పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కృత్రిమ మేధ

సిరి నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల దాకా కృత్రిమ మేధ, వేగంగా అభివృద్ధి చెందుతోంది

feb8సిరి నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల దాకా కృత్రిమ మేధ, AI (Artificial Intelligence) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కృత్రిమ మేధ అనే టెక్నాలజీ ఆధారంగా ఎన్నో సైన్స్ కల్పిత కథలు, సినిమాలు కూడా వస్తున్నాయి. కృత్రిమ మేధ అంటే 'కంప్యూటర్లకు తెలివైన ప్రవర్తన కలగజేసే కంప్యూటర్ సైన్స్ విభాగం లేదా 'మనుషులాగా తెలివిగా ప్రవర్తించేందుకు యంత్రాల సామర్థ్యం'. స్టార్ వార్స్, టెర్మినేటర్, ది మెషీన్, మెట్రోపాలిస్ వంటి హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. ఇక మన 'రోబో' సినిమాలోనైతే మనిషి లక్షణాలను పుణికి పుచ్చుకున్నటు గా చిట్టి సాహసకృత్యాలు, దాన్ని సృష్టించిన శాస్త్రవేత్తకే ఎదురుతిరిగి జరిపిన విధ్వంసం కూడా చూశాం. గూగుల్ సెర్చ్, వీడియోగేమ్స్ స్వయంచోదిత మారణాయుధాలు ఇలా ఎన్నింటిలోనో కృత్రిమ మేధ AI ఇమిడి ఉంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా మొగ్గ దశలోనే ఉండి అంటే బలహీనమైన AI మాత్రమే మనకు అందుబాటులో ఉంది. కొన్ని మందకొడి పనులను మాత్రమే చేయగలుగుతోంది. మనిషి ముఖాన్ని గుర్తుపట్టడం, ఇంటర్నెట్ శోధించడం, తనకు తానే నడుపుకునే కార్లు, బస్సులు ఇలాంటివి. కాని బలీయమైన AI దిశగా శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. ఏ విషయానైనా నేర్చుకోవడం, హేతువు కనుక్కోవడం, భాషను ఉ. పయోగించుకోవడం, చేసుకోగలగాలి. కానీ ఆ స్థాయిని AI చేరుకోలేదు. పూర్తిగా అసాధ్యమని చెప్పలేం. కానీ మరికొన్ని దశాబ్దాలైనా పట్టవచ్చు. ప్రస్తుతం పరిమితంగా వున్న A1 తోనే రోబోలు, కంప్యూటర్లు తెలివైన పనులు చాలా చేస్తున్నాయి. ఎన్నో రంగాలలో ఉపయోగపడుతూ మనకు సహాయకులుగా ఉంటున్నాయి. ఈ తెలివైన యంత్రాలు కంప్యూటర్ సైన్స్, బయాలజీ, గణితం, సైకాలజీ, భాషలు, తత్వశాస్త్రం, న్యూరోసైన్సు, కృత్రిమ సైకాలజీ మొదలైన శాస్త్రాలను ఉపయోగించుకుంటున్నాయి. ఒక్కసారి వీటి విస్త్రృతిని చూద్దాం.

  1. చదరంగం, పోకర్ వంటి వూహాత్మక క్రీడల్లో A1 రాణిస్తోంది.
  2. మనం మాట్లాడే భాషల్ని అర్థం చేసుకునే కంప్యూటర్ల తో మనం అనుసంధానం కాగలుగుతున్నాం.
  3. యంత్రాన్ని సాఫ్ట్ వేర్ తోను, కారణాలను తెలుసుకుని సలహాలనిచ్చే ప్రత్యేకమైన సమాచారంతోను సమన్వయం చేసి నైపుణ్యవ్యవస్థలను (Expert Systems) ని ఏర్పరచడం ద్వారా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. దానిని ఉపయోగించుకునేవారికి విషయాలను వివరించడం, చేసి చూపించడం, సలహాలనివ్వడం చేస్తాయి.
  4. వైద్యానికి సంబంధించిన నైపుణ్య వ్యవస్థలు డాక్టర్లు రోగ నిర్ధారణచేయడంలో ఉపయోగపడతాయి. మొండి రోగాలకు సైతం ఔషధాలను కనుక్కోవడం, రిమోట్ కంట్రోల్ తో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను నిర్వహించడంలో AI ఉపయోగపడుతోంది.
  5. గూఢచారి విమానం ఒక ప్రాంతం ఫోటోలు తీసి అక్కడి సమాచారం తెలుసుకునే వీలు కల్పిస్తుంది. రిమోట్ కంట్రోల్ కేమెరా సిస్టం ఆసరాతో లక్ష్యాన్ని ఛేదించే స్మార్ట్ బాంబులు, మానవరహిత డ్రోన్లు, శతృవుల రహస్య సంకేతాల గుట్టువిప్పడం, విదేశీ భాషలను భాషలు త్వరితంగా తర్జుమా చేయడంలో AI ఉంటుంది.
  6. నేరగాళ్ళ ముఖాలను గుర్తుపట్టే కంప్యూటర్ సాప్ట్ వేర్ ను పోలీసులు నేరపరిశోధనలో ఉపయోగిస్తున్నారు. కొన్ని తెలివైన వ్యవస్థలు మనుషులు మాట్లాడే భాషలను విని అర్థం చేసుకుంటాయి. వేర్వేరు యాసలు, ఉచ్ఛారణలను కూడా విశ్లేషిస్తాయి.
  7. చేతి వ్రాతను గుర్తుపట్టే సాఫ్ట్ వేర్లు వాటిని చదువుతాయి.
  8. తెలివైన రోబోలు మనిషినిర్దేశించిన పనులను చేసేందుకు కొన్ని సెన్సర్లను ఉపయోగించుకుంటాయి. కాంతి, వేడిమి, ఉష్ణోగ్రత, కదలిక, ధ్వని, కుదుపులను కనిపెట్టే సెన్సర్లు వీటిలో కొన్ని సమర్థవంతమైన ప్రొసెసర్లు,  మల్టిపుల్ సెన్సార్లు, గొప్ప మెమరీతో తెలివైన యంత్రాలుగా కూడా ఈ రోబోలు పనిచేస్తాయి. పొరపాట్లను గుణపాఠాలుగా గ్రహించి నేర్చుకుంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తాయి.

ప్రస్తుతం కృత్రిమ మేధ చాలా రంగాల్లో మనుషులతో పోటీపడుతోంది. మనం చేసే చాలా పనులను చెయ్యడమే కాకుండా మనం చెయ్యలేని పనులను కూడా చెయ్యగల స్థాయికి చేరుకుంటోంది.

ఆపిల్ సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ వంటివి Al ని ఉపయోగించుకునే పర్సనల్ అసిస్టెంట్స్. సిరి యాప్లోకి వెళ్ళి “హాయ్సిరీ' ఇప్పుడు ఫినిక్స్లో వాతావరణం ఎలా ఉంది? అని అడిగితే వెంటనే సమాధానం వస్తుంది. సిరీ, ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలెన్ని?” అని అడిగితే 'స్పేస్ జంక్ ను మినహాయిస్తే ప్రస్తుతం 2271 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో 1324 రష్యావి కాగా అమెరికావి 658” అని జవాబు వచ్చింది. 'సిరీ 'ఫిదా' సినిమా పాటలు వినిపించు'. అంటే కొన్ని సెకన్లలో ఆ పాటలు మొదలవుతాయి.

మున్ముందు ఐటి రంగాన్నే కాదు మన జీవితాల్ని, ఈ ప్రపంచాన్ని కూడా కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్లు, రోబోలు శాసించబోతున్నాయి. ఇవి ఎవరో హాస్యానికి అన్నమాటలు కావండోయ్ ప్రఖ్యాత శాస్త్రవేత్తల అభిప్రాయం. స్టీఫెన్ హాకింగ్ మాటల్లో "మానవాళీ భవితకు కృత్రిమ మేధ అనేది కీలకం కానుంది. దీంతో గొప్పమేలు జరగవచ్చు లేదా అతి పెద్ద కీడు తప్పకపోవచ్చు. సజీవమైన మెదడుకూ, కంప్యూటర్లకూ మధ్య తేదా ఇప్పుడైతే చెప్పుకోదగినంత స్థాయిలో లేదు. కంప్యూటర్లు మన మేధస్సును అనుకరించడమే కాదు, మన కంటే మెరుగైన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే స్థాయికి వచ్చేశాయి.

ఒక్కొక్కప్పుడు రోబోను నిర్మాణాత్మక కార్యానికి వినియోగించినా ఆ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు అది కరమైన పద్ధతిని అవలంబించవచ్చు. అప్పుడు మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే, ఈ రోబోకి నిర్దేశించిన లక్ష్యాలను మన లక్ష్యాలతో అన్వయించుకోగలగాలి. పులులు, సింహాలు వంటి క్రూర జంతువుల్ని కూడా మనం వాటికి మించిన తెలివితో నియంత్రించ గలుగుతున్నాం. అలాగే మున్ముందు కృత్రిమ సూపర్ మేధ మనల్ని నియంత్రించవచ్చు. ఈ లోగానే దాన్ని పూర్తిగా నిరపాయంగా చేసుకునే ఆలోచన చేయాలి. అందుకే 'కిల్లర్ రోబో' లను నిషేధించాలని AI నిపుణులు హెచ్చరిస్తున్నాయి.

ఫేస్ బుక్ లో చాట్ బోట్ ప్రోగ్రాం ఒకటి ఉందని మీకు తెలుసు. ఇది సంప్రదింపులు జరిపేందుకు ఉద్దేశించింది. రోబో కారణంగా శాస్త్రవేత్తలు బెంబేలెత్తిన సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. ఫలితంగా సర్వర్ వ్యవస్థల్ని కట్టేయాల్సివచ్చింది. ఫేస్ బుక్ AI ప్రాజెక్ట్ లో ఇది జరిగింది. AI రిసెర్చ్ లాబ్లో AI బోట్లనే చాట్ బోట్లను తయారుచేసింది. జూన్ నెలలో ఈ సంస్థ పరిశోధకులు ఈ చాట్ బోట్లను మెరుగుపరిచే పనిలో మునిగిపోయారు. మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ను ఉపయోగించి అవి స్వేచ్ఛగా సంభాషించుకునేలా చేశారు. కాని 'డామిట్, కథ అడ్డం తిరిగింది. అన్నట్టుగా అవి అదుపు తప్పి ఇంగ్లీష్ కాకుండా సొంత భాషను అభివృద్దిచేసుకున్నాయి. మనుషులకు అర్థంకాని ఆ భాషలోనే అవి సంభాషించుకోవడం మొదలుపెట్టాయి. నిపుణులు ఇచ్చిన కోడ్లను ధిక్కరించాయి. శాస్త్రజ్ఞులు ఉలిక్కిపడ్డారు. సకాలంలో సర్వర్లను ఆపేశారు కాబట్టి గండం గడిచింది. లేకపోతే అవి ఇంటర్నెట్ వ్యవస్థలను ఇష్టం వచ్చినట్లు నడిపేవేమో! ఈ వ్యవహారం కృత్రిమ మేధ గురించి మనకు తెలిసింది తక్కువేనని ఈ రంగంపై మరింతలోతైన చర్చ అవసరం ఉందని హెచ్చరిస్తోంది.

రష్యాకే కాదు మొత్తం ప్రపంచంలోనే భవిష్యత్తు అంతా కృత్రిమ మేధదే. అద్భుతమైన అవకాశాలను మాత్రమే కాదు ప్రమాదాలను తీసుకువస్తుంది. వీటిని మనం ఊహించలేము. 'ఏ దేశం AI పరిశోధనలో అగ్రగామిగా ఉంటుందో, ఆ దేశమే మొత్తం ప్రపంచాన్నే శాసిస్తుంది.’ అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ప్యుటిన్.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు