హోమ్ / వార్తలు / స్టార్టప్‌ కేంద్రాలుగా వర్సిటీలు
పంచుకోండి

స్టార్టప్‌ కేంద్రాలుగా వర్సిటీలు

యూనివర్సిటీలను స్టార్టప్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

యూనివర్సిటీలను స్టార్టప్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆసక్తిగల పలు రాషా్ట్రలతో ఈ నెల 21వ తేదీన హెచఆర్‌డీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కానుంది. తెలంగాణలోని ఓయూ, జేఎనటీయూ, కాకతీయ యూనివర్సిటీతో పాటు మరికొన్ని వర్సిటీలను ఈ కార్యక్రమం కింద అభివృద్ది చేయనున్నారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను రూసా ద్వారా సమకూర్చనున్నారు. ఇప్పటికే ఆయా వర్సిటీల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు, ఇతర విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా పలు అంశాలపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇవేవీ విద్యార్థులకు గానీ సమాజానికి గానీ ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. అదే విధంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు సరైన వేదికలు కూడా అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగానే యూనివర్సిటీలను స్టార్టప్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూనివర్సిటీల్లో స్టార్టప్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల ప్రతిభను ప్రొత్సహించవచ్చని హెచఆర్‌డీ భావించింది. నూతన ఆలోచనలు ఉన్న ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా సహాయం చేసి ప్రోత్సహించనున్నారు. నాక్‌ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలకు రూసా ద్వారా కోట్ల రూపాయల నిధులు వస్తాయి. వీటిలో కొంత మొత్తాన్ని స్టార్టప్‌ కేంద్రాలు తీర్చిదిద్దేందుకు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలు ఏ విధంగా ఉండాలనేదానిపై కూడా కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కాలేజీలను కూడా ప్రొత్సహించనుంది. ఈ విద్యార్థులు సొంతంగా స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకుంటే వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పలు యూనివర్సిటీలు, కాలేజీల్లో మౌళిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను రూసా ద్వారా సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిధులకు సంబంధించిన నివేదికను హెచఆర్‌డీకి పంపించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. కాకతీయ, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీలకు ప్రతి వర్సిటీకి రూ. 20 కోట్లు చొప్పున రూ. 60 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించనున్నారు. అదేవిధంగా 20 కాలేజీలకు ప్రతి కాలేజీకి రూ. 2కోట్ల చొప్పున రూ. 40 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు