రంగుల ఆటను సరిపోల్చటం వస్తువులు: ఎరుపు, నీలం మరియు పసుపు రంగులోని కార్డులు లేదా వస్తువులు. దశలు: ఎరుపు, నీలం మరియు పసుపు రంగులలో ఉన్న వస్తువులను లేదా కార్డులను సేకరించండి. ప్రతిరంగును బిడ్డకు చూపిస్తూ వాటి పేర్లను అడగండి. ఒక్కో రంగు వస్తువులని సరిపోల్చమని బిడ్డను అడగండి. బిడ్డ ఎరుపు రంగుతో ఎరుపు వస్తువు, నీలం రంగుతో నీలం మరియు పసుపు రంగుతో పసుపు, విజయవంతంగా సరిపోల్చినప్పుడు ఆనందాన్ని కలిసి పంచుకోండి. కృత్యం ప్రాధాన్యత: రంగులను గుర్తించడం మరియు సరిపోల్చడం ద్వారా అభిజ్ఞాకౌశలం మెరుగవుతుంది. కలసి సైకిల్ తొక్కడం వస్తువులు: ఏమీ లేవు. దశలు: ఊహాజనిత సైకిల్ హ్యాండిల్ పట్టుకుని, గంట మోగిస్తూ, ధ్వనులు చేస్తూ సైకిల్ తొక్కుతున్నట్లు మీ బిడ్డ ముందు నటించండి. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు, బిడ్డను మీతో పాటు అనుసరించమని చెప్పండి. మీ ప్రయాణం గురించి బిడ్డతో మాట్లాడి మార్కెట్ లేదా దుకాణం వంటి గమ్య స్థానాలు గురించి ప్రస్తావించండి. వేగం / నెమ్మది, కుడి / ఎడమ, పొడవు / పొట్టి వంటి పదాలు ఉపయోగిస్తూ కూరగాయలు తీసుకొస్తున్నట్లు నటించండి. ఇప్పుడు మీరిద్దరూ పాత్రలు మార్చుకుని బిడ్డను సైకిల్ తొక్కుతున్నట్లు, మీరు బిడ్డను అనుసరిస్తున్నట్లు నటించండి. ప్రయాణాన్ని గురించి వివరించడానికి బిడ్డను ప్రోత్సహించండి. ఆనందించండి. కృత్యం ప్రాధాన్యత: ఊహాత్మక ఆట మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కథ చెప్పడం మరియు డ్రైవర్ పాత్రల వంటివి అభినయం చేయడం ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. దిక్కుల గురించి అవగాహన మరియు మార్కెట్, దుకాణం వంటి ప్రదేశాలు ఉన్నట్టుగా బిడ్డ ఊహించుకోవడానికి దోహదపడుతుంది. తాతయ్యలా ప్రవర్తించండి వస్తువులు: ఏమీ లేవు. దశలు: తాతయ్య చేసే వివిధ పనుల గురించి బిడ్డతో మాట్లాడండి. తాతయ్య లాగా బూట్లు, దుస్తులు ధరించడానికి బిడ్డను అనుమతించండి. తాతయ్య ఆవుకు మేత వేస్తున్నట్లు బిడ్డను తాతయ్య పాత్ర అభినయం చేయమని చెప్పండి. తాతయ్య లేదా అమ్మమ్మ సాధారణంగా చెప్పే విషయాలు, కథలు బిడ్డకు చెప్పండి. ఊహాత్మక ఆటలో మీరిద్దరూ నిమగ్నమై సరదాగా గడపండి. కృత్యం ప్రాధాన్యత: ఊహాత్మక ఆటను మరియు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. సంరక్షకులు, బిడ్డల మధ్య అనుబంధం బలోపేతం అవుతుంది. కథ చెప్పడం మరియు తాతయ్య పాత్ర పోషించడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుంది. ప్రకృతి కథ సమయం వస్తువులు: ఏమీ లేవు. దశలు: బయట ఉన్నప్పుడు రాళ్ళు, చెట్లు, జంతువులు మొదలైన వాటిని గమనించమని బిడ్డకు చెప్పండి. ఇవ్వబడిన కథను వివరించడానికి లేదా ఇష్టమైన పాట పాడడానికి ప్రకృతిలో ఉండే రాళ్ళు, చెట్లు వంటి సహజ అంశాలను ఉపయోగించండి. ఉదా: 'దాహం వేసిన కాకి' లేదా ఇతర జంతువులతో స్నేహితుల గురించి చెప్పేటప్పుడు మన చుట్టూ పక్కల వాతావరణం ఉపయోగించి చెప్పండి. తను గుర్తుపట్టిన వస్తువులు, జంతువుల గురించిన ఆలోచనలు మీతో పంచుకునేలా బిడ్డను ప్రోత్సహించండి. సమాచార సేకరణను ప్రోత్సహిస్తూ సుపరిచితమైన అంశాల గురించి సంభాషణను ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: పర్యావరణం గురించి పరిశీలనా నైపుణ్యాలు మరియు ఉత్సుకత పిల్లల్లో పెరుగుతుంది. వినడం మరియు మాట్లాడడం వంటి నైపుణ్యాలు మెరుగవుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ