ఫిషింగ్ లింకులు (Phishing links) పని చేసే విధానం మోసగాళ్లు బ్యాంక్ వెబ్సైట్, ఈ-కామర్స్ వెబ్సైట్ లేదా సెర్చ్ ఇంజన్ వంటి అసలైన వెబ్సైట్ లాగే కనిపించే మూడవ పక్ష ఫిషింగ్ వెబ్‌సైట్‌ను సృష్టిస్తారు. ఈ వెబ్సైట్ల లింకులను మోసగాళ్లు షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) / సోషల్ మీడియా / ఈమెయిల్ / ఇన్స్టంట్ మెసెంజర్ మొదలైన వాటి ద్వారా ప్రచారం చేస్తారు. చాలా మంది కస్టమర్లు పూర్తి యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (URL) ని తనిఖీ చేయకుండానే లింక్‌పై క్లిక్ చేసి, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PIN), వన్ టైమ్ పాస్వర్డ్ (OTP), పాస్వర్డ్ మొదలైన సురక్షిత ఆధారాలను నమోదు చేస్తారు, ఇవి మోసగాళ్ల ద్వారా సేకరించబడి ఉపయోగించబడతాయి. ముందు జాగ్రత్తలు (Precautions) తెలియని / ధృవీకరించబడని లింక్‌లపై క్లిక్ చేయవద్దు మరియు భవిష్యత్తులో పొరపాటున వాటిని యాక్సెస్ చేయకుండా ఉండటానికి తెలియని పంపినవారి నుండి వచ్చిన అటువంటి SMS / ఈమెయిల్‌లను వెంటనే డిలీట్ చేయండి. బ్యాంక్ / ఈ-కామర్స్ / సెర్చ్ ఇంజన్ వెబ్సైట్లకు లింక్‌లను అందించే మెయిల్లను అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి మరియు అటువంటి ఈమెయిల్‌లను డిలీట్ చేయడానికి ముందే పంపినవారి ఈమెయిల్ IDని బ్లాక్ చేయండి. ఎల్లప్పుడూ మీ బ్యాంక్ / సేవా ప్రదాత యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. వెబ్సైట్ వివరాలను, ముఖ్యంగా ఆర్థిక ఆధారాలను నమోదు చేయవలసిన చోట జాగ్రత్తగా ధృవీకరించండి. సురక్షిత ఆధారాలను నమోదు చేయడానికి ముందు వెబ్సైట్లో సురక్షిత చిహ్నం (ప్యాడ్‌లాక్ గుర్తుతో కూడిన https) ఉందో లేదో తనిఖీ చేయండి. ఈమెయిల్‌లలో వచ్చిన URLలు మరియు డొమైన్ పేర్లలో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయా అని తనిఖీ చేయండి. అనుమానం వస్తే, సమాచారం అందించండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా