ఈ-పరిపాలనలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ప్రభుత్వ, పౌర సేవలకనుగుణంగా ప్రతి శాఖలో రెండు సర్వీసులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నాలుగు నెలల గడువునిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ లోగా ప్రభుత్వ విభాగాలు తమ శాఖకు సంబంధించి ఏమైనా రెండు ప్రభుత్వ-పౌర సేవలను రాజీవ్ ఉమ్మడి సర్వీసు కేంద్రాల (గ్రామీణ ఈ-సేవ) ద్వారా అందించాలని అధికా రులకు సూచించారు. ప్రభుత్వ విభాగాల్లో కొన్ని మాత్రమే ఈ-సేవ ద్వారా ప్రభుత్వ-పౌర సర్వీసులను అందిస్తున్నాయి.
మిగతా శాఖలు ఈ-సేవ ద్వారా పౌరసే వలను అందించేందుకు ముందుకురావటం లేదు. ప్రతి ప్రభుత్వశాఖ తప్పని సరిగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ప్రభుత్వ-పౌర ,ప్రభుత్వ-పౌర వ్యాపార సేవలు అందించాలని జాతీయ ఈ-పరిపాలనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వెబ్‌సైట్ నిర్వహణ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, కీలక సమాచారాన్ని ప్రజలకు చేర వేయడం ద్వారా ప్రజాపాలన పారదర్శకంగా కొనసాగుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, వాటిని నిర్వహించడం లేదు. కొన్నిటికైతే ఇప్పటికీ వెబ్‌సైట్లు లేవు.
ప్రభుత్వ శాఖలో ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అధికారుల నియామకం, శిక్షణ కార్యక్రమం మూలన పడింది. దీంతో సమాచారాన్ని అప్‌డేట్ చేసేవారు..వెబ్‌సైట్ నిర్వహించేవారు లేక పాత సమా చారంతో దర్శనమిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవటంతో సేవలు నెమ్మదిగా సాగుతున్నాయి. గ్రామీణులు ప్రభుత్వ-పౌరసేవలు కోసం ప్రతీ సారీ మండల,జిల్లా కలెక్టరు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కనీసం ప్రతిశాఖ నుం చి రెండు సేవలు ఉమ్మడి సర్వీసు (గ్రామీణులకు-ఈసేవ) కేంద్రాల ద్వారా అందితే, ప్రజలకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని ఇన్ఫర్మేషన్ శాఖ చెబుతోంది.
ఆధారము: సూర్య
జిల్లాలోని పలు తహశిల్దార్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు కావాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే. ఇక ముడుపులు ఇస్తే వారు ఆగ్రామంలో, మండల పరిధిలో నివశించకపోయినా, రేషన్‌కార్డులేకున్నా ఎవరిదో రేషన్‌కార్డు నెంబర్ వేసి క్షణాల్లో వారికి నివాస ధృవీకరణ పత్రాలు ఇచ్చేస్తారు. అంతా డబ్బుమయం అయింది. ఈనేపధ్యంలో జిల్లా రెవిన్యూ యంత్రాంగాన్ని పటిష్టపరచి ప్రక్షాళన చేసి, కొత్త ఒరవడి సృష్టించేందుకు జిల్లా కలెక్టర్ రవిచంద్ర నిర్ణయించారు. ఇక అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరగుతాయి. రెవిన్యూ కార్యాలయాల్లో జరిగే పనుల కోసం కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇ సేవా కేంద్రానికి వెళ్ళి నిర్ణీత రుసుముచెల్లించి దరఖాస్తు ఇస్తే చాలు. ఆ సర్టిఫికెట్ మీ ఇంటి ముందు ఉంటుంది. ఈవిధానానని ఆగస్టు 1 నుంచి జిల్లాలో ప్రవేశపెట్టేందుకు కలెక్టర్ నిర్ణయించారు.
జిల్లా కలెక్టర్ రవిచంద్ర నేతృత్వంలో రెవిన్యూ యంత్రాంగాన్ని పటిష్టపరచే పనులు ప్రారంభం అయ్యాయి. తహశిల్దార్ కార్యాలయం మొదలు జిల్లా కలెక్టరేట్ వరకు అన్ని కార్యాలయాలను కంప్యూటరీకరిస్తున్నారు. జిల్లాలోని రెవిన్యూ కార్యాలయాల్లో ఒక్క సంతకం పెట్టడం తప్ప మిగిలిన అన్ని పనులు కంప్యూటర్‌ల ద్వారానే జరుగనున్నాయి. కలెక్టరేట్‌లో రికార్డుల కంప్యూటరీకరణ, డిజిలటలైజేషన్ పనులు పెద్ద ఎత్తున జరగుతున్నాయి. అడంగల్, బి 1 రిజిష్టర్, పహానీ, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, వివిధ రకాల ధృవీకరణపత్రాలు, ఎన్‌ఓసి ఇలా ఏపని అయినా కంప్యూటర్ కాపీలు ఇవ్వడం తప్ప చేత్తో రాసే పనే ఉండదు. ఇందుకోసం ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈవిధానం రంగారెడ్డి జిల్లాలో అమలులో ఉంది. నెల్లూరు జిల్లాలో పాక్షికంగా అమలు చేస్తున్నారు. ఈవిధానాన్ని పరిశీలించివచ్చేందుకు రామచంద్రపురం తహశిల్దార్ జి మల్లిఖార్జున ఆధ్వర్యంలో ఓ బృందం అక్కడకు వెళ్ళి పరిశీలించి వచ్చింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఆర్‌డిఓగా పనిచేసిన అధికారి ప్రస్తుతం రాజమండ్రి ఆర్‌డిఓగా వచ్చారు. ఈయన సహకారాన్ని కూడా తీసుకుని ఈవిధానాన్ని ఏవిధంగా అమలు చేయాలన్నదానిపై కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 1 లేదా ఆగస్టు 15వ తేదీ నాటికి జిల్లాలోని రెవిన్యూపరమైన అన్ని పనులు కంప్యూటర్‌ల ద్వారానే జరుగనున్నాయి. వివిధ సర్టిఫికెట్‌లు, ఇతర పనుల కోసం ప్రజలు తహశిల్దార్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సమీపంలోని ఇ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు ఇస్తేచాలు ఆ సర్ఠిఫికెట్‌లు నేరుగా ఇంటికే వచ్చేస్తాయి. జిల్లాలోని రెవిన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్ చేస్తుండడంతో నకిలీ, బోగస్ సర్టిఫికెట్‌ల జారీకి అవకాశమే ఉండదు. జిల్లా కలెక్టర్ రవిచంద్ర బుధవారం రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి జరిపిన సమీక్షా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించడంతో మంత్రి రఘువీరా ఆయనను అభినందించారు.
ఆధారము: ప్రభన్యూస్
అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవకాశంగా మలిచి, ప్రభుత్వ పాలనను ప్రజానుసంధానం చేస్తే ప్రగతి రథం పరుగులు తీయాల్సిందే. అక్షర క్రమంలోనే కాదు, ఇంటర్నెట్ వినియోగంలోనూ మేమే అగ్రగాములమని చాటి చెబుతూ 'ఇ' గవర్నెన్స్‌లో ఇదీ ప్రస్థానం అంటూ ఇతర రాష్ర్టాలకు మార్గనిర్దేశం చేస్తోంది ఆంధ్రప్రదేశ్. అర్ధశతం దాటిన ప్రభుత్వ శాఖలు మొదలు పల్లె పల్లెను పలకరించే మండల కార్యాలయాల వరకూ నేటి ప్రభుత్వ పాలన 'ఇ' గవర్నెన్స్ ముచ్చటే. రాష్ట్ర సచివాలయం నుంచి విడుదలయ్యే ప్రభుత్వ ఉత్తర్వులే కాదు. సాధారణ బడిపంతుల బదిలీని కూడా మనం ఇంటర్నెట్‌లో చూడవచ్చు. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై అవగాహన పెంపొందించే 'ఇ' గవర్నెన్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రికార్డు సృష్టిస్తోంది.
'ఇ' మెయిళ్లు చూసుకోవడం, వీడియోగేమ్‌లు ఆడుకోవడానికి ఇంటర్నెట్‌ను, కంప్యూటర్లును వినియోగించుకుంటున్న దశలోనే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా దశాబ్దం క్రితమే పౌరసేవల నిమిత్తం 'ఇ' సేవకు శ్రీకారం చుట్టింది. వేగవంతంగా ప్రజల అవసరాలు తీర్చడానికి అత్యాధునిక శాస్ర్తీయ విజ్ఞానాన్ని వినియోగించవచ్చునని పదేళ్లనాడే ఆచరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరూపించింది. వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లు, సేకరణకు 'ఇ' ప్రొక్యూర్‌మెంట్, స్థలాల రిజిస్ర్టేషన్లు ఇతర విషయాల్లో కచ్చితమైన నమోదుకు కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ర్టేషన్ ఆఫ్ డాక్యుమెంట్(కార్డ్), రవాణ శాఖలో ప్రజానుకూల విధానంతో కూడిన సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ ఆఫ్ ట్రాన్సు పోర్టు (సీఎస్‌ఎఫ్‌టీ) వంటివి తొలి దశలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'ఇ' సేవా విధానాలు.
''మా 'ఇ' సేవ ప్రాజెక్టుకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగిన ఐఎస్‌ఓ 9001 గుర్తింపు లభించింది. పౌర వసతులే లక్ష్యం, కేంద్రంగా ప్రారంభమైన ఒక నూతన కార్యాచరణగా ప్రాచుర్యం దక్కింది.' అన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి, తొలిదశలో ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఫణికుమార్. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ముఖాముఖి అనుసంధానానికి ఈ వ్యవస్థ ఏర్పాటు ఎంతగానో దోహదం చేసిందని 'ద సండే ఇండియన్'తో తన అనుభవాలను పంచుకున్నారు. పౌర సేవల నిమిత్తం సమాచారాన్ని ఎలక్ర్టానిక్ విధానంలో పంపిణీ చేయడానికి, పాలన మెరుగుదలకు అంతర్జాతీయ స్థాయిలోనే మన 'ఇ'గవర్నెన్స్ రోల్ మోడల్‌గా నిలిచింది. అంటూ పూర్వాపరాలను వివరించారు, ఫణికుమార్.
ఇది మూన్నాళ్ల ముచ్చటగా మిగలకుండా, సుస్థిరంగా కొనసాగడమే కాకుండా సామాన్యుని జీవితం మరింత సౌకర్యవంతంగా మారడానికి దోహదం చేసింది. అంతేకాకుండా గ్రామ, పట్టణ ప్రాంతాల మధ్య సాంకేతికంగా ఉన్న అగాధాన్ని పూడ్చడానికి కూడా ఉపకరించింది.
రాష్ట్రంలోని 1,125 మండలాలకు సంబంధించిన సమాచారం మొత్తం కరతలామలకమై కంప్యూటర్‌కు ఎక్కి కూర్చుంది. 8.6 కోట్ల రాష్ట్ర జనాభాకు సంబంధించిన డాటా వివరాలూ చిటికెలో లభ్యం. రాష్ట్రంలో ఏ మూలన కూర్చుని అయినా పౌరుడు ఏ ప్రభుత్వ శాఖతో అయినా తనకు కావాల్సిన పనులు 'ఇ' సేవ ద్వారా చేయించుకోగల సౌలభ్యం లభించింది. ఆన్‌లైన్‌లో విద్యుత్తు, ఇంటిపన్ను, కొళాయి పన్నుల వంటివి చెల్లించడమే కాకుండా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలనూ పొందవచ్చు. రాష్ట్ర సచివాలయం, మండల కేంద్రాలతో డేటా ఇంటిగ్రేషన్ ప్రాజెక్టు ద్వారా సమాచారాన్ని అనుసంధానం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ప్రభుత్వ సమాచార సాంకేతిక అవసరాలు తీర్చేందుకు ఉపకరిస్తోంది. ఈ సంస్థ ప్రవేశపెట్టిన పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ డిజిటల్ సర్టిఫికెట్ల జారీ, 'ఇ' ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి నూతన విధానాలకు తెర తీసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు, పనులకు సంబంధించి 'ఇ' గవర్నెన్స్ ద్వారా ధ్రువీకరణ పత్రాల డిజిటల్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను ఈ సంస్థ చేపట్టింది.
వీటితోపాటు ప్రజలను సాధికారికం చేసేలా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా 'ఇ' గవర్నెన్సు అందించిన ఒక వరంగానే పేర్కొనాలి. సమాచార హక్కు చట్టం కల్పించిన అవకాశాలకు ఇది ఆచరణాత్మక రూపం. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను వెదుక్కోవచ్చు. ఇల్లు కదలకుండానే పౌరులు ప్రభుత్వంతో చర్చించేందుకు వీలు కల్పించే వినూత్న కార్యక్రమమే ఈ ప్రజావాణి. ప్రజా, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన కార్యక్రమమిది.
ప్రజాబాహుళ్యానికి విస్తృత సేవలు అందించడానికి మరిన్ని వినూత్న విధానాలకు రాష్ట్రం వేదికగా మారుతోంది. మౌలిక సమాచార సేవలతో పాటు మొబైల్ ప్లాట్ ఫారాన్ని వివిధ రకాలుగా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ మొబైల్ ఫోన్లను వినియోగిస్తూ వివిధ రుగ్మతలకు సంబంధించి సమగ్ర రోగ నిఘా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సంక్రమిత వ్యాధులు, రోగాలకు సంబంధించి స్వయం స్పందనకు వీలుగా సమాచార సేకరణకు ఈ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు.
సభా కార్యక్రమాలను డిజిటలైజ్ చేసిన ఘనతను తొట్టతొలుతగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ దక్కించుకుంది. ఈవిషయంలో దేశంలోని మిగిలిన శాసనసభలకు మార్గనిర్దేశం చేస్తూ 1952 నుంచి రాష్ట్ర శాసనసభతో పాటు పూర్వ హైదరాబాద్ శాసనసభలో చేపట్టిన కార్యకలాపాలకు సంబంధించి 3 లక్షల పేజీల పరిమాణం కలిగిన సమాచారాన్ని , డిజిటలైజ్ చేసి వెబ్‌సైట్‌లో ఉంచారు. వీటిలోని సమాచారాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు. సభా కార్యక్రమాల తీరుతెన్నులపై అవగాహన కలిగించుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని 294 మంది శాసనసభ్యులూ ఇప్పుడు హైటెక్ కాబోతున్నారు. ఫాక్స్, ప్రింటర్, స్కానర్, కాపీయర్, టెలిఫోన్ వంటి అయిదు సదుపాయాలతో కూడిన లాప్‌టాప్‌ను ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ సమకూరుస్తున్నారు. అయితే ఇది ఒక అలంకారమో, హంగూ ఆర్భాటమో కాదు, వారిని మరింత జవాబుదారీగా మార్చడానికే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 'ఇ' పిటిషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. కేవలం మౌస్‌ను క్లిక్ చేయడంతోనే చిటికెలో తనకు సంబంధించిన ఫిర్యాదును ఏ పౌరుడైనా ఇప్పుడు శాసనసభ కార్యాలయం దృష్టికి తీసుకురావచ్చు. ఈరకంగా చూస్తే శాసన సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు మరింత జవాబుదారీగా మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎవరేని శాసనసభ్యుడు నిర్దిష్ట కాలవ్యవధిలో తన ప్రజలు చేసుకున్న విజ్ఞప్తికి స్పందించకుంటే, ఆ విన్నపం నేరుగా సభాపతి నాదెండ్ల మనోహర్ కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌కు చేరి అక్కడ నమోదవుతుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం కావడం ద్వారా ఆంధ్రప్రవేశ్ ప్రజలు నేడు సాధికారతను సాధించారు.
ఆధారము: ది సండే ఇండియన్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
కేంద్ర బడ్జెటు 2023-24 ను కేంద్ర ఆర్థిక మరియు కార్...
సాధారణంగా కాగితం, కలం, ఆధారంగా ప్రభుత్వ పాలన జరుగు...