పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

న్యాయ విద్య

సామాజిక హోదాను అందిస్తుంది'లా'!

సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది. దీనికితోడు నేరాల రూపురేఖలు మారుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో వైట్ కాలర్ నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించాలంటే సమర్థులైన, సాంకేతిక నైపుణ్యం ఉన్న న్యాయ నిపుణులు కావాల్సి వస్తున్నారు. సామాజిక భద్రతను, న్యాయవాదులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనే విద్యా సంస్థలు న్యాయ విద్యలో అనేక డిగ్రీ, పీజీ, డిప్లొమా స్థాయి కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి వివరాలు...

సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్‌బీ అయిదు సంవత్సరాల 'లా' కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే. న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి.
* అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు.
న్యాయ విద్యలో లభిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు:
1) బీఏ ఎల్ఎల్‌బీ జనరల్,
2) బీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్,
3) బీకాం ఎల్ఎల్‌బీ జనరల్,
4) బీకాం ఎల్ఎల్‌బీ ఆనర్స్,
5) బీబీఏ ఎల్ఎల్‌బీ జనరల్,
6) బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్,
7) బీఎస్సీ ఎల్ఎల్‌బీ జనరల్,
8) బీఎస్సీ ఎల్ఎల్‌బీ ఆనర్స్.
ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రాములు. కాల వ్యవధి అయిదేళ్లు. ఈ కోర్సుల్లో చేరడంవల్ల ఏడాది ఆదా కావడమే కాకుండా ఒకేసమయంలో రెండు డిగ్రీలు (ఉదా: బీబీఏ + ఎల్ఎల్‌బీ) పొందే వీలుంటోంది.
ప్రవేశ విధానం
న్యాయ విద్యలోకి ప్రవేశించేందుకు జాతీయ స్థాయిలో 'క్లాట్', ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే... 3 లేదా 5 ఏళ్ల లా డిగ్రీ చేయడానికి లాసెట్ రాయాల్సి ఉంటుంది.
లాసెట్
'లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్)' పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల లా కళాశాలల్లో చేరవచ్చు. అభ్యర్థులకు లాసెట్‌లో కనీసం 35 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
లాసెట్ ఆధారంగా చేరదగిన కోర్సులు:
1) ఎల్ఎల్‌బీ / బీఎల్ (కాలవ్యవధి 5 సంవత్సరాలు). ఈ కోర్సుకు ఇంటర్‌లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి.
2) ఎల్ఎల్‌బీ / బీఎల్ (3 ఏళ్ల కోర్సు).(అర్హత: డిగ్రీలో సగటున 45 శాతం మార్కులు అవసరం.)
వెబ్‌సైట్: www.aplawcet.org
దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ
రాష్ట్రంలో న్యాయ విద్యను అందిస్తున్న వర్సిటీల్లో విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా పేరును ఇటీవల మార్చారు) ప్రత్యేకమైంది. దీనికి కడప, నిజామాబాద్ ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. 'ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్‌బీ (ఆనర్స్)' పేరుతో ఈ వర్సిటీ కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు. దీన్లో విద్యార్థులను చేర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)లో వచ్చిన ర్యాంకును ఆధారంగా తీసుకుంటారు.
వెబ్‌సైట్: http://dsnlu.ac.in
ఉస్మానియా లా కళాశాల
దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన న్యాయ కళాశాలల్లో హైదరాబాద్‌లోని 'ఉస్మానియా లా కళాశాల' అత్యంత ప్రముఖమైందిగా గుర్తింపు పొందింది. ఉస్మానియాలో లా కళాశాల 1918లో ఉర్దూ మీడియంలో ప్రారంభమైంది. అప్పటినుంచి నేటి వరకు తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఉస్మానియా వర్సిటీ లా విభాగం మూడు, అయిదు సంవత్సరాల ''లా" కోర్సులను నిర్వహిస్తోంది. వర్సిటీ ''లా" విభాగం పరిధిలోని పది అనుబంధ న్యాయ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
డిగ్రీ ప్రోగ్రాములు:
1) ఎల్ఎల్‌బీ (3 సంవత్సరాలు).
2) ఎల్ఎల్‌బీ (5 సంవత్సరాలు).
* లా సెట్ ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు.
పీజీ ప్రోగ్రాములు:
1)ఎల్ఎల్ఎం(కాన్‌స్టిట్యూషనల్ లా).
2) ఎల్ఎల్ఎం (కార్పొరేట్ లా).
3) ఎల్ఎల్ఎం (లేబర్ లా).
4) ఎల్ఎల్ఎం (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్).
5) ఎల్ఎల్ఎం (ఐపీఆర్).
6) ఎల్ఎల్ఎం (ఇంటర్నేషనల్ ట్రేడ్స్, ఎకనమిక్ లాస్).
* పీజీ లాసెట్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు.
* డిప్లొమా కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లాస్ (సాయంకాలపు కోర్సు).
ప్రవేశ పరీక్ష ద్వారా చేర్చుకుంటారు.
బీఏతో పాటు ఎల్ఎల్‌బీ డిగ్రీ: ఉస్మానియా లా కాలేజీలో చేరేందుకు లాసెట్‌లో మంచి ర్యాంక్ రావాలి. వీరికి 5 సంవత్సరాల్లో బీఏతోపాటు ఎల్ఎల్‌బీ డిగ్రీ ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ రాకముందు ఇంటర్ పూర్తయిన తర్వాత బీఏ మూడు సంవత్సరాలు చదువు, ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాలు చదవాల్సి వచ్చేది. అంటే బీఏ, ఎల్ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేయడానికి ఆరు సంవత్సరాల వ్యవధి పట్టేది. ఈ సమస్యను అధిగమించేందుకు, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల లా కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయిదేళ్ల 'లా' కోర్సు చదివే విద్యార్థులకు చివరి (5వ) సంవత్సరంలో బీఏ ఎల్ఎల్‌బీ డిగ్రీ ఇస్తారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం జాతీయ సమైక్యత కోటా: ఉస్మానియా లా కాలేజీ పరిధిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు జాతీయ సమైక్యత కోటా కింద 5 శాతం సీట్లను కేటాయిస్తారు. ఇరాన్, ఇరాక్ టాంజానియా, ఉగాండా, అఫ్గానిస్థాన్, భూటాన్, బర్మా, చైనా తదితర దేశాల నుంచి కూడా విద్యార్థులు ఉస్మానియాలో లా కోర్సులో చేరేందుకు వస్తున్నారంటే ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకతను గుర్తించవచ్చు.
ఆఖరి సంవత్సరం: లా కోర్సు అధ్యయనంలో భాగంగా చివరి సంవత్సరంలో ''లా" విద్యార్ధులు ప్రత్యేకంగా ఒక గ్రామంలో న్యాయ సదస్సును న్యాయమూర్తుల సమక్షంలో నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి విద్యార్థులకు తగిన సలహాలను లెక్చరర్లు ఇస్తారు. అలాగే విద్యార్థులు జైళ్లు, న్యాయస్థానాలు సందర్శించేలా చూస్తారు. మ్యూట్ కోర్టు కాంపిటీషన్ నిర్వహించి సబ్జెక్టులపై అవగాహన పెంచుతారు.
జాతీయ స్థాయిలో...
న్యాయ విద్యను జాతీయ స్థాయి వర్సిటీల్లో చదవాలంటే ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి...
* క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్).
* నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్.
* కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - క్లాట్
న్యాయ విద్యను మరింత విస్తృత పరచడంతోపాటు సమాజానికి నిపుణులైన, సమర్ధులైన న్యాయవాదులను అందించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన నేషనల్ లా యూనివర్సిటీలు విద్యార్థులను చేర్చుకోవడానికి క్లాట్‌కు శ్రీకారం చుట్టాయి.
ఈ సంస్థలు నిర్వహించే లా కోర్సుల్లో చేరేందుకు 2007 వరకూ జాతీయ స్థాయిలో విడివిడిగా ప్రవేశ పరీక్ష రాయాల్సి వచ్చేది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థికంగా, విద్యా పరంగా అనేక సమస్యలు తలెత్తేవి. ఈ అంశాలను గమనించిన 7 నేషనల్ లా యూనివర్సిటీలు సమైక్యంగా ఒకే ఒక కామన్ ఎంట్రెన్స్ ఉండాలనే నిర్ణయానికి వచ్చాయి. దీని ఫలితమే 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్- క్లాట్' అందుబాటులోకి వచ్చింది. 2008లో మొదటిసారిగా క్లాట్‌ను నిర్వహించాయి. దీనికి మంచి ఆదరణ లభించడంతో 2009లో మరో 4 నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్‌లో చేరాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 14కు పెరిగింది.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో కనీసం 50 శాతం మార్కులు ఉన్నవారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. వయసు 20 సంవత్సరాలు దాటకూడదు.
చేరదగిన కోర్సులు
1) బీఏ/ బీఎస్సీ/ బీబీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ బీకాం, ఎల్ఎల్‌బీ (ఆనర్స్): కోర్సుల కాల వ్యవధి 5 సంవత్సరాలు (ఇంటిగ్రేటెడ్ కోర్సులు).
2) పీజీ ప్రోగ్రామ్ ఎల్ఎల్ఎం: ప్రవేశ ప్రకటన మార్చిలో వస్తుంది. దరఖాస్తులను ఏప్రిల్ మొదటి వారంలోగా అందజేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.clat.ac.in
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ: ఈ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‌బీ (ఆనర్స్) కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. వర్సిటీ నిర్వహించే ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ) ర్యాంక్ ఆధారంగా చేరవచ్చు. పరీక్ష రాసేందుకు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 21 సంవత్సరాలు దాటకూడదు.
వెబ్‌సైట్: http://nludelhi.ac.in
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ: మనదేశంలో 1986లో బెంగళూరులో ఏర్పడిన మొదటి లా విశ్వవిద్యాలయం ఇది. దీంట్లో 5 ఏళ్ల బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) ఉంది. క్లాట్ ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు.
వెబ్‌సైట్: www.nls.ac.in
కర్ణాటక స్టేట్‌లా యూనివర్సిటీ: కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో 1) బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్), 2) బీబీ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటుంది. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి.
వెబ్‌సైట్: www.kslu.ac.in
నల్సార్ లా యూనివర్సిటీ : నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ - నల్సార్ పూర్తి రూపం. ఈ వర్సిటీని 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) (5 సంవత్సరాలు) కోర్సును అందిస్తోంది. క్లాట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in
భవిష్యత్తు
లా కోర్సులు (3, 5 సంవత్సరాలు) పూర్తి చేసినవారికి నేడు విపరీతమైన డిమాండ్ ఉంది. సామాజిక వాతావరణం న్యాయ శాస్త్ర అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో న్యాయ శాస్త్రానికి చిక్కని నేరాలు, అక్రమాస్తుల కేసులు, దొంగతనం కేసులు రోజురోజుకు పెరిగిపోవడం వల్ల, సత్వర పరిష్కారాల కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలను, న్యాయమూర్తుల సంఖ్యను పెంచక తప్పడంలేదు. అలాగే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు కూడా న్యాయపరమైన సలహా కోసం, న్యాయశాస్త్ర సహాయకులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
* లా డిగ్రీ చేసినవారు రాష్ట్ర హైకోర్టులో ఖాళీలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్లుగా చేరవచ్చు. అంతేకాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీ), జనరల్‌పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులవడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి.
* న్యాయ వ్యవస్థను గ్రామస్థాయి వరకూ విస్తృత పరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వ్యవస్థలు ఆచరణలోకి వస్తే లా అభ్యర్థుల అవసరం చాలా ఉంటుంది.
* బ్యాంకులు, సెబి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ఎల్ఐసీ హౌసింగ్‌కార్పొరేషన్, రైల్వే, పోలీస్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లా అభ్యర్థులకు లీగల్ ఆఫీసర్లుగా మంచి అవకాశాలున్నాయి. అలాగే కార్పొరేట్ రంగంలో అవుట్ సోర్సింగ్‌లో లీగల్ ప్రాసెస్ ఆఫీసర్లు (ఎల్‌పీవో)గా చేరవచ్చు.
సమాజ సేవే ముఖ్యం
ఎల్ఎల్‌బీ లేదా బీఏ ఎల్ఎల్‌బీ చదివిన, చదవాలని కోరుకుంటున్న వారికి భవిష్యత్తు గురించి ఎలాంటి బెంగ అవసరం లేదు. వీరు ఉద్యోగాలపైనే ఆధార పడాల్సిన పని అంతకంటే లేదు. ఇంజినీరింగ్, వైద్య శాస్త్రాల కోవలోనే న్యాయ విద్యను ఒక ప్రొఫెషనల్ కోర్సుగా గుర్తించి, సునిశితంగా అధ్యయనం చేయాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత సంబంధిత బార్‌కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. తహశీల్దార్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రాక్టీసు చేయడానికి వీరికి అపారమైన అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జీవనోపాధి మాత్రమే కాకుండా మంచి పేరును, ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. అదే సమయంలో లా ముఖ్య ఉద్దేశమైన సమాజ హితం మరిచిపోకూడదు. సమాజానికి, దేశానికి సేవచేసే అవకాశం ఈ వృత్తిలో ఎక్కువ. కాబట్టి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలంటే బాగా కష్టపడి, శాస్త్రీయ దృక్పథంతో చదివి ఈ న్యాయ విద్యను ప్రొఫెషనల్ విద్యగా అధ్యయనం చేయడం అవసరం.

3.08474576271
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు