హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / పర్యావరణం పరిరక్షణకి వర్మీ కంపోస్టు వాడకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణం పరిరక్షణకి వర్మీ కంపోస్టు వాడకం

పర్యావరణం పరిరక్షణకి వర్మీ కంపోస్టు వాడకం – తయారీ విధానం – తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం చాలా పెరిగింది. రసాయన ఎరువుల మీద పూర్తిగా ఆధారపడడం జరిగి, సేంద్రియ ఎరువుల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఈ రసాయనిక ఎరువుల ప్రభావం భూమిలో ఉన్న జీవరాశులపై కూడా ఉంటుంది. అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడడం వలన భూమిలోపల, ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అవుతుంది. అందువలన సేంద్రియ ఎరువుల వాడకం ఎంతో ముఖ్యమైనది. ఈ సేంద్రియ ఎరువులలో వానపాముల ద్వారా తయారయ్యే వర్మీ కంపోస్టు (వానపాము ఎరువు) ప్రస్తుతం చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్నది. ఈ ఎరువు వలన వాతావరణం కాలుష్యం అవదు. పంటలకు హాని జరగదు. దీని వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందవచ్చు.

ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే ఎరువును వర్మీకంపోస్టు (వానపాము ఎరువు) అని పిలుస్తారు.

వర్మీ కంపోస్టు ప్రాముఖ్యత

వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువుతో సరాసరి నత్రజని, ఫాస్పేట్, పొటాష్ పోషకాలు 0.75, 0.17, 0.55 శాతం ఉంటే, వర్మీ కంపోస్టులో ఇవి సరాసరి 1.23 నుండి 2.40 (నత్రజని), 0.67 నుండి 1.93 (ఫాస్ఫేట్), 0.35 నుండి 0.63 (పొటాష్) శాతంగా, వేసిన వ్యర్థ పదార్థం పై ఆధారపడి ఉంటాయి.

వర్మీ కంపోస్టు తయారీకి కావాల్సినవి

వానపాములు:

ఈ వర్మీ కంపోస్టు తయారీకి బొరియలు చేయని వాన పావులు ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యమైనవి 1) యూడ్రిలస్ యూగినే, 2) అయిసీనియా ఫోటిడా, 3) పెరియానిక్స్ ఎక్స్ కవేటస్, 4) లుంబ్రికస్ రుబెల్లస్ ఇతర అవసరాలు : వానపాముల్ని ఎండనుంచి రక్షించడానికి, తగిన నీడను కల్పించాలి. నీడ కొరకై పందిరి వేయడానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచులు, పాలిథీన్ సంచులను ఉపయోగించవచ్చు. పందిరి వేయడం వలన వానపాములకు నీడనివ్వటమే కాకుండా, వానపాము ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరి అయిపోకుండా కాపాడుకోవచ్చు. అంతే కాకుండా, వర్షం నేరుగా వానపాము ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా రక్షించుకోవచ్చు. పాతగోనె సంచులను తడిపిన వర్మీ కంపోస్టు బెడ్లపై కప్పటానికి కూడా ఉపయోగించవచ్చు.

సేంద్రియ వ్యర్థ పదార్థాలు:

వానపాము ఎరువు (వర్మీ కంపోస్టు) తయారు చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తుల శేషవ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు మొదలగునవి ఉపయోగపడతాయి.

వర్మీ కంపోస్టు బెడ్ లను తయారు చేయడం

ఈ కంపోస్టు బెడ్ లను భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు, వీలైనంత పొడవును ఏర్పాటు చేసుకోవచ్చు. కంపోస్టు బెడ్లను శాశ్వతంగా ఏర్పాటు చేయాలనుకుంటే వాటని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు. లేదా పేడను ఉపయోగించి గట్టి పర్చవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొన్న బెడ్లపై సుమారుగా 45 సెం.మీ. ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయ్యాలనుకొంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను (చెత్త, ఆకులు, పేడ మొదలగునవి) వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5-10 సెం.మీ. మందం వరకు పేడను వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా ఒక వారం వరకు నీరు అడపా దడపా చల్లుతుండాలి.

వారం రోజుల తరువాత పైన సూచించిన బొరియలు చేయని వానపాములను వదలాలి. ఈ వానపాములు ఆహారాన్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • బెడ్లపైన నేరుగా ఎండ, వాన పడకుండా చూడాలి.
  • బెడ్ పైన పాతగొనె సంచులను గానీ, వరిగడ్డిని గానీ పర్చినట్లయితే తేమను కాపాడుకోవడమే కాక కప్పలు, పక్షులు, చీమల నుంచి వానపాములను రక్షించుకోవచ్చు.
  • వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించే వ్యర పదార్థాలను కనీసం ఒక నెల రోజుల వరకు బయట బాగా కుళ్ళబెట్టాలి.
  • వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తడిపిన గోనె సంచులను మడులపై కప్పాలి.
  • వానపాములను వదిలిన బెడ్లపై ప్రతి రోజుపల్చగా నీరు చల్లుతుండాలి.
  • ఈ వర్మీ కంపోస్టును 2 -3 నెలల్లో తయారు చేయవచ్చు. బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి 4, 5 రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2.3 ఎం. ఎం. జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.

ఎరువును తొలగించిన బెడ్ల పైన వ్యర్థ పదార్థాలను 45 సెం.మీ. ఎత్తు వరకు పరచి మరల పైన చేసిన విధంగా కంపోస్టును తయారు చేసుకోవచ్చు.

ఇలా సంవత్సరానికి సుమారు 6 సార్ల వరకు వర్మీ కంపోస్టును తయారుచేసుకోవచ్చు.

వర్మీ కంపోస్టును వివిధ పంటలకి ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ళ వరకు వాడవచ్చు. పండ్ల తోటలలో ప్రతి చెట్టుకి 5-10 కిలోల వరకు ఈ ఎరువును వాడవచ్చు.

3.01376146789
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు