ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైలుకు పోతే ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబం చాలా కష్టాలు అనుభవిస్తుంది. ఖైదీలంటే సమాజంలో ఉన్న చిన్న చూపువల్ల, ఆ కుటుంబం చాలా సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. ఒక రకంగా వారు కుటుంబాన్ని వెలి వేసినట్టు చూస్తారు. సమాజం ఇలా ప్రవర్తించడం వల్ల ఆ కుటుంబం బాధపడడం, హింస అనుభవించడం ఒక ఎత్తయితే, ఆ కుటుంబంలోని పిల్లలు బతకడం కోసం తప్పుడు మార్గాలు వెతుక్కునే పరిస్థితికి నెట్టబడతారు. సమాజంలోని ఆధిపత్య భావజాలమంతా ఖైదీల పట్ల వ్యతిరేకంగా, క్రూరంగా – ఉండడం వలన, ఏ నేరం చేయని ఖైదీల కుటుంబాలు అనుభవించే కష్టాలు అన్నీ ఎన్నీ కావు. ఇలాంటి పరిస్థితి జైలులో ఉండే మహిళా ఖైదీల పిల్లలు కూడా ఎదుర్కొంటారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు జైలు వాతావరణం ఏ విధంగాను సానొకూలంగా ఉండక పోగా వాళ్ళు జైలులో ఉండే హింస, తిట్లతో కూడిన భాష మొరటుదనం మధ్య పెరిగి పెద్ద కావాల్సి ఉంటుంది. చాలా జైలు మ్యాన్యువల్స్ పిల్లలను ఐదారు సంవత్సరలు వచ్చేవరకు జైలులో ఉండనిస్తాయి. ఆ తరువాత వాళ్ళు వాళ్ళ తల్లులతో ఉండడానికి వీలులేదు.అలాంటి పిల్లలను బంధువులు కూడా ఎవరూ చేరదీయరు. ఎవరూ దత్తత కూడా తీసుకోరు. ఏ తప్పు చేయని ఈ పిల్లలు బయటికొచ్చి దిక్కులేని వాళ్ళుగా మారుతారు. జీవితాంతం ఆ మచ్చను మోస్తారు, వివక్షను అనుభవిస్తారు జైలు సందర్శకులు చేయగల కొన్ని సహాయాలు ఖైదీలకు వారి కుటుంబాలతో సంబంధాలు లేకపోయినా, తెగి పోయినా లేదా కుటుంబానికే సదరు ఖైదీ ఎక్కడున్నదీ తెలియక పోయినా వారి మధ్య సంబంధాన్ని ఏర్పరచడంలో అవసరమైన సహాయం. చదువులేని ఖైదీలకు ఉత్తరాలు రాసి పెట్టడం, చదువు వచ్చిన ఖైదీలను చదువురాని వాళ్ళకు నేర్పేలా ప్రోత్సహించడం. ఖైదీల కుటుంబాలతో సంబంధాలను నెరపడం, వాళ్ళు ఏ పరిస్థితులలో జీవిస్తున్నారో, తెలుసుకుంటూ ఉండడం. మీ హోదా, సంబంధాలను బట్టి ఎ రకంగా వీలైనా – ఏ దిక్కూలేని ఖైదీల కుటుంబా లకు సహాయపడడం, తద్వారా వాళ్ళ పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు నేరస్తులు కాకుండా నిరోధించవచ్చు. జైలు సూపరింటెండెంట్ లేదా సంబంధిత ఇతర అధికారితో చర్చించి జైలులోపల ఉన్న పిల్లలను బయట ఉండే మంచి రెసిడెన్షియల్ స్కూళ్ళ చేర్చించండం. దానివల్ల వాళ్ళు విద్యావంతులు కావడమే కాకుండా,జైలు జీవితంలో ఉండే ప్రతికూల అంశాల ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా చూడొచ్చు. ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్