హోమ్ / వార్తలు / యాజమాన్యాలు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ లను పెంచేందుకు ఇఎస్ఐసి పథకాన్ని ప్రారంభించిన కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ
పంచుకోండి

యాజమాన్యాలు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ లను పెంచేందుకు ఇఎస్ఐసి పథకాన్ని ప్రారంభించిన కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ

యాజమాన్యాలు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ లను పెంచేందుకు ఇఎస్ఐసి పథకాన్ని ప్రారంభించిన కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ

కార్మికులకు రక్షణ కవచాన్ని విస్తరించడం కోసం యాజమాన్యాలకు స్నేహపూర్వకంగా ఉండే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కార్మిక మరియు ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ బండారు దత్తాత్రేయ తెలిపారు. యాజమాన్యాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సహా ఇఎస్ఐసి ప్రయోజనాలను అందుకోని వర్గంలో ఉండిపోయిన వారిని ప్రోత్సహించడం కోసం ఒకసారి అవకాశాన్ని ఇవ్వడం ఈ పథకం ఉద్దేశమని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లో ప్రసార మాధ్యమాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ,  ఈ వ్యవధిలో నమోదు చేసుకొనే యాజమాన్యాలను రిజిస్ట్రేషన్ తేదీ నాటి నుంచి గాని, లేదా వారు ప్రకటించిన తేదీ నుంచి గాని కవరేజి పరిధిలోకి వచ్చినట్లుగా పరిగణించడం జరుగుతుందన్నారు. కొత్తగా రిజిస్టరైన ఉద్యోగులను వారి రిజిస్ట్రేషన్ తేదీ నాటి నుంచి రక్షణ పరిధిలోకి వచ్చినట్లుగా భావించగలరని తెలిపారు. ఇది 2016 డిసెంబర్ 20 కన్నా పూర్వం ఇఎస్ ఐ చట్టం కింద తీసుకొనే చర్యలపై ఎటువంటి ప్రభావాన్ని ప్రసరించదు అని మంత్రి స్పష్టంచేశారు.

బీమా కలిగివున్న ఒక్కొక్క వ్యక్తికి వైద్య ఖర్చులపై గరిష్ఠ పరిమితిని రూ.2,150 నుంచి రూ.3,000 వరకు (అడ్మినిస్ట్రేషన్ కేటగిరీ వారికయితే రూ.1,250 సబ్ సీలింగ్ ను, ఇతరులకయితే రూ.1,750 సబ్ సీలింగ్ ను కలుపుకొని) పెంచాలన్న ప్రతిపాదనను కూడా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇఎస్ఐసి) ఆమోదించినట్లు శ్రీ దత్తాత్రేయ వివరించారు.  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇఎస్ఐ కేంద్రాలలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు, ఇఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకొనే తలసరి వ్యయ గరిష్ఠ పరిమితిని సైతం పెంచాలన్న ప్రశంసాయోగ్య నిర్ణయాన్ని ఆమోదించిందని మంత్రి చెప్పారు. పెంచిన రూ.3,000 గరిష్ఠ పరిమితిని 2017-2018 సంవత్సరం నుంచి 2019-2020వరకు అమలులో ఉండేటట్లు నిర్ధరించనున్నారని, 2020-2021 నుంచి టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ), ఇంకా రాష్ట్రాల వ్యయ వివరాల ఆధారంగా ఏటా సమీక్షించగలరని ఆయన తెలిపారు.

ఇఎస్ఐసి 2015-2016 సంవత్సరానికి తన వార్షిక నివేదికను, వార్షిక ఖాతాలను కేంద్ర ప్రభుత్వానికి మరియు పార్లమెంట్ ఉభయ సభలకు సమర్పించడం కోసం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇఎస్ఐ పథకం స్థిరమైన వృద్ధి పథం వైపు సాగుతోందని ఆయన ప్రకటించారు. ఈ పథకం ప్రస్తుతం బీమా పరిధిలోకి వచ్చిన 2.13కోట్ల మందికి సామాజిక సురక్ష అవసరాలను నెరవేరుస్తోందని, రాగల రెండు- మూడు సంవత్సరాలలో ఇది మరిన్ని కోట్లకు పెరిగే సూచనలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిని పొందే వారి సంఖ్య ఇప్పుడు 8.23 కోట్లుగా ఉందని, రానున్న రెండు- మూడు సంవత్సరాలలో ఈ సంఖ్య కూడా పెరగనుందని తెలిపారు. మరింత మందిని సామాజిక సురక్ష పథకం పరిధి లోకి తీసుకువచ్చే దిశగా ఇఎస్ఐసి ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఇఎస్ఐసి తన లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలకే జమచేస్తోందని శ్రీ దత్తాత్రేయ చెప్పారు. అంతే కాకుండా, కార్మికులకు బ్యాంకు ఖాతాలను తెరవడానికిగాను ఒక ప్రత్యేక కార్యాచరణను కూడా చేపట్టినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణలకు, సామాజిక భద్రతకు కట్టుబడి ఉందని శ్రీ దత్తాత్రేయ అన్నారు.  ఇఎస్ఐసి/ ఇపిఎఫ్, వైద్య ప్రయోజనాలను అసంఘటిత రంగ కార్మికులకు విస్తరించడం కోసం ఎన్ డిఎ ప్రభుత్వం కంకణం కట్టుకొందని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఇఎస్ ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ దత్తాత్రేయ తెలిపారు. అన్ని ఆసుపత్రులలోను స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఎవైయుఎస్ హెచ్ (AYUSH) లో భాగంగా  హోమియో, ఆయుర్వేద, సిద్ధ వైద్య సేవలను కూడా కార్మికులకు అందజేయగలమని ఆయన చెప్పారు. తెలంగాణ లోని కుత్బుల్లాపూర్ లో ఒక రోగనిర్ణయకారి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అత్యవసర సంచార వైద్య వాహనాలను సైతం త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. దేశంలోని ఇఎస్ఐసి ఆసుపత్రులలో వైద్య మౌలిక సదుపాయాలను సమకూర్చగలమన్నారు. తెలంగాణలో ఇఎస్ఐసి గొడుగు కింద ఇంతవరకు 30,500 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని శ్రీ దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు