మన ఉపనిషత్తులు - బుజ్జి కథల జ్ఞాన నిధులు హాయ్ నేస్తాలూ.. ఉపనిషత్తులు గురించి తెలుసుకుందామా.. మన భారతదేశంలో చాలా కాలం క్రితం. అంటే టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజుల్లో... దట్టమైన అడవులలో పెద్ద పెద్ద చెట్ల క్రింద ఋషులు ఉండేవారు. వారు రాసిన ఎంతో గొప్ప పుస్తకాలే ఉపనిషత్తులు. 'ఉపనిషత్తు' అంటే ఏమిటి? 'ఉపనిషత్' అంటే ఒక చక్కని అర్ధం ఉందన్నమాట. 'ఉపనిషత్' అనే పదం ఉ (వద్ద), పా (పాదం), ని (క్రింద), సద్ (కూర్చోవడం) అనే సంస్కృత పదాల కలయిక నుండి ఏర్పడింది. అనగా, "గురువు పాదాల చెంత అత్యంత సమీపంలో శ్రద్ధగా కూర్చొని నేర్చుకునే జ్ఞానం" అని దీని అర్థం. పూర్వకాలంలో పిల్లలు (శిష్యులు) తమ గురువుగారి పాదాల దగ్గర ఎంతో శ్రద్ధగా, వినయంగా కూర్చొని కథలు, మంచి విషయాలు వినేవారు. అలా గురువుగారి దగ్గర కూర్చొని నేర్చుకునే చదువునే 'ఉపనిషత్తు' అంటారు. అప్పట్లో ఇవన్నీ వల్లె వేయడం (పదే పదే చెప్పడం) ద్వారానే గుర్తుపెట్టుకునేవారు. ఈ మంచి అలవాటునే 'గురు-శిష్య పరంపర' అంటారు. ఇందులో ఏముంటుంది? మనం రోజూ రాత్రి అమ్మమ్మ, తాతయ్యలను కథలు అడుగుతాం కదా? అలాగే పూర్వకాలంలో పిల్లలు కూడా గురువుగారిని చాలా ప్రశ్నలు అడిగేవారు:"గురువుగారు! ఈ ప్రపంచాన్ని ఎవరు చేశారు?""మనం ఆకాశంలో నక్షత్రాలను ఎలా చూడగలుగుతున్నాం?""మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలి?"ఇలాంటి బుజ్జి బుజ్జి ప్రశ్నలకు గురువుగారు చెప్పిన అద్భుతమైన సమాధానాలు. చిన్న చిన్న కథలు ఈ ఉపనిషత్తులలో ఉన్నాయి. ఇవి మనకు 'నిజం' అంటే ఏంటో నేర్పుతాయి. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? మనకు కథల పుస్తకాలు బోలెడు ఉన్నట్లే, ఉపనిషత్తులు కూడా 200 కంటే ఎక్కువ ఉన్నాయి! కానీ, వాటిలో 108 చాలా ముఖ్యమైనవి. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు జపమాల ఉంటుంది కదా, అందులో 108 పూసలు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోవడానికి ఈ 108 ఉపనిషత్తులను ఒక గుంపుగా చేశారు. ఈ గుంపును 'ముక్తికా కానన్' అని పిలుస్తారు. ఈ 108 లో కూడా 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి.ఆ పది ఉపనిషత్తులు? ఈశ ఉపనిషత్ కేన ఉపనిషత్ కఠ ఉపనిషత్ ప్రశ్న ఉపనిషత్ముం డక ఉపనిషత్మాం డూక్య ఉపనిషత్ తైత్తిరీయ ఉపనిషత్ ఐతరేయ ఉపనిషత్ ఉపనిషత్. ఛాందోగ్య ఉపనిషత్ బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెబుతాయంటే..? ముండక ఉపనిషత్తు (సత్యమేవ జయతే!) మనం జాతీయ చిహ్నం మీద "సత్యమేవ జయతే" అని రాసి ఉండటం చూస్తాం కదా? "ఎప్పుడూ నిజమే గెలుస్తుంది" అని చెప్పే ఈ మంచి మాటను ముండక ఉపనిషత్తు నుంచే తీసుకున్నారు. జబాల ఉపనిషత్తు (జీవితంలో నాలుగు దశలు) మనం మొదట చిన్న పిల్లలుగా ఉండి బడికి వెళ్తాం. పెద్దయ్యాక ఉద్యోగం చేస్తాం, ఆ తర్వాత తాతయ్యలుగా మారతాం కదా? ఇలా మనిషి జీవితంలో ఉండే నాలుగు ముఖ్యమైన దశల (ఆశ్రమాల) గురించి ఈ పుస్తకంలో మొదట చెప్పారు. ఆ నాలుగు ఆశ్రమాలు... బ్రహ్మచర్యం (విద్యార్థి దశ); గృహస్థాశ్రమం (కుటుంబ జీవితం); వానప్రస్థాశ్రమం (దేశాటన/ దేశ పర్యటన); సన్యాసాశ్రమం (సర్వసంగ పరిత్యాగం) ఇలా ప్రతి ఉపనిషత్తు ఏదో ఒక మంచి విషయాన్ని చెబుతాయి. వేదాలతో అనుసంధానం ప్రతి ముఖ్యమైన ఉపనిషత్తు ఏదో ఒక వేదానికి అనుసంధానించబడి ఉంటుంది. బృహదారణ్యక, ఈశ ఉపనిషత్తులు శుక్ల యజుర్వేదానికి, తైత్తిరీయ, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు కృష్ణ యజుర్వేదానికి; ఛాందోగ్య, కేన ఉపనిషత్తులు సామవేదానికి; ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదంలో; ముండక, మాండూక్య, ప్రశ్న ఉపనిషత్తులు అథర్వణ వేదాల్లో అనుసంధానించారు. ఉపనిషత్తులు మనకు ఒక మంచి మాట చెబుతాయి: "మనుషులందరూ ఒకటే, అందరినీ ప్రేమించాలి. ఎప్పుడూ నిజమే మాట్లాడాలి." మీరూ గొప్పవారిగా, మంచి వ్యక్తులుగా కావాలనుకుంటున్నారా?అయితే ఈ మంచి విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పాటించాలి. కచ్చితంగా పాటిస్తారు కదూ...! ఆధారం: మన బడి మాస పత్రిక