు. ఇలా ఎన్నోకొని తెచ్చుకుంటారు. మరి వాటిని తినడం వరకూ సరే, ఆ తినుబండారాలతోపాటు వచ్చే ఆకర్షణీయమైన కవర్లు ఎంత ప్రమాదకరమో తెలుసా. పర్యావరణానికి అవి చేసే హాని గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్లూ తెలుసుకుని తీరాలి. ప్లాస్టిక్ ను వాడకుండా అమ్మానాన్నలకీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే ప్లాస్టిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలే ఇవి. పాలిథిన్ కవర్లు.. మనిషికీ, మట్టికీ మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. వాననీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడతాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. విస్తారంగా, వానలుపడినా, నీటికి కటకటే. పాలిథిన్ కణాలు మట్టిలోని సత్తువసంతా మింగేస్తాయి. బంగారం పండే పొలమైనా, దెబ్బకి ఎడారిలా మారిపోవలసిందే. పచ్చగడ్డి కూడా మొలవదు. అయితే ఎక్కడికక్కడ పేరుకుపోయిన పాలిథిన్ చెత్తను తరలించే ఓపిక లేక తరలించడానికి వాహనాలు సరిపోక చాలా ప్రాంతాల్లో పారి శుద్ధ్య సిబ్బంది కాల్చిపడేస్తున్నారు. కొండంత చెత్తకు చిన్న అగ్గిపుల్లతో పరిష్కారం అన్నమాట. అయితే ఆ మంటలోంచి కొన్నిరకాల విషవాయువులు పుట్టుకొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పాలిథిన్ కొన్నేళ్ల తరవాత ముక్కలు ముక్కలైపోయి ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. అది గాల్లో కలిసి పోయి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాస కోశ వ్యాధులు, చర్మ సమస్యలు .. ఇంకా అనేకానేక రోగాలకు కారణం అవుతున్నాయి. చెత్తకుండీల్లో మురుగు కాలువల్లో, ఆటమైదానాల్లో, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. నగరాల్లో ఆ సమస్య మరీ ఎక్కువ.మురుగు కాలువల్లో పేరుకుపోయిన పాలిథిన్ వ్యర్థాలు డ్రైనేజీ ప్రవా హానికి అడ్డు తగులుతున్నాయి. దీంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా పారి శుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. మురికి నీటిలోని పాలిథిన్ కవర్లమీద మలేరియాకారక క్రిములు కాపురాలు పెడుతున్నాయి. అక్కడే గుడ్లు పెట్టి, పిల్లల్ని కని జనం మీదికి వదిలేస్తున్నాయి. మరి ఏం చేద్దాం? బయటకు వెళ్లి ఏం కొన్నా ప్లాస్టిక్ కవరులోనే వాటిని మోసుకుంటూ ఇంటికి వస్తుంటారు ఎవరైనా. అందుకే పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్లాస్టిక్ ఏదో ఒక రూపంలో ఇంటికి వరకూ వస్తోంది. వెయ్యేళ్లెనా భూమిలో కలిసి పోకపోగా మానవ మనుగడకు ముప్పును కలిగించే ఈ ప్లాస్టిక్ ను చాలామంది ఎలా పడితే అలా బయట పడేస్తుండటంతో- నేలపైన ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయి పర్యావరణానికి హాని జరుగుతోంది. ఆ చెడుకు అడ్డు కట్ట వేయాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రభుత్వం నిషేధించింది. నిజానికి పాలిథిన్ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి. జీవోలొక్కటే చాలవు. జన భాగస్వామ్యం అవసరం. దుకాణం నుంచి సరకులు మాత్రమే తెచ్చుకుందాం. పాలిథిన్ మనకెందుకు? ఉచితంగా ఇస్తామన్నా వద్దనే చెబుదాం. రూపాయి ఎక్కువైనా సరే, పర్యావరణానికి హాని చేయని సంచులే వాడదాం. ఉద్యమాలు ఎక్కడో పుట్టవు. ఎవరో ఒక వ్యక్తితోనే మొదలవుతాయి. ఏదో ఓ ఇంటి నుంచి ప్రారంభమవుతాయి. మరి ఎక్కడో ఎందుకు పాలిథిన్ వ్యతిరేక ఉద్యమాన్ని మన ఇంటి నుంచే, మన స్కూలు నుంచే మొదలు పెడదాం. మనమంతా నాయకులం అయి ముందుకు నడిపిద్దాం ఆ ఉద్యమాన్ని. ప్రత్యామ్నాయం ఏంటి? ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయాలు గుడ్డ సంచులు (Cotton Bags) మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు తేలికగా ఉతకవచ్చు పర్యావరణానికి హానికరం కాదు జ్యూట్ సంచులు (Jute Bags) బలంగా ఉంటాయి ప్రకృతి దోహదంగా తయారవుతాయి పచ్చదనాన్ని ప్రోత్సహిస్తాయి కాగిత సంచులు (Paper Bags) సాధారణ వస్తువులు తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటాయి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు ఇవి చక్కగా కరుగుతాయి పర్యావరణానికి తక్కువ హానికరం కానీ ఇవి కూడా పూర్తిగా అవసరం లేని చోట వాడకూడదు నూలు సంచులు (Thread bags) చిన్న చిన్న వస్తువులకు అనువైనవి పునర్వినియోగానికి ఉపయోగపడతాయి హోంమేడ్ బ్యాగులు ఇంట్లో తయారు చేయవచ్చు వాటితో ఒక చిన్న క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కూడా చేయవచ్చు అసలు ప్లాస్టిక్ ఎలా పుట్టిందో తెలుసా పందొమ్మిదో శతాబ్దం చివర్లో.. హాన్స వాన్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఏదో ప్రయోగం చేస్తుంటే మెత్తమెత్తని, జిగట జిగట పదార్థమేదో గాజునాళిక అడుగున మిగిలిపోయింది. అదే తరవాత పాలిథిన్ గా అవతరించి, కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచమంతా విస్తరించింది. యమా చవకా, భలే తేలిక - ఇంకేముంది, వ్యాపారులు ఎగబడి కొన్నారు. జనం పరిపరి విధాలుగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ సౌకర్యానికి గులాములైపోయి, అనర్థాల గురించి ఆలోచించడమే మానేశారు. చెప్పేదేముంది, ప్రపంచమే ఓ పాలిథిన్ చెత్తబుట్టలా మారే ప్రమాదం ఏర్పడింది. నేలలో వీరుడైనా సార్వభౌముడైనా కలసిపోవలసిందే. మెట్ట వేదాంతం కాదు. మట్టి వేదాంతం. పాలిథిన్ కవరు మాత్రం పురాణాల్లో రాక్షసుల టైపు. మట్టికొట్టుకుపోకుండా సృష్టి కర్త నుంచి మినహాయింపు పొందింది. వేయి సంవత్సరాలైనా దాని మనుగడకు డోకాలేదు. శుష్కించిపోకుండా శిథిలమైపోకుండా పాపి చిరాయువు అన్నట్టు దర్జాగా బతికేస్తోంది. మట్టిలో ఏ వస్తువు జీవితకాలం ఎంతో తెలుసా.. కాయగూరలు - ఐదు రోజుల నుంచి నెలఅరటి తొక్క - 24 రోజులుచెరకు పిప్పి - 30 నుంచి 60 రోజులుకాగితం కవరు - 2 నుంచి 5 నెలలుదూది 1 నుంచి 5 నెలలు దారం - 3 నుంచి 14 నెలలుకమలాపండు తొక్క - 6 నెలలుఆకులు - ఏడాది సిగరెట్ పీక - 1 నుంచి 12 ఏళ్లులెదర్ షూ - 25 నుంచి 40 ఏళ్లుఅల్యూ మినియం డబ్బాలు - 80 నుంచి 100 ఏళ్లుపాలిథిన్ - వేయి సంవత్సరాలు ఆధారం: మన బడి మాస పత్రిక