లోపల మరియు బయట వస్తువులు: ఒక చిన్న మగ్గు లేదా పాత్ర మరియు నీరు. దశలు పిల్లలకు వారు పట్టుకోగలిగిన స్పష్టమైన చిన్న ప్లాస్టిక్ బాక్స్ లేదా సీసాను మరియు సురక్షితమైన చిన్న వస్తువులను అందించండి. పిల్లలకు బాటిల్ లో వస్తువుల్ని లోపలికి ఎలా పెట్టాలో చూపిస్తూ 'లోపల' అని తెలియచెప్పాలి. పిల్లలకు వారే వస్తువులను ప్లాస్టిక్ బాటిల్ లో పెట్టే విధంగా 'లోపల' అనే పదాన్ని నొక్కి చెప్పాలి. 'బయట' అని పిల్లలకు చెప్పి బాటిల్ లో ఉన్న వస్తువును కదిలించి బయటకు తీయడానికి పిల్లవాడికి సహాయం చేయండి. పిల్లవాడు విజయవంతంగా ఒక వస్తువుని బాటిల్ లోపల పెట్టినప్పుడు అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: సూక్ష్మ కండరాల చలన నైపుణ్యాలు మరియు కండరాల అభివృద్ధి, చేతి మరియు కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ముడి విప్పుట వస్తువులు: మృదువైన రుమాలు. దశలు మృదువైన రుమాలను తీసుకుని వదులుగా ముడి వేయండి. ముడి వేసిన రుమాలను నవ్వుతూ బిడ్డకు అందించండి. రకరకాల కొత్త పద్ధతులలో రుమాలు ముడిని విప్పడానికి బిడ్డను ప్రోత్సహించండి. ముడి విప్పుటకు బిడ్డ చేసే ప్రయత్నాలను, ఏకాగ్రతను అభినందించండి. బిడ్డ, రుమాలు ముడి విప్పగానే ఆ విజయాన్ని అందరూ కలిసి జరుపుకోండి. కృత్యం ప్రాధాన్యత: సూక్ష్మ కండరాల చలన నైపుణ్యాలు, పని పైన దృష్టి మరియు సమస్య పరిష్కార నైపుణ్యం, అభిజ్ఞాకౌశలం మరియు ఆత్మవిశ్వాసం ఇనుమడించుట మొదలైనవి. ఫన్ యాక్షన్ సాంగ్ వస్తువులు: ఏమీ లేదు. దశలు మీకు నచ్చిన పాటలు పాడుతున్నప్పుడు బిడ్డతో కలిపి పాటకు తగిన యాక్షన్స్ చేస్తూ పాట పాడాలి. బిడ్డను మీతో కలిపి యాక్షన్ చేస్తూ పాట పాడే విధంగా ప్రోత్సహించాలి. రెండు చేతులు, తెరవడం మూయడం, చప్పట్లు కొట్టడం, ఒడిలో చేతులతో కొట్టడం వంటి చర్యలను చేయాలి. అ భినయ గీతాల ద్వారా పిల్లలతో కలిసి ఉత్సాహభరితంగా కలిసి ఆడుకుంటూ సమయం గడపాలి. ఈ ప్రక్రియను వీలైనప్పుడల్లా పునరావృతం చేయాలి. కృత్యం ప్రాధాన్యత: ఈ ప్రక్రియ ద్వారా సమన్వయము, అనుకరించే నైపుణ్యాలు మరియు ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పటం వస్తువులు: ఏమీ లేదు. దశలు: కుటుంబంలో 'అమ్మ' 'నాన్న' 'అక్క' వంటి వరుసలను కుటుంబ సభ్యులను చూపుతూ బిడ్డకు పరిచయం చేయండి. మీ బిడ్డతో మాట్లాడేటప్పుడు "బంతిని లక్ష్మికి ఇవ్వు" వంటి పేర్లను ఉపయోగిస్తూ చెప్పండి. పలకటానికి తేలికగా ఉండే కుటుంబ సభ్యుల పేర్లను బిడ్డతో చెప్పించడం ద్వారా అనుకరణను ప్రోత్సహించండి. నేర్చుకోవడాన్ని ఆకర్షణీయంగా చేయడానికి చిరునవ్వుతో పేర్లను మరల మరల చెప్పండి. కృత్యం ప్రాధాన్యత: కుటుంబ సభ్యుల పేర్లను పరిచయం చేయడం ద్వారా ప్రారంభ భాషాభివృద్ధి, సమాజం పట్ల అవగాహన, బిడ్డకు కుటుంబానికి మధ్య బంధం బలోపేతం అవుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ