హోమ్ / వార్తలు / 14 నుంచి ‘ఆన్‌లైన్‌’లో వ్యవసాయ ఉత్పత్తుల వేలం
పంచుకోండి

14 నుంచి ‘ఆన్‌లైన్‌’లో వ్యవసాయ ఉత్పత్తుల వేలం

మార్కెట్‌లోకి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల వేలం పాటలు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి

మార్కెట్‌లోకి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల వేలం పాటలు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ఈనెల 14వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున ప్రధాన మంత్రి నరేందర్‌ మోదీ భోపాల్‌లో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (నామ్‌)తో అనుసంధానం చేసే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నిత్యావసర వస్తువుల మార్కెట్‌లలో 21 మార్కెట్‌లను నామ్‌తో అనుసంధానం చేసి వస్తువుల వేలం పాటలు ఆన్‌లైన్‌లోనే చేసుకునే వీలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు మార్కెట్లలో హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ పరిధిలోకి వచ్చే మలక్‌పేట మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌లో ఎండు మిర్చి వేలం పాటలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు మార్కెటింగ్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా 15 కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. వేలం పాటల ప్రారంభం సమయంలో వ్యాపారులు కార్యాలయంలోని కంప్యూటర్ల క్యాబిన్‌లో కూర్చొని సరుకును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయనున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మార్కెట్‌లో ప్యాడీ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాదేపల్లి మార్కెట్‌, వరంగల్‌ మార్కెట్‌, నిజామాబాద్‌ మార్కెట్‌లలో మొక్కజొన్నలనూ కూడా ఆన్‌లైన్‌లోనే వ్యాపారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇది విజయవంతమైతే మిగతా సరుకుల కొనుగోలు కూడా ఆన్‌లైన్‌లోనే చేసే వీలుంటుందని వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మార్కెటింగ్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ఏర్పాట్లను జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ సమీక్షించారు

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు