పొద్దున్న వండిన దాన్ని మధ్యాహ్నం తినేటప్పుడు మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినే అలవాటు ఉంటుంది చాలామందికి. అయితే ఎప్పుడు వండింది అప్పుడే తినాలి కాని మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తినడం అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఓ ఐదు పదార్ధాలనయితే అస్సలంటే అస్సలు వేడిచేయకూడదని బ్రిటీష్ ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ, యూరోపియన్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఒక నివేదిక విడుదల చేశాయి. ఆ వివరాల్లోకి వెళ్తే... కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. లేదంటే చికెన్లో కొద్దిమొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మీ పొట్టకు పనిచెప్తుంది. మైక్రోవేవ్లో త్వరగా అవుతుంది కాని అన్ని వైపులా సరిగా ఉడకదు. దాంతో చికెన్లో ప్రొటీన్లు భిన్నంగా విడిపోయి పొట్టను ఇబ్బందిపెడతాయి. మనం ప్రతిరోజూ తినే అన్నాన్ని కూడా వేడిచేసి తినకూడదు. అయితే దీనికంటే కూడా అన్నం నిల్వ చేయడం అనేది చాలా ముఖ్యం. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ చెప్పినదాని ప్రకారం - గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే ‘‘స్పోర్స్(బీజ పరాగములు) రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టే. అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. తిరిగి వేడిచేయడం వల్ల హానికలిగించే విషపదార్థాలు నాశనం కూడా కావు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకోండి. ఉడికించిన బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల క్లొస్ర్టీడియమ్ బొటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దుంపల్ని తిరిగి వేడిచేసినా బ్యాక్టీరియా నాశనం కాదు. అందుకని బంగాళాదుంపని ఉడికించాక చల్చార్చి ఫ్రిజ్లో పెట్టుకోవాలే తప్ప బయట ఉంచొద్దు. పుట్టగొడుగుల్ని సరిగ్గా నిల్వ చేయకపోయినా, తిరిగి వేడిచేసినవి తిన్నా పొట్ట పాడయిపోతుంది. అయితే వాటిని ఫ్రిజ్లో ఉంచిన 24 గంటల లోపయితే 70 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వద్ద వేడిచేయొచ్చు. పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్ ఉంటుంది. తరువాత ఇదే నైట్రోజమైన్స్గా మారుతుంది. ఇది కార్సినోజెనిక్. ఈ పదార్థం రక్తప్రసరణ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘‘బేబీ బ్లూ సిండ్రోమ్’’ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. ఒకసారి వండాక తిరిగి వేడిచేయడం అనేది వద్దే వద్దు. ఎప్పటికప్పుడు వండుకు తినేయడాన్ని మించిన ఆరోగ్యసూత్రం మరోటి లేదు. ఆధారము: ఆంధ్రజ్యోతి