హెచ్.ఐ.వి/ఎయిడ్స్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తితో, లైంగిక సంబంధం వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో, నూటికి 85 మంది లైంగిక సంబంధం ద్వారా తెచ్చుకున్న వారే. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే ఈ వ్యాధి వారికి సోకుతుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన తల్లి నుండి పుట్టే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ విధంగానే కాక హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వ్యక్తికి వాడిన సూది సరిగా మరగ బెట్టకుండా ఇతరులకు వాడితే, వారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వ్యాపించదు తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా లేదా పీల్చే గాలి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. కలసి భోజనం చేయడం, కలసి నివాసం ఉండడం వలన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి రాదు. దోమ కాటు ద్వారా వ్యాపించదు. ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్.ఐ.వి. ఏ విధంగా సంక్రమించదు కలిసి జీవించడం వల్ల కలిసి పనిచేయడం వల్ల కలిసి కూర్చోవడం వల్ల కలిసి ఆడడం వల్ల కలిసి తినడం వల్ల కరచాలనం (షేక్ హ్యాండ్) వల్ల ఒకే – మూత్రశాలలను (టాయిలెట్లను) ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి. సంక్రమణం జరుగదు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ... జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి. వివాహానికి ముందుగాని, వివాహం తర్వాతగాని విచ్చల విడి శృంగారం అత్యంత ప్రమాదం, సుఖవ్యాధులకు దారి తీయవచ్చు. ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే, గుర్తించబడిన బ్లడ్ బ్యాంకులలో నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి. క్షౌరశాలలో ప్రతి ఒక్కరికి కొత్త బ్లేడు వాడటం మంచిది. సుఖవ్యాధులు ఉన్నవారు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కు గురి అయ్యే అవకాశం పదిరెట్లు ఎక్కువ అని తెలుసుకోండి సుఖవ్యాధులను గుర్తించడం ఎలా... యోని లేక అంగం నుండి రసికారుట, అంగంపై పుండ్లు, గజ్జలలో వాపు మరియు మూత్రం పోయునప్పుడు మంట ఉన్నచో సుఖవ్యాధి అని అనుమానించి డాక్టరును సంప్రదించండి. ఆడవాళ్లలో పొత్తికడుపు నొప్పి ఉన్నచో అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. సుఖవ్యాధులను మందులతో నయం చేయవచ్చు, మరియు నిరోధ్ తో నివారించవచ్చునని తెలుసుకోండి. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకితే ఏమవుతుంది? హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి మన శరీరంలోని రోగాలను నిరోధించే శక్తిని నాశనం చేస్తుంది. శరీరంలో, రోగాలను నిరోధించే శక్తి (వ్యాధి నిరోధక శక్తి) బాగా తగ్గినప్పుడు. మామూలుగా వచ్చే వ్యాధులు కూడా తగ్గకుండా, బాగా ముదిరి ప్రాణాపాయం కలుగుతుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకిన వారు ఏం చెయ్యాలి? ఈ వ్యాధి సోకిన వారు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు, అలవాట్లు పాటిస్తే వ్యాధి వేగంగా ముదరకుండా చూసుకోవచ్చు. ఆందోళన పడకుండా, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం, యోగాసనాలు చేయడం. వేళకు మంచి ఆహారం తీసుకోవడం. కనీస శారీరక వ్యాయామం చేయడం. క్షయ, సుఖ వ్యాధులు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం. సారా, మత్తు పదార్థాలు పూర్తిగా మానివేయడం. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడానికి తప్పనిసరి అయితే, సంభోగ సమయంలో (వ్యాధి సోకినది స్త్రీకైనా, పురుషునికైనా) మగవారు నిరోధ్ ధరించాలి. హెచ్ఐవి/ఎయిడ్స్.. ఆధునిక ఉపద్రవం! ఇది వ్యక్తులనూ, కుటుంబాలనే కాదు.. ఏకంగా దేశాలనే కబళించేస్తోంది. ఎన్నో జీవితాలు కకావికలమైపోతున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే దీనికి సరైన, అసలైన పరిష్కారం. అసురక్షిత లైంగిక సంబంధాలు మన రాష్ట్రంలో ప్రధానంగా హెచ్ఐవి వ్యాప్తి ఈ అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఈ మార్గంలో హెచ్ఐవి సంక్రమిచే రిస్కు 0.1-0.3% మాత్రమే. అయినా అదే మన దగ్గర పెను శాపంగా పరిణమిస్తోందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసురక్షిత శృంగారంలో ఇది పురుషుల నుంచి స్త్రీలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కారణం: స్త్రీలలో యోని మార్గం అతి పల్చటి జిగురు పొరతో కప్పి ఉండటం, స్త్రీ జననాగంలో హెచ్ఐవికి అనువైన కణాలు ఎక్కువగా ఉండటం, లైంగిక చర్య సమయంలో స్త్రీ జననాంగాల్లో సూక్ష్మమైన గాయాలవుతుండటం, వీర్యం స్త్రీశరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండటం. వీటన్నింటి వల్లా స్త్రీలకు హెచ్ఐవీ ముప్పు మరింత ఎక్కువ. వీటికి జననాంగ, సుఖవ్యాధులు కూడా తోడైతే హెచ్ఐవి ముప్పు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జననాంగాల్లో పుండ్లు, స్రావాలు, తెల్లమైల, పొత్తికడుపు నొప్పి, గజ్జల్లో గడ్డలు, పులిపిరులు ఇలాంటివి ఉన్నప్పుడు అరక్షిత శృంగారం ద్వారా హెచ్ఐవి సోకే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే సుఖవ్యాధులకు చికిత్స తీసుకోవటం, భాగస్వామిని కూడా చికిత్సలో భాగం చెయ్యటం చాలా అవసరం. వీటికి చికిత్స అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కూడా లభిస్తుంది. కండోమ్ వాడకం, వ్యక్తి అలవాట్లు, ప్రవర్తనల్లో మార్పుతేవటం.. ఈ రెండూ ముఖ్యమైన నివారణ చర్యలు! తల్లిదండ్రుల నుంచి బిడ్డకు తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్ఐవి మూడు రకాలుగా సంక్రమించవచ్చు. 1. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2. ప్రసవ సమయంలో 3. తల్లిపాల ద్వారా. వాస్తవానికి 100 మంది హెచ్ఐవి పాజిటివ్ తల్లులకు 70 మంది బిడ్డలు హెచ్ఐవి లేకుండానే పుడుతున్నారు. 30 మందికి మాత్రం హెచ్ఐవి సంక్రమించే అవకాశం ఉంటోంది. ఈ ముప్పును మరింతగా తగ్గించేందుకు గర్భిణులకు 'నివిరపిన్ ప్రొఫైలాక్సిస్' విధానం మరింత మేలు చేస్తుంది. హెచ్ఐవి పాజిటివ్ గర్భిణులకు ప్రసవ సమయంలో నివిరపిన్ 200 ఎంజీ మాత్ర ఒకటి ఇస్తారు. పుట్టిన బిడ్డకు 72 గంటల్లోపు నివిరపిన్ టానిక్ ఒక్కసారి తాగిస్తారు. ఇలా చేస్తే హెచ్ఐవి సంక్రమించే అవకాశం 30 శాతం నుంచి 9-11 శాతానికి పడిపోతుంది. ఇక తల్లిపాలు ఇవ్వవచ్చా? లేదా? అన్నది చాలా వరకూ తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేస్తారు. కలుషిత సూదులు, సిరంజీలు మన రాష్ట్రంలో కలుషిత సూదులు, సిరంజీల ద్వారా హెచ్ఐవి సోకటమన్నది 0.32 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకూ సూదులు/సూదిమందులు కాకుండా వీలైనంత వరకూ వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడుకోవటం ఉత్తమం. ఇంజక్షన్లు తప్పనిసరి అయినట్లయితే.. కొత్త సూదులే వాడటం, వాడిపారెయ్యటానికి వీలైన సిరంజీలను ఎంచుకోవటం అవసరం. రక్తపరీక్షలకు వెళ్లినప్పుడు కూడా కొత్త సూదులే వాడేలా చూసుకోవటం మంచిది. రక్త మార్పిడి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి రక్తాన్ని పరీక్ష చెయ్యకుండా ఆపద సమయంలో మరొక వ్యక్తికి మార్పిడి చేసిన పక్షంలో వారికి హెచ్ఐవి సోకే అవకాశం నూరు శాతం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, లైసెన్సింగ్ విధానం, తప్పనిసరి హెచ్ఐవి+ పరీక్షల వల్ల ఈ మార్గం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం బాగా తగ్గింది. రక్తదానం చేసే ప్రతి దాత రక్తాన్నీ ముందుగా- హెచ్ఐవి, హెచ్‌బీవీ, మలేరియా, సిఫిలిస్, హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు చేసిన తర్వాతే మార్పిడి చెయ్యాలి. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్‌కు! హెచ్ఐవి క్రిమి ఒంట్లో చేరగానే జరిగే పరిణామాలు చాలా కీలకం. మన శరీరంలో రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైనవి 'సీడీ4' అనే కణాలు! హెచ్ఐవి ఒంట్లో చేరగానే ముందుగా ఈ కణాలను లోబరుచుకుంటుంది. ఆ తర్వాత.. ప్రతి సీడీ4 కణం నుంచీ దాదాపు 250-500 వరకూ కొత్త వైరస్‌లను తయారుచేస్తుంది.. ఈ క్రమంలో సీడీ4 కణం చనిపోతుంది. ఇలా సుమారు 10-15 సంవత్సరాల కాలంలో సీడీ4 కణాలు తీవ్రంగా దెబ్బతిని, వాటి సంఖ్య తగ్గిపోయి, వైరస్ పెరిగిపోయి.. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి.. ఎయిడ్స్ దశలోకి వెళ్లిపోతారు. తొలిదశలో హెచ్ఐవి యాంటీబాడీ పరీక్షలు చెయ్యటం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్షలో కచ్చితంగా ఫలితం తెలియాలంటే 6 వారాల నుంచి 6 నెలల 'విండో పీరియడ్' కాలం ఆగాల్సి ఉంటుంది. 'పీసీఆర్' పరీక్ష ద్వారా హెచ్ఐవి ఉనికిని ఇంకా ముందే గుర్తించవచ్చు. ఎయిడ్స్ దశలో పదిశాతం బరువు తగ్గిపోవటం తరచూ విరేచనాలు కావటం తరచూ జ్వరం రావటం ముఖ్య లక్షణాలు! ఇవే కాకుండా ఇంకా రకరకాల 'అవకాశ వ్యాధులు' వచ్చే ముప్పు కూడా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో ఊపిరితిత్తుల్లో క్షయ వ్యాధి చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులంతా తరచూ కళ్లె పరీక్ష చేయించుకోవటం ద్వారా క్షయ రాకుండావెంటనే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. అలాగే క్షయ వ్యాధిగ్రస్తులు కూడా హెచ్ఐవి పరీక్ష చేయించుకోవటం వల్ల ఈ వ్యాధులు ముదరకుండా చూసుకోవచ్చు. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్ష చేయించుకోవటం ద్వారా సమస్య ఎయిడ్స్‌కు దారితీస్తోందేమో తెలుసుకోవచ్చు. సాధారణ ఆరోగ్యవంతుల్లో సీడీ4 కణాల సంఖ్య 800-1500 వరకూ ఉంటుంది. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిలో ఈ సంఖ్య 250 కన్నా తగ్గినట్లయితే ఎయిడ్స్ దశలోకి వెళుతున్నట్టుగా గుర్తించాలి. ఎయిడ్స్ దశలోని వ్యక్తి ఆయుర్దాయాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 'ఏఆర్టీ సెంటర్ల' ద్వారా ఉచితంగా మందులు అందజేస్తోంది. వీటిని ఎయిడ్స్ బాధితులు కచ్చితంగా వాడటం ద్వారా ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు. ఇలా వ్యాపించదు! హెచ్ఐవి క్రిమి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, స్పర్శ ద్వారా, వస్తువుల ద్వారా, దోమల ద్వారా వ్యాప్తి చెందదు! చాలామంది దోమల ద్వారా హెచ్ఐవి ఎందుకు వ్యాపించదని ప్రశ్నిస్తుంటారు. హెచ్ఐవి క్రిమి మనుషుల్లోనూ, చింపాంజీల్లోనూ తప్పించి మరే జీవిలోనూ బతకలేదు. కాబట్టి ఇది దోమల ద్వారా వ్యాపించే అవకాశం లేదు. హెచ్ఐవి ఉన్న శారీరక ద్రవం ఏదైనా- బయటి వాతావరణంలో ఎండిపోయినట్త్లెతే.. ఆ ద్రవంలో ఉన్న హెచ్ఐవి క్రిమి కూడా చనిపోతుంది సంక్రమించేదెలా? ఎయిడ్స్ కారక వైరస్.. ప్రధానంగా 'హెచ్ఐవి పాజిటివ్' వ్యక్తుల శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శారీరక ద్రవాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 1. పురుషుల వీర్యం 2. స్త్రీల యోని ద్రవాలు 3. రక్తం 4. ఉమ్మనీరు 5. మస్తిష్క నీరు 6. తల్లిపాలు 7. ఊపిరితిత్తుల నీరు 8. పొట్ట నీరు. కాబట్టి పాజిటివ్ వ్యక్తుల శారీరక ద్రవాలు తమకుసోకకుండా, తగలకుండా చూసుకోవటం ముఖ్యం. సాధారణంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతోందంటే: అరక్షిత లైంగిక సంబంధాలు (94.69%) తల్లిదండ్రుల నుంచి బిడ్డకు (4.13%) కలుషిత సూదులు/సిరంజిలు (0.32%) కలుషిత రక్త మార్పిడి (0.3%) ఆధారం : ఈనాడు జాతీయ క్యాన్సర్ (రాచపుండు) నియంత్రణా కార్యక్రమం మంచిగా తలచినట్టుగానే క్యాన్సర్ ను నియంత్రించడంలోను, క్యాన్సర్ సంఘటనలను తగ్గించడంలోనూ జాతీయ రాచపుండు (క్యాన్సర్) నియంత్రణా కార్యక్రమం విజయం సాధిస్తోంది. అంతేగాకుండా క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంచగలుగుతోంది. దేశం వనరులలేమి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాకూడా అది ఇక్కడ ఒక విషయమే కాదనిపిస్తోంది. జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం అనేది ఒక ప్రజా ఆరోగ్య కార్యక్రమం. దీనిని క్యాన్సర్ రోగుల సంఖ్యను, మరణాలను తగ్గించడం కోసం ఉద్దేశించినది. దానితోపాటు క్యాన్సర్ రోగుల జీవనం మెరుగుదలకు ఉద్దేశించి రూపకల్పన చేయడం జరిగింది. లభ్యమైయ్యే వనరులను సక్రమంగా వినియోగించుకొని ఈ రోగాన్ని తొలిదశలోనే గుర్తించడం, నియంత్రించడం, రోగ నిర్ధారణ,చికిత్స మరియు తగ్గించడం కోసం ఒక పద్ధతి ప్రకారం మరియు ఎలాంటి పక్షపాతం లేకుండా నిరూపితమయ్యే వ్యూహాలతో కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంది. క్యాన్సర్ రోగాన్ని నియంత్రించే వివిధ రకాల మార్గాలను మదింపు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది జనాభాకు ఉపయుక్తమయిన పద్దతిని సమగ్ర జాతీయ క్యాన్సర్ కార్యక్రమం అమలు చేస్తోంది. జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం ఎక్కువగా క్యాన్సర్ రాకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు తొలిదశలోనే రోగాన్ని గుర్తించడం పైననే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ రోగాన్ని నయం చేసే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా రోగం తీవ్రదశలో ఉన్న రోగులకు ఎంత వీలయితే అంతటి సరైన వసతి కల్పించడం జరుగుతోంది. క్యాన్సర్ అనేది ఒక ప్రజా ఆరోగ్య సమస్య. ప్రతి ఏడాదికి 7 నుంచి 9 లక్షల మంది ఈ రోగం బారిన పడుతున్నారు. ఏ సమయంలోనైనా ప్రస్తుతం మనదేశంలో ఈ రోగుల సంఖ్య దాదాపు 25 లక్షలు ఉంటుందని ఒక అంచనా. ప్రతి ఏడాదికి నాలుగు లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నట్టు భావిస్తున్నారు. అంతేగాక దేశంలో ఉన్న క్యాన్సర్ రోగులలో 40 శాతం మంది పొగాకు వాడకం కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ రావడం అనేది మగవారిలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఊపిరి తిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ లుగా మనం వీటిని పిలుస్తున్నాం. అదే విధంగా మహిళల్లో అయితే గర్భసంచి క్యాన్సర్ (uterine cervix) మరియు రొమ్ముక్యాన్సర్ (breast) అనేది సర్వ సాధారణంగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ ను ముందుగానే రాకుండా నివారించడం, తొలిదశలోనే గుర్తించడం, చికిత్స మరియు పునరావాసం కల్పన అనే ఉద్దేశాలతో జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం 1975-76 లో ప్రారంభించిడం జరిగింది. రోగం నివారణ చేసేందుకు గాను మారుతున్నఅవసరాల మేరకు ఇప్పటికే మూడుసార్లు కార్యక్రమంలో సవరణలు చేపట్టారు. మూడవ సవరణ 2004 లో జరిగింది. సవరించిన కార్యక్రమం క్రింద క్యాన్సర్ రోగుల సంరక్షణా మరియు వసతి కేంద్రాలు భౌగోళకంగా ఒకే దగ్గరవుండి సమతుల్యం దెబ్బతినకుండా సవరించి దేశమంతా విస్తరించి ఉండేటట్లు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. కార్యక్రమ పరిధిని విస్తృత పరిచి మరియు దీనిద్వారా వివిధ పథకాల ద్వారా అందించు ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగింది. సవరించిన కార్యక్రమంలో ఉన్న 5 పథకాలు కొత్తగా ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాన్ని (Regional Cancer Centers (RCCs)) గుర్తించి దానికి ఒకేసారి అందించే రూ.5.00 కోట్లు గ్రాంటు నిధి ఇవ్వడం. ఇదివరకటికే ఉన్న ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రానికి (Regional Cancer Centers (RCCs)) ఒకేసారి అందించే రూ.3.00 కోట్లు గ్రాంటు నిధి ఇవ్వడం. ప్రభుత్వ సంస్థల యందు (వైద్య కళాశాలలు మరియు ప్రభుత్వ వైద్యశాలు) క్యాన్సర్ అధ్యయన విభాగాలను అభివృద్ధి పరిచి వాటిని పటిష్టపరచడం కోసం రూ.3.00 కోట్లు ఇవ్వడం. జిల్లా క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమానికి 5 సంవత్సరాల కాలానికి గాను గ్రాంటు నిధి క్రింద రూ. 90.00 లక్షలు అందివ్వడం. ఐ.ఇ.సి కార్యక్రమం క్రింద స్వచ్చంద సంస్థలు నిర్వహించే క్యాంపులకు వికేంద్రీకరణ స్వచ్చంద సంస్థల పథకం ద్వారా రూ.8 వేలు ఒక్కో క్యాంపునకు గ్రాంటుగా ఇవ్వడం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారుల నివేదిక ప్రకారం పటిష్టవంతంగా ఈ పథకం అమలుకు ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు ఇలా ఉన్నాయి: ఇప్పటికిప్పుడు చూస్తే దేశంలో 25 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు సమగ్రమైన విధంగా క్యాన్సర్ రోగానికి జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు మరో 250 సంస్థలు రేడియో థెరపీ పక్రియ ఏర్పాటు చేయడానికి సిద్దడుతున్నాయి. 11 వ పంచ వర్ష ప్రణాళిక మేర జాతీయ క్యాన్సర్ నివారణ పథకానికి సంబంధించిన వ్యూహ్యాలను రూపొందిచండం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక జాతీయ వ్యూహ్యాత్మక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ: ఆరోగ్య సంరక్షణలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఆరోగ్య కార్యకర్తలు వృత్తినైపుణ్యాలను పెంచడానికి క్యాన్సర్ రోగ నివారణ, పొగాకు మానడం, క్యానర్ పై అధ్యయనం మరియు క్యాన్సర్ ప్రభావం తగ్గించడం అనే అంశాలపై శిక్షణా పుస్తకాలు అభివృద్ధి చేయడం జరిగింది. క్యాన్సర్ నెట్–ఇండియా: క్యాన్సర్ సమాచారం పూర్తిగా అందించేందుకుగాను ఎన్కోనెట్ ఇండియా అనేది అమలు చేయబోతున్నారు. ఇది ఏ విధంగా ఉండాలనే అనే విషయంపై తగిన పూర్తి స్తాయి ప్రాజెక్టు నివేదికను (DPR) తయారు చేసే భాధ్యతను సి-డాక్ (C-DAC) తివేండ్రం వారికి అప్పజెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు క్రింది 25 ప్రాంతీయ ఆర్.సి.సి లు ఒకదానితో ఒకటి అనుసంధానమై కలుపబడి ఉంటాయి. ప్రతి ఆర్.సి.సి మళ్ళీ 5 ఇతర కేంద్రాలతో కలుపడి ఉండేటట్లు రూపొందిస్తున్నారు. ఐ.ఏ.ఆర్.సి సభ్యత్వం: అంతర్జాతీయ క్యాన్సర్ అధ్యయన సంస్థ నందు భారతదేశం కూడా సభ్యత్వం పొంది ఉంది. దీంతో క్యాన్సర్ కు సంబంధించిన అంశాల అధ్యయనములో మరింత ప్రగతి సాధించే వీలు ఏర్పడింది. జాతీయ క్యాన్సర్ అవగాహన దినం: మేడమ్ క్యూరై జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబరు 7వ తేదిన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సాధారణ ప్రజలలో అవగాహన పెంపునకు ఈ రోజు పెద్ద సంఖ్యలో బ్యానర్లు ప్రదర్శించడం జరుగుతున్నది. ఆరోగ్యశాఖా మంత్రి "రన్ " క్యాన్సర్ రోగుల నిధి ఆరో్గ్యశాఖా మంత్రి క్యాన్సర్ రోగుల నిధి (Health Minister's Cancer Patient Fund" (HMCPF)) ని రాష్ట్తీయ ఆరోగ్య నిధి (RAN) పథకం పరిధిలోనే 2009 లో ఏర్పాటు చేశారు. ఈ ఆరో్గ్య శాఖ మంత్రి క్యాన్సర్ నిధిని ఉపయోగించుకోవాలంటే ప్రాంతీయ క్యాన్సర్ చికిత్స కేంద్రాలలో రన్ పథకం లోలాగానే అవసరమైన చక్రనిధిని (revolving fund) ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీంతో భారత ప్రభుత్వం క్యాన్సర్ నివారణ పరికరాలకు కావలసిన నిధులను అందిస్తుంది. ఈ పక్రియ ద్వారా ఆర్థిక సహాయం త్వరితగతిన అంది రన్ అనే పథకం క్రింద ఏర్పాటు అయిన ఆరోగ్య శాఖా మంత్రి నిధి ఉద్దేశాలను నెరవేరుస్తుంది. ఈ పథకంలో క్యాన్సర్ రోగికి రూ.1,00,000లు (రూపాయలు లక్ష మాత్రమే) వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అయితే ఈ సంబంధిత సంస్థలు , వైద్యశాలలు చక్రనిధి నుండి చెల్లించి వాటిని తిరిగి పొందే ఏర్పాటు చేశారు. పై తెలిపిన మొత్తం కన్నా ఎక్కువ అవసరమైన వారికి ఆయా సంస్థలు , వైద్యశాలలు కేంద్ర నిధులకోసం సిఫార్సు చేయవలసి ఉంటుంది. ముందుగా 10 లక్షల రూపాయల చక్రనిధిని విడుదల చేసిన 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఈ పథకం క్రింది ప్రతిపాదించడం జరిగింది. జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం ప్రస్తుత పరిస్థితి మరియు భారత దేశంలో అనుసరిస్తున్న వ్యూహాలు పరిచయం క్యాన్సర్ భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో మొదటి 10 రకాల ప్రధాన జబ్బులలో ఒకటిగా ఉంటోంది.. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏ సమయంలోనైనా 2 నుంచి 2.5 మిలియన్ల మంది క్యాన్సర్ రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. సంవత్సరానికి క్రొత్తగా 7 లక్షల క్యాన్సర్ రోగులు ఏర్పడుతుంటే, 3 లక్షల మంది దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం క్రింద జనాభా ఆధారిత లెక్కలకు సంబంధించిన రిజిష్టర్లు ఇస్తున్న సంకేతాలు ఏమిటంటే క్యాన్సర్ మన శరీర భాగాలలో ఎక్కడ ఎక్కువగా వస్తున్నదంటే నోరు, ఊపిరితిత్తులు, గొంతు ,కడుపు ప్రాంతాలలో పురుషులకు అలాగే మహిళల్లో అయితే రొమ్ము , నోరు ,గొంతు క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. భారతదేశంలో 50 శాతం పైగా మరణాలు పురుషుల్లో నోరు, ఊపిరితిత్తులు , మహిళల్లో గర్బాశయ ముఖద్వారం మరియు రొమ్ము క్యాన్సర్ వల్ల కలుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా మేరకు దక్షిణ –తూర్పు ఆసియాలో 91 శాతం మందికి నోటి క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ నేరుగా పొగాకు వాడకం వల్లనే వస్తున్నట్టు తెలుస్తోంది. భారత దేశంలో అయితే నోటి క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ లకు పొగాకు వాడకం ప్రధాన కారణంగా ఉంటోంది. దీని ఫలితాలను జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం పట్టికలో ఇవ్వడం జరిగింది. లక్ష్యాలు మరియు ఉద్ద్యేశాలు జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం 1975-76 లో ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యాలు మరియు ఉద్ద్యేశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఆరోగ్య విద్య మరియు అవగాహన ద్వారా ప్రాథమికంగా క్యాన్సర్ ముందుగానే రాకుండా నివారించవచ్చు. పొగాకు వాడకం వల్ల జరిగే అనర్థాలను,. అలాగే ఆవశ్యమైన జన్యుశుభ్రతను పాటించడం వల్ల గొంతు క్యాన్సర్ ను ముందుగానే అరికట్ట వచ్చని వివరిస్తూ ఆరోగ్య పరమైన అవగాహన కల్పించడం. రెండవ క్యాన్సర్ రాకుండా ముందుగానే అరికట్టే విధానం ఏమిటంటే క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం, క్యాన్సర్ ను పరీక్షల ద్వారా నిర్ధారించడం. ఉదాహరణకు గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మరియు ఒరోఫర్యన్ క్యాన్సర్ లను రకరకాల పద్దతులద్వారా పరీక్షించడం మరియు రోగులు స్వయంగా పరీక్షించుకునే పద్దతులపై అవగాహన కల్పించడం. ఇదివరకే అమలు చేస్తున్న క్యాన్సర్ చికిత్స వసతులు సరిపోకుంటే వాటిని పటిష్టపరచడం. జీవితానికే ప్రమాదంగా మారిన స్థాయిలో ఉన్న క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడం. జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్న పథకాలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం ఈ పథకం ముందుగానే క్యాన్సర్ ను గుర్తించే ఐ.ఇ.సి కార్యక్రమాలకు ఉద్దేశించినది. ఆరోగ్య విద్య మరియు ముందుగానే క్యాన్సర్ ను గుర్తించే కార్యక్రమాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు నమోదు అయిన స్వచ్చంధ సంస్థలకు రూ.5.00 లక్షల దాకా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ఈ పనికి సంబంధించి వారు తప్పనిసరిగా ఏదైనా ఒక ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రానికి అనుసంధానమై పనిచేయవలసి ఉంటుంది. (లేదా వైద్యకళాశాల /జిల్లా వైద్యశాలలు అక్కడ ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం లేని పక్షంలో) జిల్లా క్యాన్సర్ నియంత్రణా పథకం సరైన ఆరోగ్య విద్య అందించడం మరియు ముందుగానే రోగాన్ని గుర్తించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా అరికట్టవచ్చని మనకు తెలిసిందే. జిల్లా స్థాయిలో పనిచేసే ఈ పథకం 1991 లో ప్రారంభమైనది. క్యాన్సర్ రాకుండా ముందుగానే అరికట్టుట, ఆరోగ్య విద్య, మరియు క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించడం చేయడం జరుగుతుంది. అంతేగాక నొప్పి తగ్గించే ఉపశమనం పద్దతులు అమలు చేస్తారు. ఈ పథకం క్రింద ఒకసారి అందించే విధంగా రూ.15.00 లక్షలు ఆర్థిక సహాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం క్రింది ఎంపికయిన జిల్లా ప్రాజెక్లులకు అందివ్వడం జరుగుతుంది. అలాగే రూ 10.00 లక్షలు ప్రతి సంవత్సరం అందించే విధంగా ప్రాజెక్టు అమలు కాలమైన మరో నాలుగు సంవత్సరాలకు అందిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలతో అనుసంధానమై పనిచేస్తుంది. ఒకవేళ అక్కడ ఆ కేంద్రాలు లేకుంటే ఏదైనా మంచి వసతులు ఉన్న క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే సంస్థలతో కలసి పనిచేస్తుంది. రోగులకు సంబంధిత ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం ద్వారా గాని లేదా నోడల్ సంస్థల ద్వారా గాని చికిత్సను అందించడం జరుగుతుంది. కోబల్ట్ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం క్యాన్సర్ చికిత్స వసతుల పటిష్టతకు టెలి థెరపీ, బ్రాచీథెరపి పరికరములు కొనుగోలు చేసేందుకు గాను సేవా సంస్థలకు రూ 1.0 కోటి లేదా ప్రభుత్వ సంస్థలకు అయితే రూ 1.5 కోట్లు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రస్తుతానికి ఒక సారి అందించు గ్రాంటుగా మాత్రమే ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్ అధ్యయన విభాగాల అభివృద్ధి దేశంలో భౌగోళకంగా లభ్యమవుతున్న క్యాన్సర్ చికిత్స వసతులలో ఉన్నలోపాలను సవరించేందుకు ఉద్దేశించినది. పరికరములు కొనుగోలుకు మరియు కోబల్ట్ యూనిట్ నెలకొల్పుకునేందుకు మరియు ఇతరములకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక సివిల్ పనులకు మరియు సిబ్బంది వేతనాలకు గాను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం రూ. 2 కోట్ల వరకు ఒక్కో సంస్థకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఒక సారి మాత్రమే అందించు గ్రాంటు నిధి. ప్రాంతీయ అధ్యయన మరియు చికిత్స కేంద్రాలకు ఆర్థిక సహాయం భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాంతీయ క్యాన్సర్ అధ్యయన మరియు చికిత్సా కేంద్రాలు 19 ఉన్నాయి. అందులో 15 సంస్థలకు వివిధ దఫాలుగా గత 50 సంవత్సరాలుగా మొత్తం రూ 75 లక్షలు గ్రాంటుగా అందజేయడం జరిగింది. సి.యన్.సి.ఐ,కోల్ కతా మరియు ఐ.ఆర్.సి.హెచ్, ఎయిమ్స్ లు కూడా అదనంగా యన్.సి.సి. పి క్రింది నిధులు అందజేస్తున్నాయి. నూతన ప్రయత్నాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులతో జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం చేపడుతున్న కార్యక్రమాలే కాకుండా ఇంకా కొన్ని కొత్త రకాల కార్యక్రమాలు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అమలు అమలు చేస్తున్నారు. భారతదేశంలో 1998-1999 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ బీనియం (రెండు సంవత్సరాలు కాలవ్యవధి కలిగిన ప్రాజెక్టులు) అనే పథకం క్రింద 16 శిక్షణా కార్యక్రమాలు/సదస్సులు నిర్వహించారు. పాప్ సమీర్ కిట్ మరియ క్యాన్ స్కాన్ సాప్ట్ వేర్ 12 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలుకు సరఫరా చేయడం జరిగింది. మోర్ఫిన్ మాత్రలు వారికి సరఫరా చేశారు. 2000-2001 ప్రపంచ ఆరోగ్య సంస్థ బీనియం ద్వారా ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది: క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించేందుకు గాను వైద్యకళాశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం. మోర్ ఫైన్ మాత్రల సరఫరా. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి మరియు అవగాహన కల్పించేందుకుగాను సిబ్బందికి శిక్షణ నిర్వహించడం. ఫోన్ ద్వారా మందులు తెలుపడం. కంప్యూటర్ వస్తువులు మరియు సాప్ట్ వేర్ సరఫరా చేయడం. ఐ.ఈ.సి కార్యక్రమాలు. జిల్లా క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమాల సవరణ. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. ఆరోగ్య మేళాలలో పాల్గొనడం మరియు ఆరోగ్య విద్యకు సంబంధించిన ఉపకరణములను సరఫరా చేయడం. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్బంగా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం అనే అంశంపై తపాలా శాఖచే తపాలా బిళ్ళలను ముద్రించడం. కళ్యాణి అనే పేరుతో టెలి ఫిలిం ను ఆరోగ్య సంచికలా ప్రసారం చేయడం మరియు పొగాకు వ్యతిరేక అంశాలపై ప్రసారం చేయడం (ప్రసార భారతి మరియు యం.ఓ.హెచ్.డబ్యూ లకు కుదిరిన ఒప్పందం మేరకు). సి.యన్.సి.ఐ, కోల్ కతా వారి ద్వారా అభివృద్ది చేసి ఆడియో పరికరములను ఆరోగ్య విద్యలో భాగంగా యఫ్.ఎం రేడియో ద్వారా ప్రసారం చేయడం. ప్రస్తుత్తం జరుగుతున్న రెండు సంవత్సరాలు బీనీయం ఆ ప్రకారమే కొనసాగుతున్నాయి. వర్థమాన్ మహావీర్ వైద్యకళాశాల మరియు సంఫ్డర్ జంగ్ వైద్యశాలలు ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారంతో ఓ.పి.డి ద్వారా క్యాన్సర్ రోగుల గుర్తింపును జరుపడానికి ప్రణాళికలు తయారుచేసుకుంటున్నాయి. సవరించిన జిల్లా క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం సవరించిన జిల్లా క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమాన్ని ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అనే నాలుగు రాష్ట్రాలలో ప్రారంభించడమైనది. ఈ ప్రాజెక్టు క్రింద అరవై పంచాయితీ సమితులను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 1200 యన్.సి.డి కార్యకర్తలు, 30 మంది పర్యవేక్షకులు, వైద్యుల మరియు సలహాదారులను నియమించడమైనది. ఇది. దీనిద్వారా దాదాపు 20-65 సంవత్సరాల వయస్సు మధ్యగల 12 లక్షల మహిళలను కలసి ఒక రకమైన సర్వే మరియు ఆరోగ్య విద్యను అందించే కార్యక్రమం. ఆరోగ్య విద్య సాధారణ అనారోగ్యాలు, క్యాన్సర్ నివారణ మరియు ముందుగా గుర్తించడం భాగంగా ఉంటుంది. దానితో పాటు రొమ్ములను స్వయం పరీక్ష చేసుకునే విధానాన్ని తెలియజెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషిస్తారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ప్రతి నవంబరు 7వ తేదిని క్యాన్సర్ అవగాహన దినంగా భావిస్తున్నారు. మేడమ్ క్యురై జ్ఞాపకార్థంగా తపాలా శాఖ వారు 2001 వ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవానికి పురస్కరించుకొని విజ్ఞాన భవన్ లో ఆమె బొమ్మతో ఉన్నతపాలా బిళ్ళను విడుదల చేశారు. దేశంలోని ప్రముఖ దినపత్రికలలో కూడా జాతీయ క్యాన్సర్ అవగాహన దినంపై వార్తా పత్రికల ప్రకటనలు దేశ వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. పదవ ప్రణాళిక వ్యూహ్యాలు జాతీయ క్యాన్సర్ నియంత్రణా కార్యక్రమం కోసం పదవ ప్రణాళిక కోసం దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నిపుణుల బృందం సూచనలమేరకు ఇ.ఎఫ్.సి. సమాచారం ప్రత్యేకంగా తయారు చేసి ప్రణాళికా కమీషనరుకు అందజేయడం జరిగింది. జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం -1981-2001 97.8 (బెంగుళూరు) to 121.9 (ఢిల్లీ) క్యాన్సర్ రోగులు ప్రతి 1,00,000 పట్టణ పురుష జనాభాకు (సంఘటనల బట్టి వయస్సు సరిచేయడమైనది) 92.2 (భోపాల్) to 135.3 (ఢిల్లీ) క్యాన్సర్ రోగులు ప్రతి 1,00,000 పట్టణ స్త్రీ జనాభాకు (సంఘటనల బట్టి వయస్సు సరిచేయడమైనది). 46.2 (బార్షి ) క్యాన్సర్ రోగులు ప్రతి 1,00,000 గ్రామీణ పురుష జనాభాకు (సంఘటనల బట్టి వయస్సు సరిచేయడమైనది). 57.7 (బార్షి) క్యాన్సర్ రోగులు ప్రతి 1,00,000 గ్రామీణ స్త్రీల జనాభాకు (సంఘటనల బట్టి వయస్సు సరిచేయడమైనది). పట్టణ ప్రాంతాలలో ప్రతి 15 మంది పురుషులలో ఒకరికి, ప్రతి 12 మంది స్త్రీలలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ రావచ్చని తెలుస్తోంది. స్త్రీలలో మెడ, రొమ్ముల క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని పొగాకు ద్వారా వచ్చే క్యాన్సర్ కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్నవాహిక క్యాన్సర్ వయస్సు సవరణ శాతం స్త్రీలలో ఎక్కువగా బెంగుళూరులో ప్రపంచంలోనే అధికంగా నమోదు అయింది. (8.3 ప్రతి 1, 00,000). నాలుకకు సంబంధించిన క్యాన్సర్ భోపాల్ లోని(8.8 ప్రతి 1,00,000) ఫురుషుల యందు ఎక్కువగా ఉన్నట్టు మన ఖండంలోనే అధికంగా వస్తున్నది. దక్షిణ ప్రాంతాలలో క్యాన్సర్ ఎక్కువగా కడుపుకు సంబంధించి పురుషులలో ఎక్కువగా నమోదు అయింది. పిత్తాశయం క్యాన్సర్ స్త్రీలలో ప్రపంచంలోనే ఢిల్లీలో (8.9 ప్రతి 1, 00,000) ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. 75-80% రోగులకు క్యాన్సర్ ముదిరిపోయిన తరువాతే మొదటిసారి వైద్యశాలుకు హాజరు అవుతున్నారు. భారత దేశంలో క్యాన్సర్ నియంత్రణ చేపట్టి 50 సంవత్సరాలు పూర్తి అయినది. ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు కిద్వాయ్ మెమోరియల్ ఇన్ సిస్ట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ , బెంగుళూరు (కర్నాటక) గుజరాత్ క్యాన్సర్ మరియు రీసెర్చ్ ఇన్ సిస్ట్యూట్, అహ్మదాబాద్ (గుజరాత్) క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్ సిస్ట్యూట్, గ్వాలియర్ (మధ్యప్రదేశ్) క్యాన్సర్ ఇన్ సిస్ట్యూట్, మద్రాసు(తమిళనాడు) రీజనల్ క్యాన్సర్ సెంటర్ , తివేండ్రం (కేరళ) రీజనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చీ అండ్ ట్రీట్ మెంట్ సోసైటీ, కటక్ (ఒరిస్సా) డా. బి.బి. క్యాన్సర్ ఇన్ సిస్ట్యూట్, గౌహతి (అస్సాం) చిత్తరంజన్ నేషనల్ ఇన్ సిస్ట్యూట్, కోలకత్తా (పశ్చిమ బెంగాల్) ఇన్ సిస్ట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పటల్ (ఎయిమ్స్), న్యూఢిల్లీ టాటా మెమోరియల్ హాస్పటిల్, ముంబై (మహారాష్ట్ర) కమల నెహ్రు మెమోరియల్ హాస్పటిల్, అలహాబాదు (ఉత్తర ప్రదేశ్) యం.యన్.జె. ఇన్ సిస్ట్యూట్ ఆఫ్ అన్కాలజి, హైదరాబాజు (ఆంధ్రప్రదేశ్) ఆర్.యస్.టి. క్యాన్సర్ హాస్పటిల్, నాగపూర్ (మహారాష్ట్ర) ఇందిరాగాంధి ఇన్ సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా (బీహార్) ఆచార్య హరిహర్ తులసి దాస్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, బికనీర్ (రాజస్థాన్) ఇందిరాగాంధి మెడికల్ కాలేజీ, సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్ సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోహటక్ (హర్యానా) పి.టి. జె.యన్.యం. మెడికల్ కాలేజీ అండ్ ఆర్.సి.సి., రాయపూర్ (చత్తీస్ ఘడ్) జింపర్, పాండిచ్చేరి ఆధారము: వై.యన్ రావు, సుధీర్ గుప్త మరియు యస్.పి. అగర్వాల్ జాతీయ స్ధాయి పథకాలు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ ఆర్ హెచ్ ఎం) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం) అనేది దేశం మొత్తానికి ముఖ్యంగా బలహీనమైన ఆరోగ్య సూచికలున్న, మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న 18 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమర్ధవంతమైన ఆరోగ్య రక్షణనివ్వడానికి ఉద్దేశించింది. ఈ మిషన్ కాలవ్యవధి 2005 నించి 2012 దాకా ఉంటుంది. ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మధ్య ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాంచల్, ఉత్తర్ ప్రదేశ్. లక్ష్యాలు శిశు మరణ రేటు(ఐఎంఆర్)ను తల్లి మరణ నిష్పత్తి(ఎంఎంఆర్)లను తగ్గించడం స్త్రీ ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం, రోగనిరోధకీకరణ, పోషక విలువలు వంటి సేవలను విశ్వజనీకరంగా అందుకోవడం స్థానికంగా వచ్చే రోగాలతోబాటు అంటు రోగాల ను నిరోధించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం సమీకృత ప్రాథమిక ఆరోగ్య రక్షణ పొందే వీలు కల్పించడం జనాభా నియంత్రణ, స్థల , లింగ సమతుల్యత స్థానిక ఆరోగ్య సంప్రదాయాలను పునరుద్ధరించడం, 'ఆయుష్' - ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రధానంగా పెంచడం ఆరోగ్యదాయకమైన జీవనశైలిని ప్రోత్సహించడం వ్యూహాలు ప్రధానవ్యూహాలు పంచాయితీ రాజ్ సంస్థల(పిఆర్ఐ) సామర్థ్యాన్ని పెంచడానికి శిక్షణనివ్వడం , ప్రాథమిక ఆరోగ్య సేవల నిర్వహణను చేపట్టడం మహిళా ఆరోగ్య కార్యకర్తల(ఆశ) ద్వారా గృహస్థాయిలో ఆరోగ్య రక్షణ మెరుగుపరిచేందుకు ప్రోత్సహించడం పంచాయితీల గ్రామ ఆరోగ్య కమిటీల ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణని ప్రోత్సహించడం. స్వేచ్ఛానిధుల ద్వారా ఉప కేంద్రాలను బలోపేతం చేయడం, తద్వారా స్థానికంగా ప్రణాళికలను ఆరచణలో పెట్టడం, మరింత మంది బహుళ ప్రయోజక కార్యకర్తలను తయారుచేయడం ప్రస్తుతం ఉన్న పి.హెచ్.సి, సి.హెచ్.సి లను బలోపేతం చేయడం, ప్రతి లక్ష జనాభాకు 30-50 పడకల సి.హెచ్.సి లను ఏర్పాటుచేయడం, తద్వారా ప్రమాణాలను మెరుగుపరచడం తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్య, పోషకతల పై జిల్లా ఆరోగ్య మిషన్ తయారు చేసిన అంతర్ విభాగీయ ఆరోగ్య ప్రణాళికలను సిద్ధం చేయడం, అమలు చేయడం జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయుల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేయడం జాతీయ, రాష్ట్ర, జిల్లా ఆరోగ్య మిషన్లకు ప్రాథమిక ఆరోగ్య నిర్వహణకై సాంకేతిక సాయాన్నివ్వడం డేటా సేకరణ, మదింపు, సాక్ష్యాధార ప్రణాళికారచన, పర్యవేక్షణ వంటి అంశాలలో సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మానవ వనరులను ఆరోగ్య శాఖకోసం అభివృద్ధిచేయడం, వారిని రంగంలో ఉంచడం, వాటికి తగినవిధంగా పారదర్శకమైన పాలసీలను తయారుచేయడం ఆరోగ్య పరిరక్షణా సామర్థ్యాన్ని అన్ని స్థాయుల్లో అభివృద్ధి చేయడం, తద్వారా ఆరోగ్యప్రదమైన జీవనశైలిని ప్రోత్సహించడం, పొగాకు, మద్యం వంటి వాటి వాడకాన్ని తగ్గింపచేయడం ఆరోగ్య సేవలు అందుకోలేని ప్రాంతాలకు లాభాపేక్షలేని సంస్థలను ప్రోత్సాహించడం అదనపు వ్యూహాలు: సాధారణ గ్రామీణ వైద్య ప్రాక్టీషనర్లతో సహా ప్రయివేటు రంగాన్ని క్రమబద్దీకరించడం, తద్వారా ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన సేవలందించడం ప్రజారోగ్య లక్ష్యాలను సాధించడంలో పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించడం 'ఆయుష్' ప్రత్యామ్నాయ వైద్య విధానాలు - ప్రధానంగా పెంచడం - స్థానిక ఆరోగ్య సాంప్రదాయాలను ఉత్తేజపరచడం వైద్య సంరక్షణ, వైద్య నీతి - వీటితోపాటు వైద్య విద్యను గ్రామీణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించేలా పునర్వ్యవస్థీకరించడం సంస్థాగత పద్ధతులు గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య సమితి (గ్రామ స్థాయిలో పంచాయితీ ప్రతినిధులు, ఏఎన్ఎం/ఎంపిడబ్ల్యు, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆశ, సమూహ ఆరోగ్య వాలంటీర్లు) ఏర్పాటు ప్రజా వైద్యశాలల సాముహిక నిర్వహణకు రోగి సంక్షేమ సమితి (తత్సమానం) ఏర్పాటు జిల్లా పరిషత్ అధ్వర్యంలో జిల్లా ఆరోగ్యాధికారి కన్వీనర్ గా, ఇతర సంబంధిత విభాగాలు, ఎన్జీఓలు, ప్రైవేటు నిపుణుల ప్రాతినిధ్యంతో జిల్లా ఆరోగ్య మిషన్ ముఖ్యమంత్రి సారధ్యంలో, ఆరోగ్య మంత్రి, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఇతర సంబంధిత విభాగాలు, ఎన్జీఓలు, ప్రైవేటు నిపుణుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర ఆరోగ్య మిషన్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖలను ఏకీకృతంచేయడం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి సారధ్యంలో ప్లానింగ్ కమీషన్ డిప్యుటీ ఛైర్మన్, పంచాయితీ రాజ్ మంత్రులు, గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, పౌర ఆరోగ్య నిపుణులు సభ్యులుగా జాతీయ మిషన్ స్టీరింగ్ గ్రూప్ ఈ మిషన్ కు పాలసీ పరంగా తోడ్పాటునిస్తారు. కార్యదర్శి, హెచ్‌ఎఫ్‌డబ్ల్యు సారధ్యంలో సాధికార కార్యక్రమ కమిటీ - ఇది కార్యనిర్వహణాభారాన్ని వహిస్తుంది. ఆశ అనే దాన్ని అమలుచేయడానికి స్టాండింగ్ మానిటరింగ్ కమిటీ అనేది సలహాలనిస్తుంది. సమయ నిర్ధారితమైన పనులు చేపట్టడానికి టాస్క్ గ్రూపులు. నిధుల ఏర్పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాలైన ఆర్సిహెచ్ 11, మలేరియా, టిబి, కాలా అజర్, ఫైలేరియా, అంధత్వం, అయోడిన్ లోపం వంటి వాటికై జాతీయ వ్యాధి నియంత్రణా కార్యక్రమాలు, సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం వంటి వాటిని కూడా ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించేలా ఈ మిషన్ ఏర్పాటు. ఎన్ఆర్హెచ్ఎం కోసం 2005-06 కుగానూ దాదాపు 6700 కోట్ల రూపాయలు కేటాయించారు. దానికి అదనంగా 30 శాతం ప్రతి ఏడాదీ జోడించి జాతీయ సామాన్య కనీస కార్యక్రమం కింద పౌర ఆరోగ్యానికి కేటాయింపు 0.9 శాతం జిడిపి నుంచి 2-3 శాతం జిడిపి కి పెరిగేలా చూడటం ఈ మిషన్ ఉద్దేశ్యం. ఎన్ఆర్ హెచ్ఎం కోసం ఎంత కేటాయించాలో తదనుగుణంగా నిర్ధారిస్తారు. ప్రజా ఆరోగ్య బడ్జెట్ కోసం కనీసం సం. 10 శాతం నిధులిచ్చి మిషన్ కార్యక్రమాలను అమలయ్యేలా రాష్ట్రాలు చూడాలి ఎస్.సి.ఓ.వి.ఏ ద్వారా రాష్ట్రాలకు నిధులు జారీ అవుతాయి. వీటిలో 18 హెచ్చు ప్రాధాన్యతగల రాష్ట్రాలపై శ్రద్ధ ఎక్కువ. కాల వ్యవధి(ప్రధాన భాగాలు) భాగాలు వ్యవధి వివిధ సొసైటీలను ఏకంచేసి జిల్లా / రాష్ట్ర మిషన్లను ఏర్పాటుచేయడం జూన్ 2005 ఎస్. సి / పి.ఎస్.సి / సి.హెచ్.సి స్థాయిలలో సాధారణ ఔషధాలను అదనంగా ఏర్పాటుచేయడం డిసెంబర్ 2005 కార్యక్రమ నిర్వహణా యూనిట్లను ఆరంభింపజేయడం 2005-06 గ్రామీణ ఆరోగ్య పథకాలను తయారుచేయడం 2006 గ్రామ స్థాయిలో ఆశ(మందు కిట్ తో సహా) ఏర్పాటుచేయడం 2005-2008 గ్రామీణ వైద్యశాలల స్థాయిని పెంచడం 2005-2007 జిల్లా ప్రణాళికలను పనిచేయించడం 2005-2007 జిల్లా స్థాయిలో సంచార వైద్య యూనిట్లను ఏర్పాటుచేయడం 2005-08 ఫలితాలు జాతీయ స్థాయి: శిశు మరణ రేటు30/1000 సజీవ జననాలకు తగ్గింది బాలింతల మరణ రేటుని 100/100,000 సజీవ జననాలకు తగ్గించాలి ఫెర్టిలిటీ రేటు 2.1 కి తగ్గింది మలేరియా మృతుల తగ్గింపు రేటు 2010 నాటికి 50%, 2012 నాటికి అదనంగా 10% తగ్గించాలి కాలా అజర్ మృతుల తగ్గింపు రేటు 2010 నాటికి 100%, 2012 నాటికి పూర్తిగా తొలగింపు ఫైలేరియా మృతుల తగ్గింపు రేటు 2010 నాటికి 70%, 2012 నాటికి 80%, 2015 నాటికి పూర్తిగా తొలగింపు డెంగ్యూ మృతుల తగ్గింపు రేటు 2010 దాకా 50%, 2012 నాటి దాకా ఆ రేటు పెరగకుండా చూడటం జపనీస్ ఎన్సిఫలైటిస్ మృతుల తగ్గింపు రేటు 2010 దాకా 50%, 2012 నాటి దాకా ఆ రేటు పెరగకుండా చూడటం కేటరాక్టు ఆపరేషన్లు 2012 దాకా సం. 46 లక్షలకు పెంచడం కుష్టు రోగ రేటు 2005 లోని 1.8/10,000 రేటు కన్నా తగ్గేలా చూడటం ట్యూబర్కలోసిస్(టిబి) డాట్స్ సేవలు - 85 శాతం నివారణ రేటును ఈ మిషన్ పూర్తి వ్యవధిలో ఉండేలా చూడటం భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా సామూహిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచడం ఫస్ట్ రెఫరల్ యూనిట్ల వాడకాన్ని 20% కన్నా తక్కువ నించి 75% కి పెంచడం 250,000 మహిళలను అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్(ఏఎస్హెచ్ఏస్ - ఆశాస్) 10 రాష్ట్రాల్లో ఏర్పాటుచేయడం సమూహాలస్థాయి: సమూహాల స్థాయిలో సుశిక్షితులైన కార్యకర్తలు గ్రామస్థాయిలో సాధారణ రోగాలకు కావలసిన ఔషధ సామగ్రితో లభ్యమయ్యేలా చూడటం అంగన్వాడీ స్థాయిలో ఒక నిర్ధారిత రోజు /నెలను ఆరోగ్య దినంగా పాటించటం, ఆ రోజు వైద్య తనిఖీలను నిర్వహించడం, తల్లి, శిశు సంక్షేమ సేవలను పోషక సంబంధ సేవలను అందించడం సాధారణ రోగాలకు కావలసిన ఔషధ సామగ్రిని ఉపకేంద్రం, వైద్యశాల స్థాయిలలో లభ్యమయ్యేలా చూడటం వైద్యులు, మందులు, నాణ్యమైన సేవలు పిహెచ్ సి / సిహెచ్ సి స్థాయిలలో చక్కని వైద్య రక్షణనివ్వడం ఆటో డిసేబుల్డ్ సిరంజిలు, ప్రత్యామ్నాయ టీకాలు విడుదల చేయడం ద్వారా విశ్వజనీన రొగనిరోధకాలకు వాటిని మెరుగైన రీతిలో వాడేలా చూడటం, ఇంకా ఈ కార్యక్రమం కింద మెరుగైన సేవలనందించడం రెఫరల్, రవాణా, ఎస్కార్ట్, మెరుగైన వైద్యశాల సంబంధ రక్షణ - ఇవన్నీ జనని సురక్ష యోజన(జెఎస్వై) కింద సబ్సిడీలో బీద కుటుంబాలకు సంస్థలద్వారా మెరుగైన సౌకర్యాలందించడం. హామీపూర్వక ఆరోగ్య రక్షణని తక్కువ ఆర్థిక సదుపాయం తో ఆర్థిక ప్రమాదాన్ని తగ్గించి , దానికి సామూహిక ఆరోగ్య బీమాను పైలెట్ గా ఈ మిషన్ కింద అందించడం గృహాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయించడం జిల్లా స్థాయిలో సంచార వైద్యశాలల ద్వారా మరింత ప్రజల ద్గ్గరకు వైద్యసేవలు జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంపై మరిన్ని వివరాలకు అపార్డ్ వారు రూపొందించిన సమాచారం ఈ క్రింద జత చేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో చూడండి. పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో జననీ సురక్ష యోజన పథకం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (NRHM) పార్ట్ - ఎ భాగంగా పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య పథకం - II క్రింద సురక్షితమైన మాతృత్వం, సురక్షితమైన శిశు జననాలకు తోడ్పడటానికి భారత ప్రభుత్వం జననీ సురక్షయోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గర్భవతి అయిన మహిళ ప్రభుత్వాస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురుడు పోసుకుంటే ఈ పథకం కింద రూ.700/- నగదును ప్రోత్సాహకంగా ఆ మహిళకు చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కేంద్రాల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గర్భిణులు, వారి వెంట తోడు వచ్చే ఒకరిద్దరు వ్యక్తులు తమ గ్రామం నుంచి వైద్య కేంద్రం లేదా ఆస్పత్రి ఉన్న పట్టణానికి వచ్చి పోవటానికయ్యే రవాణా ఖర్చులు, ఆస్పత్రి వద్ద రెండు, మూడు రోజుల పాటు ఉండటానికయ్యే భోజన వసతి ఖర్చులు, ఆ మూడు రోజుల పాటు వారు కోల్పోయే కూలీ డబ్బులకు పరిహారం తధితరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహక నగదును అందజేస్తారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ విటమిన్ ‘ఏ’ అనుబంధ కార్యక్రమం (జనవరి/జులై నెలలో) ఎ.ఎన్.ఎమ్/అంగన్ వాడి/గ్రామీణ మహిళా ఆరోగ్య కార్యకర్తలకు విటమిన్ ‘ఏ’ అనుబంధ కార్యక్రమంపై మార్గదర్శకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు