ఇది ఎవరిది? వస్తువులు: పిల్లలకు బాగా తెలిసిన పలు రకాల వస్తువులు: చెప్పులు, గడియారం, ఫోను మొదలైనవి. దశలు: రకరకాల వస్తువులను బిడ్డకు ఒకదాని తర్వాత ఒకటి చూపించండి. ప్రతి వస్తువును 'ఇది ఎవరిది?' అని బిడ్డను అడగండి. ఆ వస్తువును ఉపయోగించే యజమానిని గుర్తించేలా బిడ్డను ప్రోత్సహించండి. ఉదాహరణకు (అమ్మ ఫోను, నాన్న మాస్క్ మొదలైనవి.) బిడ్డను ఆ వస్తువుతో యజమాని ఏం చేస్తాడో అడగండి. ఉదాహరణకు నాన్న ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు మాస్క్ ధరిస్తాడు అని బిడ్డతో చెప్పండి. బిడ్డ ప్రతిస్పందనలను ప్రశంసించండి మరియు వారు చెప్పిన సమాధానాన్ని ధృవీకరించండి. కృత్యం ప్రాధాన్యత: వస్తువులను, ఉపయోగించే వ్యక్తులకు, వారి చర్యలకు మధ్య అనుబంధాన్ని ఏర్పరచడం వలన పిల్లలో అబ్జర్వేషన్ (పరిశీలనా) నైపుణ్యం పెరుగుతుంది. వస్తువులను గుర్తించడం మరియు వాటి పేర్లు చెప్పడం వలన భాషాభివృద్ధి కూడా జరుగుతుంది. పిచ్చి గీతలతో సరదా ఆట వస్తువులు: రంగు పెన్సిల్స్ లేక పెన్సిల్, కాగితం. దశలు: రంగు పెన్సిల్స్ తో బిడ్డ కాగితం మొత్తం గీసే విధంగా ప్రోత్సహించండి. మరొక రంగు పెన్సిల్ తీసుకుని వృత్తాకారంలో ఎలా గీయాలో బిడ్డకు వివరించండి. బిడ్డ తనంతట తానుగా వృత్తాలు గీయటాన్ని అనుకరించేలా ప్రోత్సహించండి. బిడ్డ కాగితం మీద వృత్తాలు గీయగానే అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: పిచ్చి గీతలు గీయడం ద్వారా బిడ్డల సూక్ష్మ కండరాల అభివృద్ధి (Fine Motor Skills) మెరుగుపడుతుంది మరియు ప్రాథమిక ఆకారాలు మరియు నమూనాలు బిడ్డకు పరిచయమవుతాయి. తాకి పేరు చెప్పే సవాల్ వస్తువులు: తలుపు, పరుపు, కుర్చీ మరియు బల్ల మొదలైనవి. దశలు: ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే మూడు లేక నాలుగు వస్తువులను పేర్కొనండి. బిడ్డచే ఆ వస్తువులను తాకించి ప్రతి వస్తువు పేరును మరలా మరలా చెప్పించండి. బిడ్డ వస్తువును తాకి వాటి పేరును సరిగా చెప్పగానే అభినందించండి. ఇప్పుడు పాత్రలను మార్చుకుని మీరు ఏ వస్తువును తాకి పేరు చెప్పాలో బిడ్డను మీకు చెప్పనివ్వండి. ఇద్దరూ కలిసి సరదాగా నేర్చుకుంటూ గడపండి. కృత్యం ప్రాధాన్యత: పదజాలం అభివృద్ధి మరియు వస్తువులను గుర్తించే నైపుణ్యం మెరుగుపడుతుంది. దుస్తులకు పేరు పెట్టడం వస్తువులు: బిడ్డ మరియు కుటుంబ సభ్యుల దుస్తులు. దశలు: బిడ్డ ధరించే దుస్తుల పేరు చెప్పడంలో బిడ్డకు సహాయం చేయండి. మీరు దుస్తుల పేరు చెప్పగానే ఆ దుస్తులను చూపించమని బిడ్డను అడగండి. వీలైతే బిడ్డను ప్రతి దుస్తుల పేరు చెప్పమని ప్రోత్సహించండి. సరియైన ప్రతిస్పందనలకు బిడ్డ అరచేతిలో మీ అరచేతిని తాకించి (High-Five) ప్రశంసించండి. మీరు ధరించిన దుస్తులు బిడ్డ గుర్తుపట్టి వాటి పేర్లు చెప్పగలుగుతుందేమో చూడండి. కృత్యం ప్రాధాన్యత: దుస్తులకు సంబంధించిన పదజాలం అభివృద్ధి జరుగుతుంది. రోజువారీ వస్తువులను గుర్తించడానికి మరియు అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ