অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కుందేళ్ళ పెంపకం

ప్రపంచమంతటా కుందేళ్ళను మాంసోత్పత్తికి విరివిగా ఉపయోగించు చున్నారు. ఒక ఆడకుందేలు సాలీన 40 - 80 బన్నీలను (కుందేలు పిల్లలు) ఉత్పత్తి చేయగలదు. ఈ బన్నీలు ఎదిగి, 5 - 6 మాసాల్లో సంతానోత్పత్తి చేయగలవు. ఆడ కుందేలు ప్రతి 33 రోజులకొకసారి ఈనగలదు. ప్రతి ఈతలో 6 - 10 బన్నీలను ఉత్పత్తి చేస్తుంది. కుందేళ్ళు వివిధరకాల గడ్డి, గాదలను తిని, జీర్ణం చేసుకోగలవు.

కుందేళ్ళ మాంసం రుచి మరియు ఆరోగ్యానికి పేరు గాంచినది. వీటి చర్మాలతో అందమైన టోపీలు, మనీపర్సులు, గౌనులు మరియు ఎన్నోరకాల వస్తువులను తయారు చేసుకొనవచ్చును. సీమజాతి కుందేళ్ళయిన న్యూజీలాండ్ వైట్, గ్రేజైంట్, చించిల్లా మరియు వైట్జైంట్ మాంసోత్పత్తికి అనువైనవి. ఇవి 4 – 5 కిలోల బరువుంటాయి. ఫ్లెమిష్బైంట్ కుందేళ్ళు ప్రపంచంలోని కుందేళ్ళ జాతులలో కెల్లా అత్యంత బరువు అయినవి. ఇవి 6 - 9 కిలోల బరువుంటాయి. అంగోరా జాతి కుందేళ్ళు ఉన్ని ఉత్పత్తికి పేరుగాంచినవి. ఇవి 2.5 - 3.5 కిలోల బరువుండి, సాలీన 300 - 1200 గ్రాముల ఉన్నిని ఉత్పత్తి చేయగలవు. వీటి ఉన్ని ధర కిలో ఒక్కొంటికి రూ. 600 - 800 ఉంటుంది.

వసతి సౌకర్యాలు

ప్రతి ఆడ కుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 4 చదరపు అడుగులు మరియు బన్నీలకు ఒక చదరపు అడుగు చొప్పన కేజ్ లు అవసరం. షెడ్లలో గాలి, వెలుతురు పుష్కలంగా లభ్యమయ్యేటట్లు చూసుకోవాలి, షెడ్లచుటూ నీడనిచ్చే చెట్లు పెంచటంవలన చల్లదనం ఎక్కువగా ఉంటుంది. పెడ్లలో ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30o సెల్సియస్ దాటకుండా, చలికాలంలో 20o సెల్సియస్ తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కుందేళ్ళ మేత

కుందేళ్ళు శాఖాహారులు, కుందేళ్ళ పెంపకం అతిసమర్థవంతంగా చేయాలంటే, వాటికి సంపూర్ణమైన మిశ్రమ దాణా ఇవ్వటం అవసరం. దాణాను పొడి రూపంలో గాని, గుళికల రూపంలోగాని ఇవ్వవచ్చును. దాణాలో మొక్కజొన్నలు లేక జొన్నలు, వేరుశెనగచెక్క తవుడు, లవణ మిశ్రమాలను తగిన పాళ్ళలో కలిపి వాడాలి. దాణాతో పాటు పచ్చిమేత ఇవ్వడం ముఖ్యం. ల్యూసర్స్ బర్సీమ్, నేపియర్, పారాగడ్డి, గినీగడ్డి, స్వీట్సూడాన్లనుగాని, వేరుశెనగ, చిక్కుడు, సోయాచిక్కుడు, పిల్లి పెసర, అలసంద ఆకులనుగాని పచ్చిమేతగా వాడవచ్చును. పచ్చి "హే'గా తయారు చేసుకుని దాణా మిశ్రమంలో కలుపుకుని వాడితే దాణా ఖరీదు తగ్గుతుంది.

సంతానోత్పత్తి

కుందేళ్ళు ఆరుమాసాల వయస్సు తర్వాత సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఆడకుందేళ్ళకు ఒక క్రమబద్దమైన సంయోగ సమయం అంటూ ఏమి లేదు. ఆడ కుందేలును, మగ కుందేలు కేజ్ లో ఉంచి దాటించాలి. క్రాసింగ్ అయిన 13 రోజుల తర్వాత చూడి నిర్ధారణ చేయవచ్చును. చూడితో వున్న కుందేళ్ళకు, చూడి 25వ రోజున నెస్ట్బాక్సు అమర్చాలి. ఆడకుందేలు 30 - 33 రోజుల చూడికాలం తర్వాత నెస్ట్ బాక్స్ లో ఈనుతుంది. ఈనిన నెలరోజుల తర్వాత, బన్నీలను తల్లి నుండి వేరుచేసి, ఆడకుందేళ్ళను మళ్లీ జత కట్టించవచ్చును. ప్రతి ఆడ కుందేలును 3 సంవత్సరాల వయస్సు వరకు సంతానోత్పత్తి కొరకు వాడవచ్చును. బన్నీలను 12-16 వారాల వయస్సులో మాంసం కొరకు అమ్మివేయవలెను.

కుందేళ్ళ పెంపకం ద్వారా అధిక లాభాలను పొందాలంటే సంకరజాతి కుందేళ్ళను ఉత్పత్తిచేయాలి. సంకరజాతి కుందేళ్ల త్వరగా ఎదుగుతాయి. మరియు వాటి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.

ఆర్థిక ఫలితాలు

మాంసోత్పత్తికి, ఒక వంద ఆడకుందేళ్ళతో ఫారం పెట్టవలెనన్న సుమారు ఒక లక్షా అరవైవేల రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. ఫారం స్థాపించిన మొదటి సంవత్సరంలో మాంసం అమ్మకం ద్వారా సుమారు 16 వేలు, రెండవ సంవత్సరములో 21 వేలు, మూడవ సంవత్సరములో 24 వేల రూపాయల ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి.

కుందేళ్ళ పెంపకంపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆనిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైద్రాబాద్ - 500 030. ఫోన్ నెం. 040–24012869

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate