పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జాతీయ జంతువు పులి

పులులను సంరక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

sep19జంతురాజ్యంలో అడవికి రాజైన సింహం తర్వాత అగ్రస్థానం పులిదే. పులుల్ని వేటాడటం ఆ తర్వాత వాటి చర్మాలను ఇంట్లోని గోడలకు వేలాడదీయటం మన పూర్వపు రాజులకు ఒక ఆట. పులిగోర్లను లాకెట్లలో ధరించి మేడలో వేసుకోవటం రాచరికానికి హెూదాగా భావించేవారు. మొఘల్ చక్రవర్తులలో అక్బర్ కు పులుల వేట అంటే చాలా ఇష్టం. పులుల్ని వేటాడటం అనేది రాచరికపు హుందాతనానికి దర్పణంగా భావించేవారు. జానపద సాహిత్యంలో రాజకుమారుల వీరత్వాన్ని తెలపాలంటే, శౌర్యాన్ని ప్రదర్శించాలంటే పులులతో తలపడటమే ఉండేది. రాజులు, జమీందారులు పూర్వం వేటను వినోదంగా భావించేవారు. గ్రామాల్లోకి వచ్చే పులులను వేటగాళ్ళు కాపుకాసి మట్టుబెట్టేవారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవటం వలన, ఇలాంటి వేటల వలన కారణాలేమయితేనేం నేడు పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చాల రకాల పులులు ప్రస్తుతం విలుప్తమైపోయాయి. మరికొన్ని రకాల పులులు విలుప్తమయే ప్రమాదస్థితిలో జీవిస్తున్నాయి. ఇప్పుడు కళ్ళు తెరిచిన ప్రభుత్వాలు పులుల సంరక్షణ కొరకు సెయింట్ పీటర్ బర్గ్ లో మొదటిసారిగా 2010లో పులుల సదస్సును నిర్వహించారు.

పులి రాజసానికి, ఠీవికి పేరు. దాని కళ్ళలోని స్పురద్రూపం, నడకలో గాంభీర్యం చూస్తేనే వణుకు పుడుతుంది. పులి మన జాతీయ జంతువు. పులిని గురించి చరిత్రలోనూ ఎన్నో రకాల విషయాలు తెలుసుకుంటూనే పెరుగుతాం, పులి మనదేశానికే కాక బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా జాతీయ జంతువే. పూర్వపు రాజులు పులుల బొమ్మలను తమ జెండాల మీదా, మిలటరీ చిహ్నాలుగానూ ఉపయోగించేవారు. క్రీడల పోటీల సమయంలో వాటిని ఆయాదేశాల మస్కట్ లుగా కూడా రూపొందిస్తునారు. పలులు అధికంగా జీవిస్తున్న దేశాలలో భారతదేశం మొదటిస్థానంలో ఉన్నది. మనదేశంలో పలు 47 అభయారణ్యాలు ఉన్నాయి.

పులియొక్క శాస్త్రీయ నామము ‘పాంధెరా టైగ్రిస్’. ఇది కార్పేట్ వర్గానికి, ఫెలడే కుటుంబానికి చెందిన జంతువు. పిల్లులు కూడా ఇదే జాతికి చెందినటువంటివి. అందుకే పులిని 'పెద్ద పిల్లి' అని పిలుస్తారు. ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించిన 'లిన్నేయస్' అనే శాస్త్రవేత్త పులికి 'పెలిస్ టైగ్రిస్' అనే పేరును ఖరారు చేశాడు. అయితే ఆ తరువాత 1929వ సంవత్సరంలో బ్రిటిష్ టాక్సానమిస్ట్ అయినటువంటి ‘రెజినాల్డ్ ఇన్వెస్ పొకాక్' 'పాంథైరా' పదాన్ని ఉపయోగించాడు. అప్పటినుంచి పులులు 'పాంథేరి టైగ్రిస్' అనే పేరుతో పిలవబడుతున్నాయి. ఈ 'పాంథైరా' అనే పదాన్ని ప్రాచీన గ్రీకు పదమైన 'పాంథర్' నుంచి తీసుకున్నారు. లాటిన్లో దీన్ని 'పాంథెరా' అనే పాత ఫ్రెంచిలో ‘పాంటెరా' అనే అంటారు. ఏ భాషలో ఏమన్నా, ఇంతకీ ఈ 'పాంథెరా' అనే పదానికి అర్ధం 'పసుపురంగు జంతువు' అని. పులులు పసుపురంగులోనూ, ఎరుపు వర్ణం మిశ్రితమైన ఆరెంజ్ నల్లరంగులోనూ ఉంటాయి. ఒళ్ళంతా మెత్తని ఫర్తో నిండి దానిమీద నల్లని నిలువు చారలు కలిగి ఉంటాయి. పులి శరీరం మీద చారలు ఏ ఒక్కటీ మరొకదాన్ని పోలి ఉండవు. మనుష్యుల చేతి వేలిముద్రలలాగే పులుల మచ్చలు కూడా దేనికదే ప్రత్యేకం. గత వందేళ్ళలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

భారత్, నేపాల్, టర్కి భూటాన్, రష్యా దేశాలలో పులులు ఎక్కువగా ఉంటాయి. 1913లో ప్రపంచ వ్యాప్తంగా పులులు లక్షదాకా ఉండేవి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల, వేటగాళ్ళ వల్ల పులుల సంఖ్య 2010 సంవత్సరంలో లెక్కల ప్రకారం 3200 సంఖ్యకు తగ్గిపోయాయి. పెద్ద సైజు అడవి పులులు 3.38 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. 388, 7 కిలోల బరువును కలిగి యుంటుంది. సాధారణ మగపులి దాదాపు 250 కిలోల బరువు ఉంటుంది. ఆడపులి సుమారు 160 కిలోల వరకు బరువు ఉండవచ్చు. పాడవు దాదాపు ఎనిమిది, తొమ్మిది అడుగుల వరకు పెరుగుతుంది. 2016లో వరల్డ్ వైల్డ్ ఫండ్ లెక్కల ప్రకారం 3,890 పులులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 2010లో ఉన్న 3200 పులల సంఖ్య ప్రస్తుత సంఖ్య 3890 దాకా పెరగటం అనేది ఆశాజనకమైన పరిణామంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు తీసుకున్న జాగ్రత్తల కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లుగా చెపుతున్నారు.

పులియొక్క గరిష్ట ఆయుష్షు 26 సంవత్సరాలు అయినప్పటికీ అనేక రకాల సమస్యల వలన పది సంవత్సరాలకు మించి బతుకుతున్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం బతికి ఉన్న పులుల్లో ఎక్కువ శాతం 'జూ' లలోనే బతుకుతున్నాయి. అడవులలో తక్కువగా ఉంటున్నాయి. పిల్ల పులులు తల్లివద్ద రెండున్నర సంవత్సరాల దాకా పెరుగుతాయి. ఆడపులి ఒకసారికి రెండు నుంచి ఆరు పిల్లల వరకు కంటుంది. పిల్లలను చూసుకునే బాధ్యత ఆడపులి మీదనే ఉంటుంది. వాటికి మూడు నెలల వయసు వచ్చాక వేటలోని మెలకువలు నేర్పుతుంది తల్లి పులి.

సాధారణంగా పులుల సామ్రాజ్యంలో 41 రకాల ఉపజాతులున్నాయి. వీటిలో ఎన్నో రకాల పులులు ప్రస్తుతం విలుప్తమై పోయాయి. ఇంకా కొన్ని జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అందువలననే పులుల సంరక్షణ చాలా ఆవశ్యకం. విలుప్తమైన జాతులు విలుప్తమై పోగా ప్రస్తుతం ఉన్న జాతుల్లో బెంగాల్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్ ఉన్నాయి. ఒక్కొక్క పులి అడవిలో తనకొని స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొంత ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని వేరే పులుల్ని జంతువుల్ని ప్రవేశించనివ్వవు. మామూలు పులుల కళ్ళు పసుపురంగులో ఉంటాయి. కానీ తెల్లపులి కళ్ళు మాత్రం నీలి రంగులో ఉంటాయి.

బాలి టైగర్, కాస్పియన్ టైగర్, జావన్ టైగర్ అనే మూడు జాతులు పూర్తిగా విలుప్తమైపోయాయి. బాలి టైగర్ ఇండోనేషియాలో విలుప్తమైంది. ఈ పులి శరీరం మీద నిలువు చారల మధ్యలో చిన్నచిన్న చుక్కలుంటాయి. ఇది 1963లో చనిపోయింది. కాస్పియన్ టైగర్ ఆవనిస్తాన్లో విలుప్త మైంది. జన్యుపరంగా ఈ పులికి దగ్గరగా నైజీరియన్ టైగర్ లక్షణాలు ఉంటాయి, 1970 వ దశకం తొలిరోజుల్లోనే ఇది విలుప్తమైపోయింది.

జావన్ టైగర్ జావా ద్వీపంలో నివసించేది. ఇది కూడా ఇండోనేషియాలో విలుప్తమైంది. 1970 దశకం మధ్య ప్రాంతంలో విలుప్తమైంది. 1979లో చివరి పులి కనిపించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎక్కడా వీటి జాడ కనిపించలేదు. వీటిలోని మగపులుల బరువు 100 - 141 కిలోల మధ్యలో, ఆదపులుల బరువు 75 - 115 కిలోల మధ్యలో ఉంటుంది. పులులను సంరక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఆధారం: కందేపి రాణీప్రసాద్

2.99145299145
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు