హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / వర్షాధారిత పంటల్లో సమగ్ర సస్యరక్షణ ప్రాముఖ్యత
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వర్షాధారిత పంటల్లో సమగ్ర సస్యరక్షణ ప్రాముఖ్యత

తొలకరి వర్షాలు పడగానే రైతులు వివిధ పంటలను విత్తుకుంటారు. పంట విత్తుకున్న సమయం నుండి కోత వరకు, నిల్వతో కూడా వివిధ చీడపీడలు ఆశిస్తాయి.

తొలకరి వర్షాలు పడగానే రైతులు వివిధ పంటలను విత్తుకుంటారు. పంట విత్తుకున్న సమయం నుండి కోత వరకు, నిల్వతో కూడా వివిధ చీడపీడలు ఆశిస్తాయి. ముఖ్యంగా వర్షాధారపు పంటల్లో చీడ పురుగులు దాదాపు 30 శాతం వరకు నష్టాన్ని కలిగిస్తాయి. చీడపీడలు పంటను ఆశించినప్పుడు వాటిని అరికట్టడానికి రసాయనిక పద్ధతులను వాడటం సర్వసాధారణం. కానీ, దీని వల్ల పర్యావరణ కాలుష్యం, సస్యరక్షణ ఖర్చులు పెరగడం గమనించవచ్చు. ఈ సమస్యలను అరికట్టడానికి లేదా అధిగమించడానికి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం అవసరం.

ఈ పద్ధతులు రైతు తొలకరి వర్షాలు కురవక ముందు నుండే ఆరంభించవచ్చు. ఉదా – వేసవిలో లోతు దుక్కులు, సమగ్ర సస్యరక్షణ అనగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా వివిధ పంటలను ఆశించే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేసి పంటలకు ఏ విధమైన నష్టం కలగకుండా తక్కువ ఖర్చుతో సేద్య, యాంత్రిక, జివనియంత్రణ, రసాయనిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించడం.

సేద్య పద్ధతులు

వేసవి లోతు దుక్కులు : ఏప్రిల్ – మేలో అడపాదడపా పడే వర్షాలను సద్వినియోగం చేసుకొని భూమిని 25-30 సెం. మీ. లోతు దుక్కులు చేసుకోవాలి. దీనివల్ల భూమి గుల్లగా అయి నీరు నిల్వ సామర్ధ్యం పెరగడమే కాక భూమి లోపల, పంట అవశేషాల్లో ఉన్న పురుగుల కోశస్ధ దశలు, శిలింధ్ర బీజాలు భూమి పైకి వచ్చి పక్షులు బారిన పడటం లేదా ఎండా వేడిమికి నశిస్తాయి. దీని వలన రాబోయే పంటలో పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు.

పంట మార్పిడి : ఒకే రకమైన పంటను ఏళ్ళ తరబడి ఒకే ప్రాంతంలో సాగుచేయకుండా ప్రాంతాన్ని బట్టి, నీటి వసతిని బట్టి పంట మార్పిడి చేసుకుంటే చీడపీడల ఉధృతి తగ్గుతుంది.

చీడ పీడలను తట్టుకునే వంగడాలు : ఆయా ప్రాంతాలకి అనువైన చీడపీడలను / తెగుళ్ళను తట్టుకునే వంగడాలను సాగుచేస్తే కొంత మేరకు చీడపీడల బెడద తగ్గించవచ్చు.

విత్తనశుద్ధి: ఇది తక్కువ ఖర్చుతో విత్తుకున్న 30 రోజుల వరకు పంటను చీడపీడల బారీ నుండి కాపాడుతుంది.

సరైన సమయానికి విత్తడం : పంటను సరైన సమయానికి విత్తడం ద్వారా చీడపీడల నుండి కాపాడవచ్చు. ఉదా : జొన్న జూన్ మొదటి పక్షాన విత్తుకుంటే మొవ్వ ఈగ నుండి పంట కాపాడబడుతుంది.

ఎర పంటలు : ప్రధాన పంట చుట్టూ 1 లేదా 2 వరుసల్లో ఎర పంటలు వేసుకుంటే ప్రధాన పంట పై పురుగులు ఉధృతి తగ్గుతుంది. ఉదా : పత్తి చుట్టూ బెండ వేసుకంటే పచ్చదోమ ఉధృతి తగ్గుతుంది.

సేంద్రియ, రసాయన ఎరువుల వాడకం : లభ్యతను బట్టి సేంద్రియ ఎరువులను వాడాలి. పచ్చిరోట్ట పైరులను వేసుకోవాలి. సిఫారసు చేసిన మేరకు రసాయనిక ఎరువులను వాడాలి. అధిక మోతాదులో నత్రజని వేసినట్లయితె చీడపీడల ఉధృతి పెరుగుతుంది.

యాంత్రిక పద్ధతులు

 • పురుగుల పై నిఘా ఉంచేందుకు వీలుగా సిఫారుసు చేసిన పంటల్లో లింగాకర్షక బుట్టలు, జిగురు పూసిన అట్టలు అమర్చుకోవాలి.
 • పక్షి స్ధావరాలను ఏర్పరచుకోవాలి.
 • నష్టపరిచే పరుగుల గుడ్ల సముదాయాన్ని, నష్టపరచిన భాగాలను ఏరి నాశనం చేయాలి.

జీవ నియంత్రణ పద్ధతులు

 • ట్రైకోగ్రామ వంటి గుడ్డు పరాన్నజీవులను నమయానుకులంగా విడుదల చేయాలి.
 • వివిధ పురుగులకు ఎన్.పి.వి ద్రావణం తయారు చేసి పిచికారీ చేయాలి.
 • బాసిల్లస్ ధురింజియన్స్ ద్రవకాన్ని కూడా వినియోగించవచ్చు.
 • ట్రైకోడేర్మా లేదా నూడోమోనాన్ వంటి శిలింధ్రాలను వినియోగించి పంటల్లో తెగుళ్ళను నివారించవచ్చు.
 • niyantrana padhatulu.jpg

 • వేప, కానుగ, నికోటిన్ మొదలగు వృక్ష సంబంధ కిటక నాశీనులను వాడాలి.

రసాయనిక పద్ధతులు పాటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • పైరులో చీడపీడలు గమనిస్తూ అవి నష్టపరిమితి స్ధాయిని దాటినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 • పంటలకు మేలు చేసే పురుగులు, సహజ శత్రువులు, పరాన్న జీవులు బదినికలు ఉన్నప్పుడు వాటిని సంరక్షించుకోవాలి. రసాయిక పురుగు మందుల వాడకం తగ్గించాలి.
 • చీడపీడల ఆర్ధిక నష్టపరిమితి దాటిన తర్వాత మాత్రమే క్రిమి సంహారక మందులను పిచికారీ చేసుకోవాలి.
 • రెండు, మూడు రకాల మండులను కలిపి పిచికారి చేయకూడదు.
 • ఒకే పురుగు/తెగులు నివారణకి 2-3 సార్లు మందులు వాడవలసిన వస్తే వేరే తరగతికి చెందిన మందులను మర్చి వాడాలి.
 • సిఫారసు చేసిన మేరకే రసాయనిక మందులను వాడాలి.
 • పురుగుల ఉధృతికి దోహదం చేసే సింధటిక్ పైరిధ్రాయిడ్స్ మందుల వాడకం తగ్గించాలి.

సమగ్ర సస్యరక్షణ వలన లాభాలు

 • పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు.
 • తక్కువ ఖర్చుతో చీడపీడలను అదుపులో ఉంచవచ్చు.
 • అధిక నికరాదాయం పొందవచ్చు.

ఈ విధంగా రైతు సోదరులు వివిధ పద్ధతులను ఉపయోగించి సమయానుకూలంగా చీడపీడలను అదుపులో ఉంచితే తక్కువ ఖర్చుతో అధిక నికరాదాయాలు పొందటమే కాక ఆరోగ్యకరమైన, ఆహ్లాదరకమైన పంటను, పర్యావరణ సమతుల్యతను సంతరించుకోగలం.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.00675675676
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు