విద్యార్దుల్లో సృజనాత్మకతను పెంపొందించడం సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం కోసం కెమిస్ట్రీ మేజక్ షోను నిర్వహిస్తున్నా మని హెడ్మాస్టర్ వెంకట్రావ్ గారు విద్యార్థులకు చెప్పారు. మేజిక్ షా ప్రారంభమయింది. మెజీషియన్ సుబ్బు వేదిక మీదికి వచ్చాడు. వేదిక మీద ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఒక వెడల్పు మూతిగల గాజు సీసా ఉంది. సీసాలో గచ్చకాయ రంగు చిన్న చిన్న రాళ్ళు కన్పిస్తున్నాయి. మెజీషియన్ ఆ సీసాలో ఏదో రంగులేని ద్రవం పోసి, సీసా మూతికి ఒంటి రంధ్రపు రబ్బరు బిరడా బిగించి, ఆ రంధ్రం గుండా ఒక గాజు గొట్టాన్ని ఆ రంధ్రం గుండా పోనిచ్చాడు. గాజుగొట్టం సీసా మూతికి రెండంగుళాలు పైకి కన్పిస్తోంది. గాజుసీసాలో ఏదో పొంగు కన్పిస్తోంది. మెజీషియన్ విద్యార్థులందరికేసీ పలకరింపుగా చూసి, ఒక అగ్గిపుల్ల వెలిగించి గాజుగొట్టం పైభాగంలో ఉంచాడు. వెంటనే ఒక దీపం వెలిగించినట్లుగా అక్కడ జ్వాల రావడం మొదలయింది. ఇప్పుడు అందరూ చూడండి. ఈ జ్వాల మనకు సంగీతం విన్పిస్తుంది. పట్టుకుని కొంత పైకి కిందికి కదిపాడు. అంతే శ్రావ్యమైన సంగీతం మొదలయింది. ఆ పొడవైన గాజు గొట్టాన్ని ఒక స్టాండుకు బిగించాడు మెజీషియన్. ఆ జ్వాల వస్తున్నంత సేపూ ఆ సంగీతం శ్రావ్యంగా వస్తూనే ఉంది. విద్యార్థులంతా చాలా హుషారుగా చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్ ను మర్నాడు సైన్స్ టీచర్ లక్ష్మిని విద్యార్థులకు చేసి చూపించింది.
ఇందుకు కావల్సినవి: వెడల్పు మూతి గాజుసీసా, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడా, సుమారు నాలుగు అంగుళాల పొడవున్న సన్నని గాజుగొట్టం, జింక్ ముక్కలు, సజల హైడ్రోక్లోరికామ్లం, సుమారు అర అంగుళం వ్యాసం, రెండు అడుగుల పొడవున్న పెద్ద గాజుగొట్టం, రింగుస్టాండు.
వెడల్పు మూతిగల గాజుసీసాలో జింక్ ముక్కలు తీసుకుని సజల హైడ్రోక్లోరికామ్లం కలపాలి. రసాయనచర్య జరిగి హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాకు సన్నని గాజుగొట్టం అమర్చి, సీసా మూతికి రబ్బరు బిరడాను బిగించాలి. గాజుగొట్టం సీసాకు రెండు అంగుళాలు పైకి ఉండేలా చూడాలి. సీసాలోని గాలి అంతా హైడ్రోజన్‌తో పైకి నెట్టివేయబడిన తర్వాత, గాజుగొట్టం ద్వారా పైకి వస్తున్న హైడ్రోజన్ ను మండించాలి. హైడ్రోజన్ మండుతూ జ్వాల ఏర్పడుతుంది. ఇప్పుడు జ్వాల గొట్టంలో పల ఉంటుంది. గాజు గొట్టాన్ని జ్వాలకు పైన, క్రింది కడుపుతూ ధ్వని గరిష్టంగా వచ్చేలా సర్దుబాటు చేసి, గొట్టాన్ని రింగుస్టాండుకు అమర్చాలి. జ్వాల వెలుగుతున్నంతసేపు సంగీత ధ్వని వస్తూనే ఉంటుంది.
ఇందుకు కారణం ఏమిటి? గాజు గొట్టం క్రింది చివరన హైడ్రోజన్ వాయువును మండించడం వలన, గాజుగొట్టంలో కంపించే గాలి స్తంభం ఏర్పడి, శ్రావ్యమైన ధ్వని విన్పిస్తుంది.
జాగ్రత్త! ఈ మేజిక్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. హైడ్రోజన్ ను మండించే ముందు తగినంత హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి జరిగి సీసాలోని గాలి అంతా బయటికి నెట్టి వేయబడిందని నిర్ధారించుకోవాలి. లేదంటే గాజు సీసా బద్దలైపోవచ్చు. జ్వాల కూడా తగినంత పెద్దదిగా ఉండాలి. జ్వాల పెద్ద గొట్టం కొంత లోపలికి ఉండాలి. గొట్టం చివరిభాగం జ్వాల అంచున ఉన్నట్లుగా ఉండకూడదు. హైడ్రోజన్‌ను మండించే ముందు, సీసాకు ఒక గుడ్డను చుట్టి, కాస్త దూరంగా ఉండడం మంచిది.
ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/10/2020