సూర్యరశ్మి పడేచోట ఫ్రిజ్‌ని ఉంచకూడదు. ఉంచితే ఫ్రిజ్ పనిచేయడానికి అవసరం అయ్యే కరెంట్ ఖర్చు అధికం అవుతుంది. వేడిని వెదజల్లే బాయిలర్స్, స్టవ్, కుంపటి లాంటి వాటి దగ్గరగా రిఫ్రిజిరేటర్ని ఉంచితే ఆ వేడి ప్రభావం రిఫ్రిజిరేటర్ మీద పడి కరెంట్ ఖర్చు పెరుగుతుంది. ఫ్రిజ్ ముందు రబ్బర్ మేట్ వేసి దానిమీద నించుంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉండదు. ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఫ్రిజ్‌లోని కంప్రెసర్ పాడయిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి తప్పనిసరిగా ఫ్రిజ్కి స్టెబిలైజర్‌ని వాడాలి. ఫ్రిజ్‌ని గోడకి కనీసం అరంగుళాల దూరంలోనయినా ఉంచాలి. లేకపోతే ఫ్రిజ్ వెనక భాగంలో కంప్రెసర్ నించి వచ్చే వేడిగాలి ఆడక చల్లబడక ఫ్రిజ్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్ సమతలంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి కింద లెవెల్ సరిగ్గా లేకపోతే ఫ్రిజ్ కొనేప్పుడు ఇచ్చే గ్లైడర్ స్క్రూలని ఉపయోగించి సమతలంగా ఉండేలా చేయాలి. లేకపోతే ఫ్రిజ్ శబ్దం చేస్తూ పనిచేస్తుంది. ఫ్రిజ్ లెవల్లో ఉందో లేదో తెలుసుకొనడానికి ఇదో చిట్కా. ఫ్రిజ్ తలుపుని 30డిగ్రీల ఏంగిల్లో తెరిచి ఉంచండి. జెర్క్ లేకుండా అది మూసుకుంటే ఫ్రిజ్ కింది భాగం సమతలంగా ఉన్నట్లు లెక్క. సాధ్యమైనంతవరకు ఫ్రిజ్ తలుపుని అరనిమిషం మించి తెరచి ఉంచకపోవడం మంచిది. అంతకు మించితే బయట వేడి లోపలికి, లోపలి చల్లదనం బయటికి వచ్చి కరెంట్ ఖర్చు పెరుగుతుంది. ఫ్రిజ్‌లో ఓ పళ్లెంలో బొగ్గులని ఉంచితే, ఫ్రిజ్‌లోని వాసనలన్నిటినీ అది గ్రహించి ఫ్రిజ్ తాజాగా ఉంటుంది. ఐస్‌క్యూబ్స్ ట్రేని డీప్ ఫ్రిజ్‌లో ఉంచబోయే ముందు అడుగున కాస్త నూనె రాసి తర్వాత నీళ్లుపోస్తే నీళ్లు గడ్డకట్టాక ఐస్ క్యూబ్స్ తేలికగా వస్తాయి. అల్యూమినియం కాగితంలో చపాతి పిండి చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే అది మెత్తగా జిగురుగా ఉంటుంది. ఐబ్రో పెన్సిల్ని రాత్రి ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం దాని చెక్కు తేలికగా చెక్కచ్చు. తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగుపట్టదు. అరటితొక్కలో కొత్తిమీరని ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే కొత్తిమీర తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లోని ఓ పళ్లెంలో పుదీనాని ఉంచితే ఫ్రిజ్‌లోని వాసలన్నిటిని అది గ్రహించి ఫ్రిజ్ తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ బయటి భాగాన్ని వెనిగర్‌లో ముంచిన బట్టతో తుడిస్తే శుభ్రంగా ఉండటమే గాక నిగనిగలాడుతుంది. ప్లాస్టిక్ పెట్టె మూతకి చిల్లులువేసి అందులో కొత్తిమీర ఉంచి ఆ పెట్టెని ఫ్రిజ్‌లో ఉంచితే కొత్తిమీర తాజాగా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనని కొన్ని వారాల పాటు దాచచ్చు. ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో కప్పు ఆకారంలో మడిచిన అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచితే అది గడ్డకడుతుంది. పై భాగం కూడా మడిస్తే చాలాకాలం పాడవదు. బ్రెడ్ పాడవకుండా ఉండాలంటే దాన్ని చుట్టిన కాగితం విప్పకుండా ఫ్రిజ్‌లోని అడుగు అరలోకానీ, బ్రెడ్ బాక్స్లోకానీ ఉంచాలి. ఫ్రిజ్‌లోని చల్లటి నీరుగల గిన్నెలో పచ్చిమిరపకాయలు ఉంచితే వాటిలో కారాన్ని ఆ నీరు లాగేస్తుంది. వాటిలో అన్నంలో ముక్కలు చేసి నంజుకోవచ్చు. క్యారెట్‌ను ఫ్రిజ్‌లో ఉంచబోయే ముందు విధిగా మొదలును కోసేయాలి. లేకపోతే మొదళ్లు తడిని పీల్చుకుని క్యారెట్‌ని పొడిగా చేస్తాయి. కొవ్వొత్తుని ఫ్రిజ్‌లో ఉంచండి. అవసరం వచ్చినప్పుడు వెలిగిస్తే మైనం తక్కువగా కారుతుంది. ఎక్కువసేపు కాలుతుంది. కాచి వడబోసి నీరు తాగేవారికి ఆ నీరు రుచి బావుండకపోతే, ఆ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక తాగితే రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లోంచి తీసిన నిమ్మకాయను గది ఉష్ణోగ్రతకి వచ్చేదాకా ఆగి కోసి పిండాలి. లేకపోతే రసం తక్కువగా వస్తుంది. ఐస్‌ముక్కలు గాజుగ్లాసుల్లోకాని, జగ్స్లోకాని ఉంచకూడదు. ఆ పాత్రలు చిట్లే ప్రమాదం ఉంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు