జీవాల (గొర్రెలు, మేకలు) పెంపకం భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలోని ముఖ్యమైన వృత్తులలో ఒకటి. జీవాల పెంపకం ద్వారా దాదాపు 40 శాతం గ్రామీణ ప్రజానీకం ఉపాధి పొందుతున్నారు. కానీ ప్రతీఏటా జీవాలలో వచ్చే రకరకాల వ్యాధుల వల్ల గొర్రెలు, మేకలను పెంచే రైతులు తీవ్ర నష్టాలను అనుభవించాల్సి వస్తోంది.
జీవాలకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో చిటుక వ్యాధి ముఖ్యమైనది. క్లాఫ్రిడియం జాతికి చెందిన సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విష పదార్ధం వల్ల చిటుక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వలన చిటుక వేసినంతలోనే జీవాలు చనిపోతాయి. కావున ఈ వ్యాధికి చిటుక వ్యాధి అని పేరు వచ్చింది. ఈ వ్యాధిని నెత్తి పిడుగు వ్యాధి, గడ్డిరోగం, మెడసారం, పాటు రోగం, ముచ్చు వ్యాధి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలు పైనుండి పిడుగు పడినట్టుగా అకస్మాత్తుగా చనిపోతాయి. కాబట్టి దీన్ని రాయలసీమ ప్రాంతంలో నెత్తి పిడుగు వ్యాధి అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి తొలకరి వరాలు కురిసిన పిమ్మట (జూన్ - జూలై నెలల్లో) దొరికే పచ్చిక తిన్న జీవాల్లో వస్తుంది. సాధారణంగా చిటుక వ్యాధి లేత వయసు ఉన్న ధృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాలలో, వలస గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి గొర్రెలతో పోల్చితే మేకలలో తక్కువగానే కనిపిస్తుంది.
వ్యాధి కారణాలు
- క్లాస్త్రీడియం జాతికి చెందిన బ్యాక్టీరియా (ముఖ్యంగా టైపు డి) ద్వారా ఈ వ్యాధి వస్తుంది.
- తొలకరిలో పెరిగిన పచ్చి మేతను అతిగా మేయడం వల్ల జీవాల పేగులలో క్లాఫ్రిడియం బ్యాక్టీరియా అధికంగా పెరిగి ఎప్సిలాన్ అనే విష పదార్థం విడుదల చేయటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
- శరీరంలో అంతర పరాన్న జీవులు ఎక్కువగా ఉండడం (ముఖ్యంగా లద్దె పురుగులు), గడ్డిని తీసివేసి దాణాను అకస్మాత్తుగా మార్చడం, ఒకేసారి ఎక్కువ పాలు లేదా మేతని పిల్లలకి అందించడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది.
వ్యాధి లక్షణాలు
- సామాన్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవాలు హరాత్తుగా గాలిలోకి ఎగిరి కింద పడిగిల గిలా కొట్టుకొని, పళ్ళు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి.

- రాత్రి బాగానే ఉండి తెల్లారేసరికి ఎక్కువ సంఖ్యలో జీవాలు చనిపోతాయి.
- రోగ తీవ్రత తక్కువగా ఉన్న జీవాలకు అధిక జ్వరం ఉంటుంది (104-106 డిగ్రీల ఫారన్‌హీట్)
- వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు అధిక విరోచనాలు, కడుపు నొప్పి, నీరసంగా ఉండడం, సరిగా మేత తినక పోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
- కాళ్ళ బిగిసి నడవటం, కాళ్ళతో పొట్టను తన్నుకోవడం, పళ్ళు కొరకటం, వణకటం, శ్వాస కష్టమవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధి నిర్ధారణ
- తొలకరిలో జీవాలు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోయినప్పుడు చిటుక వ్యాధిగా అనుమానించవచ్చు.

- ఈ వ్యాధి సోకి మరణించిన గొర్రెలను శవ పరీక్ష చేసినట్లయితే మూత్ర పిండాలు మెత్తబడి గుజ్ఞ గుజజ్జగా మారిపోయి ఉంటాయి. పొట్టలో మేత నిండుగా ఉండటం కనిపిస్తుంది. పొట్ట, పేగులలో ఆకుపచ్చ ద్రవం కనిపిస్తుంది. పొట్టమీద, చిన్న పేగు ప్రారంభంలో, గుండెమీద రక్త ప్రావాలు గమనించవచ్చు.
- పొట్ట, పేగులలో నుండి సేకరించిన మేతను పరీక్షలకు పంపి ఎలీసా వంటి ఇమ్యునోలాజికల్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
వ్యాధి చికిత్స
ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా మరణిస్తాయి కాబట్టి సాధారణంగా చికిత్స చేసే వ్యవధి ఉండదు. వ్యాధి దీర్ఘకాలికంగా సోక్రిన జీవాలకు పశువైద్యుని సూచన ప్రకారం విరోచనాలు తగ్గడానికి నెబ్లాస్ పౌడర్, ఆంటీబయాటిక్ మందులు నోటి ద్వారా ఇవ్వాలి. రక్తనాళాలలోకి డేక్రోజ్ సెలైన్‌ను ఎక్కించాలి.
వ్యాధి నివారణ
- జీవాలకు ప్రతి సంవత్సరం వర్ష రుతువుకు ముందుగా మే మాసంలో చిటుక రోగ నివారణకు టీకాలు వేయించాలి. మరల 15 రోజుల తర్వాత బూస్టర్ డోస్ తప్పకుండా వేయించాలి.
- తొలకరి వరాలకు మొలిచి వాడిపోయిన లేత గడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తపడాలి.
- చిన్న పిల్లలు అధికంగా పాలు తాగకుండా చూసుకోవాలి.
- పిల్లలు పాలు తాగే స్థితి నుండి మేత, దాణాకు ఒకేసారి మార్చకుండా క్రమ క్రమంగా మార్చుకోవాలి.
- తొలకరిలో జీవాలు కడుపు నిండా పచ్చిమేత మేయకుండా 3-4 గంటలు మాత్రమే మేసేలా చూడాలి.
- వర్షాకాలం రాకముందే గొర్రెలలో బద్దె పురుగుల వంటి అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల మందు తాగించాలి.
ఈ వ్యాధి వచ్చినట్లయితే అధిక సంఖ్యలో జీవాలు అకస్మాత్తుగా చనిపోయి జీవాల పెంపకం దారులు తీవ్రమైన నష్టాలకు గురికావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఏడాది మే జూన్ నెలల్లో తప్పనిసరిగా చిటుకరోగ నివారణ టీకాలు వేయించాలి.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక