లక్ష్యం: మనం నిర్లక్ష్యంగా నీటిని వృథా చేస్తున్న రోజువారీ కార్యకలాపాలను గుర్తిద్దాం. నీటిని తెలివితో, బాధ్యతతో వినియోగించడం పట్ల అవగాహన పొందుదాం. నేపథ్యం: ప్రతివ్యక్తి, ప్రతిరోజు తాగడానికి, వంటకు, స్నానానికి, దుస్తుల పరిశుభ్రతకు మరియు ఇతర అవసరాల నిమిత్తం దాదాపుగా 2 1/2 పెద్ద బక్కెట్ల నీటిని వినియోగిస్తారు. కాని కనీసం తాగడానికి సరిపోయే నీరు లేక కొన్ని లక్షలమంది అష్టకష్టాలు పడుతున్నారు. నీరు అందుబాటులో ఉన్నవారేమో విచక్షణారహితంగా ఉపయోగించడం, నల్లాల లీకేజీలు పట్టించుకోకపోవటం, బిందెల నిండా పట్టి, ఏ అవసరానికీ వాడకుండా పారబోసి మళ్ళీ పట్టడం, బ్రష్ చేసుకొంటున్నంత సేపు నల్లా కట్టేయకపోవటం, ఎక్కువసార్లు బట్టలు జాడించడం వంటి పనులతో నీరు వృథా చేస్తుండటం శోచనీయం. ఈ విధమైన నీటి వృథాను అరికట్టడం ద్వారా ఎంతో నీటిని సంరక్షించిన వారమవుతాం. నీటిని అతి జాగ్రత్తగా అవసరం మేరకే వినియోగించడం అత్యవసరం. పద్ధతి మీ పాఠశాలలో, ఇండ్లలో లీకవుతున్న నల్లాలున్నాయేమో గమనించండి. ఏదేని నల్లా లీకవుతుంటే దాని క్రింద బకెట్‌ను పెట్టి, ఆనీటిని సేకరించి ఉపయోగించండి. వరుసగా ఒక వారంరోజులు నిర్లక్ష్యంతో నీరు వృధా అవుతున్న సందర్భాలను (ఉదాహరణకు పాత్రలలో నీరు నింపుతున్నపుడు,బట్టలుతికే సమయంలో, పాత్రలు, వాహనాలు శు భ్రపరిచేటపుడు గుర్తించి, అలా ఎంత నీరు వృథా అవుతుందో నమోదు చేసుకోండి. మీఇంట్లో లేదా ఎవరింట్లోనైనా నీరు కారి పోతున్న నల్లాను (కొళాయి) ఎంచుకోండి. ఒక కొలజాడీని తీసుకొని 5 నిమిషాలలో కారిపోయిన నీటిని సేకరించండి. ఎంత నీరు కారిందో నమోదు చేయండి. మరో 5 నిమిషాలు కూడా మళ్ళీ పరిశీలించి 5 నిమిషాలలో కారుతున్ననీటి పరిమాణాన్ని నిర్ధారించుకోండి. అ ఒక 5 నిమిషాలలోనే అంతనీరు కారితే, ఒక గంటకు ఎంత నీరు వృధా అవుతుందో లెక్క కట్టండి. అలాగే ఒక రోజుకు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఆ నల్లా నుండి కారిపోయే నీటి మొత్తాన్ని లెక్కించండి. పోనీలే ఒక చుక్కే కదా అని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉన్నారో, వారి నిర్లక్ష్యం ఎంత నీటి వృథాకు కారణమవుతుందో మీ గణాంకాల ప్రకారం అంచనా వేయండి. ముగింపు: గ్లాసును ఎత్తిపట్టి తాగే అలవాటు చేసుకుందాం. నోటిని తాకించి తాగితే తాగడానికి ఒక గ్లాసు కడగడానికి ఇంకొక గ్లాసు నీరు ఖర్చవుతుంది. ఇలాంటి చిన్నచిన్న అలవాట్లే నీటి పొదపును నేర్పుతాయి. నేరుగా నల్లా (కొళాయి) కింద కాకుండా బక్కేట్టుతో నీళ్ళు పట్టి ఉంచి చెంబుతో వాడుకుందాం. (2, 3 కృత్యాలు చేసాక) నిర్లక్ష్యం కారణంగా వృధా అవుతున్న నీటిని గురించిన మీ పరిశీలనలు, గణాంకాలతో ఒక నివేదిక తయారుచేయండి. నీటి వృథాకు కారణమైన నిర్లక్ష్య ధోరణులను పేర్కొనండి.వాటి గురించి చర్చించండి. నీటి వృథాను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలును తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి. తదుపరి చర్యలు: నీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఏమిటో చర్చించండి. నినాదాలను రాసి ప్రదర్శించండి. నీటిని వృథా చేయరాదన్న అంశం గురించి ప్రార్ధనా సమావేశంలో మాట్లాడండి. మీ పాఠశాల, ఇల్లు, కాలనీ, ఊరు ఎక్కడైనా నల్లాల లీకేజీ చూసినా, నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టండి. ఆధారము: http://apscert.gov.in/