పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వాతావరణం - పంటల పరిస్థితి

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.

భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 7 వ తేదీన ప్రవేశిస్తాయి. కానీ ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళలో మే 30వ తేదీన ప్రవేశించాయి. అనగా వారం రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.

రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలంలో సాధారణ వర్షపాతం 719, 3 మి.మీ. కు గాను 646.3 మి.మీ. అంటే సాధారణ (-10%) వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలంలో (01.06.2017 నుండి 30.09.2017) రాష్ట్రంలో కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సాధారణం కన్న తక్కువ వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో 01.10.2017 నుండి 25.10.2017 వరకు కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల్ , నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, మెదక్, నగర్ కర్నూల్, సూర్యాపేట్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమరంభీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు:

నల్లరేగడి నేలల్లో నిలవ ఉండే తేమను ఉపయోగించుకొని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ, కుసుమ పంటలను విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.

వరి:

 • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో గింజమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు గాను ప్రోపికోనజోల్ 1.0 మి.లీ. లేదా కార్బండాజిమ్ + మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ట్రెప్టోక్సి స్ట్రోబిన్ + టేబుకోనజోల్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి,
 • ఒకవేళ గింజమచ్చ తెగులుతో బాటు కంకినల్లి లక్షణాలు (మధ్య ఈనేపైన ఎర్రని చారలు/ పోటాకు పైన ఎర్రని మచ్చలు) ఉన్నప్పుడు గింజమచ్చ తెగులు నివారణకు వినియోగించిన శిలీంధ్ర నాశాకాలతో బాటు స్పైరోమెసిఫెన్ 1.0 మి.లీ. లేదా డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా ప్రో ఫెనోఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
 • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గితెగులు/ మెడవిరుపు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు గాను ఐసోప్రోథయొలేస్ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ 0.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి 7-10 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 • వరిలో ఆకుముడత పురుగు గమనించడమైనది. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా కోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • ఆలస్యంగా నాట్లు వేసి వరి పొలాల్లో సుడిదోమ ఉధృతి (20-30 పురుగులు /దుబ్బుకు) పెరుగుతుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా + బుప్రోఫెజిన్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళపై పడేవిధంగా పిచికారీ చేయాలి. ఒక వేళ దోమ ఉధృతి (30-100 పురుగులు) మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో డినోటెప్యూరాన్ 0.4 గ్రా లేదా పైమిట్రోజైన్ 0.6 గ్రా. లేదా ఎథిప్రోల్ + ఇమిడాక్లోప్రిడ్ 0.25 గ్రా, లీటరు నీటికి కలిపి మందులను మార్చి 7-10 రోజుల వ్యవధీతో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 • దోమ ఉధృతికి దోహదపడే మందులైన క్లోరిపైరిఫాస్, ప్రోఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్స్, వివిధ బయోమందులు వాడరాదు.

మొక్కజొన్న:

మొక్కజొన్న విత్తడానికి 15 అక్టోబర్ నుండి 15 నవంబర్ వరకు అత్యంత అనుకూలమైన సమయం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆగిన తరువాత పైరును విత్తుకోవాలి.

పత్తి:

 • పత్తిలో ప్రస్తుత వాతావరణం వివిధ రకాల బాక్టీరియా ఆకుమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు సోకడానికి అనుకూలంగా ఉన్నది. నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా., ప్లాంటామైసిన్ 2.0 గ్రా./సైప్టోమైసిన్ 1.0 గ్రా. 10 లీ. లేదా మాంకోజెబ్ + కార్బండైజిమ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • పత్తిలో ప్రస్తుత వాతావరణం వివిధ రకాల ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలంగా ఉన్నది. నివారణకు మాంకోజెబ్ + కార్బండైజిమ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే సూచనలు ఉన్నాయి. నివారణకు, ఫిప్రోనిల్ 2.0 మీ.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాంమొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • పత్తిలో పొగాకు లద్దెపురుగు గమనించడమైనది. నివారణకు, థయోడికార్బ్ 1.5 గ్రా లేదా నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కంది:

 • కంది పంట ప్రస్తుతం మొగ్గ లేదా పూత దశలో ఉన్నది. ఈ దశలో మరుక గుడు పురుగు సోకే సూచనలున్నాయి. ఈ పురుగు రెండు లేదా మూడు మోవ్వులను ఒక దగ్గరకు చేర్చి గూడు చేసి పూతను తింటాయి. నివారణకు వేప పిండి కషాయం 0.5 శాతం లేదా వేపనునే 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. + డైక్లోరోవాస్ 1.0 మీ.లీ. లేదా ఫుబెండమైడ్ 0.2 మి.లీ. లేదా స్పినోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి,
 • పొగాకు లద్దె పురుగు ఉనికిని గమనించడమైనది. నివారణకు, ఈ కింది సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి,
 • పొలంలో ఎకరాకు 20 పక్షి స్థావరాలను అమర్చాలి.
 • నివారణకు 5% వేపగింజల కషాయం లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా 1.5 గ్రా ఎసిఫేట్ లేదా 1 మి.లీ నోవాల్యూరాన్ లేదా 1.5 గ్రా. థయోడికార్డ్స్ లేదా 1.0 మి.లీ. ఇండాక్సాకార్డ్స్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయలు:

 • ప్రస్తుత పరిస్తితుల్లో కూరగాయ పంటలైన బెండ, వంగ, టమాట వంటి పంటలలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే సూచనలున్నాయి, ఎకరాకు 10- 20 మైనం పూసిన పసుపు రంగు అట్టలను పెట్టాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ 2.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి చేయాలి,
 • వంగ, బెండలో కాయ తొలుచు పురుగు ఉధృతి పెరిగే సుచనలున్నాయి, తల్లి పురుగు నివారణకు ఎకరాకు 40 లింగాకర్షక బుట్టలు పెట్టాలి.
 • వంగలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఫుబెండమైడ్ 0, 4 మీ.లీ. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • బెండలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే థెయోడికార్బ్ 1.0 గ్రా. లేదా నోవల్ల్యురాన్ 1.0 మీ.లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • దోస జాతి కురగాయాల్లో పెంకు పురుగు ఉధృతి పెరిగే సూచనలు న్నారు. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.0. మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని కురగాయాల్లో ఆకు మచ్చ తెగులు సోకే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తగా కార్బన్ డజిమ్ 1.0 గ్రా. లేదా సాఫ్ 2.0 మి.లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పశుపోషణ:

 • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు.
 • కోళ్ళలో కొక్కెర వ్యాధి, గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి, నీలి నాలుక వ్యాధి.
 • ఆవులు, గేదేలలో గొంతువాపు వ్యాధి, గొంతు, గాలికుంటు వ్యాధి సోకడానికి అనుకూలం వీటి నివారణకు, టీకాలు వేయించాలి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వివిధ పంటలను ఆశించడానికి ఆస్కారం ఉన్న చీడపీడలు:

 • వరిలో అగ్గితెగులు, సుడిదోమ, కంకినల్లి.
 • పత్తిలో రసంపీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగులు.
 • కందిలో ఆకుచుట్టు పురుగు, పొగాకు లద్దె పురుగు, మారుక మచ్చల పురుగు.
 • కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగులు.
 • గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి.

ఆధారం: డా. బి. బాలాజీ నాయర్, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్. ఫోన్. 040-24016901

3.00325732899
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు