অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈ క్రిములు ఎక్కట్లుండి వచ్చాయి?

ఈ క్రిములు ఎక్కట్లుండి వచ్చాయి?

మన చుట్టూ వుండే రకరకాల జీవజాతులు అసలు ఎక్కణ్ణుంచి వచ్చాయి అన్న ప్రశ్న ఎప్పణ్ణుండో ఉన్నదే. పెద్ద మొక్కల, జంతువుల విషయంలో అయితే సమస్య లేదు. పెద్ద జంతువులు వాటి సంతానాన్ని కంటాయి, లేదా గుడ్లు పెడతాయి. ఆ గుడ్లలోనుండి పిల్లలు బయటికి వస్తాయి. ఇక మొక్కలయితే విత్తనాల్లోంచి వస్తాయి. ప్రతీ మొక్క జంతువు, అదే రకం మరో మొక్క నుండి లేదా జంతువు నుండి వచ్చిందే, మామిడి చెట్లు మామిడి చెట్ల నుండి, కుక్కలు కుక్కల నుండి, మనుషులు మనుషుల నుండి ఉద్భవిస్తరు.

కాని పురుగుల, క్రిముల సంగతి వేరు. అవి ఎక్కణ్ణుండో ఊడిపడినట్టుగా అనిపిస్తుంది. జీవరహిత పదార్ధం నుండి ఈ సూక్ష్మక్రిములు పుడతాయని కొందరు అనేవారు. ఏ సహాయమూ లేకుండా మట్టి లోంచి జీవరాశులు పుట్టగలవని నమ్మేవారు. దీనినే "వాటంతట అవే" పుట్టే (Spontaneous Generation) సిద్ధాంతం అంటారు.

దీనికి ఉదాహరణగా కుళ్ళుతున్న మాంసంలో జరిగే క్రియలని పేర్కొనేవారు. ఏ బాహ్య కారణమూ లేకుండా తటాలున ఇందులో పురుగులు (maggots) పుట్టుకొచ్చేవి. జీవం లేని మాంసం నుండి వాటంతట అవే ఈ పురుగులు పుట్టాయని అనేవారు.

కాని 1668లో ఫ్రాన్సిస్కో రెడీ అనే ఇటాలియన్ జీవశాస్త్రవేత్త ఓ చిన్న ప్రయోగం చేయదలచాడు. కుళ్లుతున్న మాంసం చుట్టు ఎప్పుడూ ఈగలు ముసిరి వుంటాయి. బహుశ ఈ పురుగుల ఉత్పత్తికి ఈగలకి ఏదైనా సంబంధం ఉందేమో?

రెడీ తన ప్రయోగంలో మాంసపు ముక్కలని చిన్న చిన్న కుండలలో కుళ్లనిచ్చాడు. కొన్ని కుండల మూతలు తెరిచే ఉంచాడు. మరి కొన్నిటి మీద గాజు గుడ్డ కప్పాడు. గాజు గుడ్డలేని కుండల్లోకి మాత్రమే ఈగలు ప్రవేశించగలవు. గాజుగుడ్డ ఉన్న కుండల్లోకి చొరబడలేకపోయాయి.

అన్ని కుండల్లోను మాంసపు ముక్కలు ఒకే విధంగా కుళ్ళాయి. కాని ఈగలు వాలిన మాంసపు ముక్కల మీదే పురుగులు వచ్చాయి. గాజు గుడ్డ ఉన్న కుండల్లోని మాంసం ఎంత కుళ్ళినా పురుగులు మాత్రం రాలేదు.

కుళ్ళుతున్న మాంసం మీద ఈగలు గుడ్లు పెట్టాయని, ఆ చిన్న చిన్న గుడ్లలోంచి పురుగులు వస్తున్నాయని రెడీ తీర్మానించాడు. గొంగళి పురుగులు సీతాకోకచిలుకల్లా మారినట్లు అదే విధంగా ఆ మాంసం తిని, ఈ పురుగులు పెరిగి ఈగల్లా మారి ఎగిరిపోతాయి.

చివరికి సూక్ష్మదర్శినులు ఉపయోగించి మాంసం మీద ఈగలు పెట్టిన గుడ్లని చూడడానికి వీలయ్యింది. అంటే ప్రతీ జీవమూ, ఆది పురుగు కావచ్చు. క్రిమి కావచ్చు, మరో పురుగో, క్రీమో పెట్టిన గుడ్ల నుండే పుట్టి ఉండాలి అని అనుకోవచ్చా? ప్రాణులు ఎప్పుడూ మరో ప్రాణి నుండే పుడతాయి గాని ప్రాణరహిత వస్తువుల నుండి పుట్టవు అనుకోవచ్చా? అంటే వాటంతట అవే పుడతాయన్న సిద్ధాంతం తప్పన్న మాటేగా?

జీవ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతానికి ఇంచుమించు తిలోదకాలు వదిలేసి వుండేవారే. కాని రెడీ ప్రయోగం జరిగిన కొంతకాలనికే లీవెవ్హో క్ సూక్ష్మక్రిములని కనుక్కున్నాడు. పురుగు కన్నా ఎంతో సూక్ష్మమైన జీవరాశులు ఉన్నాయి. మరి వీటి సంగతేమిటి? బహుశ ఇంత చిన్న ప్రాణులు నిర్జీవ పదార్థం నుండి పుట్ట గలవేమో? ఈ విషయం మీద జీవ శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు తర్జనభర్జనలు చేశారు.

1748లో ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్త జాన్ టర్బర్వెల్ నీధామ్ ఓ ప్రయోగం చేశాడు. బోలెడన్ని సూక్ష్మక్రిములు ఉన్న మాంస రసం తీసుకున్నాడు. అందులోని సూక్ష్మక్రిములు చచ్చిపోయేవరకూ ఆ రసాన్ని బాగా మరిగించాడు. అప్పుడు ఆ రసాన్ని ఓ పెద్ద పాత్రలోకి తీసుకుని అందులోకి గాలి పోకుండా గట్టిగా బిగించాడు.

పాత్ర గట్టిగా బంధించి ఉంది కనుక బయటి నుండి లోపలికి సూక్ష్మక్రిములు వచ్చే ప్రసక్తి లేదు. మూత తీశాక ఏవైనా సూక్ష్మక్రిములు సజీవంగా కనిపిస్తే అవి లోపలి నుండే వచ్చి ఉండాలి. నీధామ్ ఆ పాత్రని కొన్ని రోజులు అలా వొదిలేశాడు. తరువాత మూత తీసి చూస్తే, అది సూక్ష్మక్రిములతో కిటకిటలాడుతోంది.

వాటంతట అవే పుడతాయన్న సిద్ధాంతానికి రుజువుగా ఈ ఫలితాన్ని తీసు కున్నాడు నీధామ్. కనీసం సూక్ష్మక్రిముల విషయంలో ఈ సిద్ధాంతం నిజం అని నమ్మాడు.

కాని నిజంగానే ఈ ప్రయోగం వల్ల విషయం స్పష్టంగా తేలిందా? ఇటాలియన్ జీవశాస్త్రవేత్త లజ్జారో స్పల్లంజానీకి ఎందుకో నమ్మకం కుదరలేదు. ప్రయోగం మొదట్లో నీధామ్ నిజంగానే రసాన్ని బాగా మరిగించాడా? కొద్దిపాటి సూక్ష్మక్రిములు బతికి బట్టకట్టి ఉండొచ్చు. వాటిని నీధామ్ గుర్తించకపోయి ఉండొచ్చు. అలా మిగిలిన కొన్ని క్రిములు విభజన చెంది వర్ధిల్లి ఉండవచ్చు.

సూక్ష్మక్రిములని మరిగించి చంపడానికి ఎంత సేపు పడుతుందో 1768లో అధ్యయనం చేయసాగాడు స్పల్లంజానీ కొన్ని క్రీములని చంపడం నిజంగానే కష్టం అని గమనించాడు. రసాన్ని కనీసం అరగంట సేపయినా మరిగించకుండా సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయని అనుకోవడం పొరబాటు అని తేల్చాడు.

ఇప్పుడు నీధామ్ చేసిన ప్రయోగాన్ని ఇతడు మళ్ళీ చేశాడు. ఈసారి రసాన్ని అరగంటకు పైగా మరగబెట్టి అప్పుడు మూత మూశాడు. అలా చేసినప్పుడు రసం ఎక్కువ కాలం మనగలుగుతుందని కనుక్కున్నాడు. అలాంటి రసంలో మళ్లీ క్రిములు పుట్టుకు రాలేదు.

స్పల్లోంజీ ప్రయోగం ప్రకారం వాటంతట అవి పుట్టడం ఉండదని తేలింది. జరగనే లేదన్నట్టు అవుతోంది. చిన్న చిన్న క్రిములు కూడా ఇతర సూక్ష్మక్రిముల నుండే పుడుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోలేదు. రసాన్ని మరిగించడం సహజం కాదని, అది ప్రకృతి విరుద్ధం అని వాదించారు. బహుశ గాలిలో వుండే ఏదో రసాయనం కారణంగా వాటంతట అవి పుడుతున్నాయేమో. బహుశ మరిగించడం వలన ఆ రసాయనం నాశనమవుతోందేమో.  నీధామ్ మరిగించిన పద్ధతిలో ఆ రసాయనం యొక్క శేషం కొంచెం మిగిలి ఉందేమో. అందుకే పురుగులు వాటంతట అవి పుట్టాయేమో, స్పల్లోంజీ మరిగించిన పద్ధతిలో ఆ రసాయనం పూర్తిగా నాశనమవుతోందేమో.

ఎందుకంటే మాంసపు రసాన్ని మరిగించి మళ్లీ చల్లారనిస్తే కాసేపట్లో సూక్ష్మక్రిములు ఏర్పడతాయి అన్న విషయం జీవశాస్త్రవేత్తలు అందరూ నమ్మేవారు. మరి సూక్ష్మక్రిములు రసంలోంచి కాక మరెక్కడి నుండి వస్తాయి? రసంలోంచి, బయట చల్లగాలిలో ఉండే ఏదో రసాయనం సహాయంతో సూక్ష్మక్రిములు పడుతున్నాయి అని వాళ్లంతా భావించారు.

ఈ విషయం గురించి ఓ వందేళ్ళు వాదోపవాదాలు సాగాయి. చివరికి 1858లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ ఈ సమస్య మీద పనిచెయ్యడం ఆరంభించాడు.

ముందుగా స్వచ్చమైన చల్లగాలిలో కూడా బాక్టీరియా ఉంటాయో లేదో కనుక్కోవాలని చూశాడు. కొంచెం దూదిని తీసుకుని దాన్ని నోట్లో క్రిములన్నీ పూర్తిగా నాశనమయ్యేలా బాగా మరిగించాడు. అయ్యాక ఆ దూదిలో నుండీ చల్లగాలిని పంపించి, ఆ దూదిని తిరిగి ఇందాక మరిగించిన నీట్లో ముంచాడు. వెంటనే ఆ నీట్లో సూక్ష్మ క్రిములు పుట్టుకు రాసాగాయి. మునుపు లేని సూక్ష్మక్రిములు ఇప్పుడు ఎక్కణ్ణుంచీ వచ్చాయి. మరి గాలిలోని సూక్ష్మక్రిములు దూదిలోకి ప్రవేశించినట్టే కదా?

పాశ్చర్ చెప్పింది నిజమని నమ్మకం ఏంటి? సూక్ష్మక్రిములు నీటిలోను, దూదిలోను కూడా వాటంతట అవి పుట్టి ఉండవచ్చునేమో. దీన్ని పరీక్షించడానికి పాశ్చర్ సూక్ష్మక్రిములు లేని ఓ దూదిపింజలోంచి గాలిని పోనిచ్చాడు. అలా వడపోసిన గాలిని అటువంటిదే మరో దూది లోంచి పోనిచ్చాడు. ఆ దూదిని నీట్లో వేశాడు.

ఈసారి నీటిలో సూక్ష్మక్రిములు దొరకలేదు. మొదటిసారి దూదిలోంచి గాలిపోనిచ్చి వడపోసినప్పుడు సూక్ష్మక్రిములు పోయాయి. రెండవ దూదిపింజలోను, ప్రక్షాళన చేయబడ్డ నీటిలోను మళ్ళీ సూక్ష్మక్రిములు పుట్టలేదు.

సూక్ష్మక్రిములు లేని గాలికి రసానికి మధ్య సంపర్కం కలిగించడం ఎలా అని ఆలోచించసాగాడు పాశ్చర్. అలా చేసినప్పుడు రసంలో సూక్ష్మక్రిములు ఉద్భవించక పోయినట్టయితే గాలిలో సూక్ష్మక్రిములని పోషించే రసాయనమేమీ లేదని తేలుతుంది. దీన్ని బట్టి సూక్ష్మక్రిములు ఎప్పుడూ ఇతర సూక్ష్మక్రిముల నుండే ఉత్పన్నమవుతాయని, వాటంతట అవి పుట్టడం అన్న సిద్ధాంతం తప్పని తెలుస్తుంది.

ఈ విషయం తేల్చడానికి పాశ్చర్ ఓ చక్కని ప్రయోగం చేశాడు. ఓ జాడీలో సగం నిండుగా మాంసరసం తీసుకున్నాడు. జాడీపై నుండి ఓ సన్నని పొడవైన నాళం బయటికి వస్తోంది. ఈ నాళం మొదట గాల్లో పైకి వెళ్లి, మళ్లీ కిందకి వంగి మళ్లీ పైకి వంపు తిరిగి వుంది.

పాశ్చర్ రసాన్ని మరిగించసాగాడు. రసం వేడెక్కి మరుక్కి వస్తుండగా పైనున్న సన్నని నాళంలోంచి ఆవిర్లు పైకొస్తున్నాయి. ఆ వేడికి రసంలోను, పైన నాళంలోను కూడా సూక్ష్మక్రిములు అన్నీ చచ్చిపోతాయి.

ఇప్పుడు పాశ్చర్ రసాన్ని చల్లారనిచ్చాడు. నాళం చివర మూత బిగించలేదు. బయట ఉన్న గాలికి, నాళంలో ఉన్న రసానికి మధ్య సంపర్కం కలగనిచ్చాడు. బయటి నుంచీ వచ్చే చల్లనిగాలి నాళంలోంచి ప్రవహిస్తూ రసాన్ని తాకగలదు. గాలి సోకగలదు గాని గాలిలోని ధూళి లోపలికి ప్రవేశించలేదు. నాళంలో కిందకి వంపు తిరిగి ఉన్న భాగంలో ధూళి అంతా పేరుకుంది. ఆ వంపు నుండిధూళి మళ్ళీ పైకెక్కి జాడీలోకి ప్రవేశించలేకపోయింది.

తన ప్రత్యేకమైన జాడీలతో లూయీ పాశ్చర్ .

పాశ్చర్ ఇప్పుడు ఆ రసాన్ని అలాగే కొంత కాలం నిలవ ఉండనిచ్చాడు. అలా కొన్ని నెలలపాటు రసాన్ని నిలవ ఉంచినపటికీ రసంలో సూక్ష్మక్రిములు పుట్టలేదు. చల్లని, బయటి గాలి, అందులోని రసాయనాలు రసాన్ని చేరుకోగలుగుతున్నా, ధూళి కణాలు చేరుకునేంత వరకు, రసంలో సూక్ష్మక్రిములు ఉత్పన్నం కాలేదు.

ఇప్పుడు పాశ్చర్ జాడీ యొక్క నాళాన్ని విరిచేశాడు. ఇప్పుడు ధూళి కూడా రసాన్ని చేరుకోగలదు. రాత్రికి రాత్రి రసం నిండా సూక్ష్మక్రిములు పుట్టుకొచ్చాయి.

1864లో పాశ్చర్ ఈ ప్రయోగాలని, వాటి ఫలితాలని వెల్లడి చేశాడు. ఇతరులు కూడా అవే ప్రయోగాలని చేసి అవే ఫలితాలు పొందారు.

అక్కడితో సమస్య తేలిపోయింది. జీవి తనంతట తాను పుట్టడం అనేది లేదు. సూక్ష్మక్రిములు ఎప్పుడూ ఇతర సూక్ష్మక్రిముల నుండి రావలసిందే. జీవశాస్త్రానికి మూలస్తంభం లాంటి ఫలితం ఇది. దీంతో పాశ్చరికి ఒక విషయం అర్ధమయ్యింది. అంతకుముందు కనిపించని ఓ సూక్ష్మక్రిమి కనిపిస్తే అది నిశ్చయంగా మరెక్కడి నుండో వచ్చి ఉండాలి. సూక్ష్మక్రిమి కాని ఏదో జీవరహిత పదార్ఖంలోంచి అది ఉద్భవించే ఆస్కారం లేదు.

ఈ పరిజ్ఞానాన్ని తాను చేస్తున్న ఇతర పరిశోధనలతో రంగరించి వైజ్ఞానిక చరిత్రలోనే ఓ అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చేశాడు పాశ్చర్. ఆ ఆవిష్కరణ వ్యాధులకి సంబంధించినది.

ఆధారము: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate