অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్లాస్టిక్ లేని భూగోళం

jun13చెకుముకి నేస్తాలూ! మళ్లీ బడి సందడి మొదలయింది గదా! సెలవుల్లో సరదాగా ఆడిన ఆటలు, పాటలకు Good bye చెప్పాల్సి వచ్చినందుకు కొద్దిగా బాధగా ఉంది కదా! ఉండదా మరి? మన బడులు ఆటపాట సరదా చదువుల ఆనంద నిలయాలయ్యేదెన్నడో కదా! మనం ఆశావాదులుగా ఉందాం. ఆరోజు వచ్చి తీరుతుందని నమ్ముదాం.

సెలవులకు ముందు మీ బడిలో, మీ గురువుల ప్రోత్సాహంతో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఏప్రిల్ 22 న జరుపుకునే ఉంటారనుకుంటాను. ఈ సంవత్సరం ధరిత్రీ దినపు లక్ష్యం ప్లాస్టిక్ కాలుష్యానికి చరమగీతం పాడటం (End Plastic Pollution) కదా! మరి ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే కాలుష్యం గురించీ, జరిగే అనర్థాల గురించి ఎవరికైనా చెప్పారా? కనీనం మీ దోస్తులతోనన్నా మాట్లాడుకున్నారా? ఎందుకంటే ప్లాస్టిక్ కాలుష్యం ఇలాగే కొనసాగితే 2050 నాటికి మన సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ సంచులే ఎక్కువగా ఉంటాయి. ఈ కాలుష్యం మన ప్రకృతి వనరులను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. మనం త్రాగే నీళ్ళు, తినే ఆహారం ఒకటేమిటి అన్నింటా ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్ నే. ఇప్పటికీ సగానికి పైగా ఉష్ణమండల, శీతోష్ణమండల అడవులు నాశనంమయ్యాయి. ఈ భూమిపై లభించే సహజ వనరులలో 80 శాతాన్ని కేవలం రెండు శాతం జనాభా కొల్లగొడుత్నుది. ఈ క్రమంలో భూమిని, నీటిని, గాలిని ఇలా అన్నింటినీ కాలుష్యపరుస్తూ భావితరాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. కాలుష్యం కోరలకు చిక్కి భూ వాతావరణం విపరీతంగా వేడెక్కిపోతున్నది.

వాతావరణంలో ­CO­­­­2 వాయుస్థాయి పెరిగిపోతున్నది. దీని వలన భూతాపం (Global Warming) పెరిగి మొత్తం వాతావరణం మార్పు (Climate Change) చెందుతోంది. దీన్ని తక్షణం నిలువరించక పోతే భూగోళం భవిష్యత్తు అంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తులో కూడా అంధకారం అలముకుంటుందన్నది అక్షర సత్యం. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతియేటా ప్రజలను చైతన్య పరచటానికి పలు సందర్భాలను ఎంచుకుని పర్యావరణ పరిరక్షణకు మనలను కొర్యోన్ముఖుల్ని చేయజూస్తుంది. అటువంటిదే మన ముందున్న మరో సందర్భం ప్రపంచ పర్యావరణ దినం (World Environment Day - June 5th) దీని ప్రధాన లక్ష్యం కూడ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందించటమే (Beat Plastic Pollution) ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి భారతదేశం వేదిక కానున్నది. జూన్ 5 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రపంచ మంతా పర్యావరణ పరిరక్షణ (Environment Protection) కోసం ప్రజలను చైతన్య పరచి, కార్యాచరణను రూపొందించేందుకు కార్యక్రమాలు చేపడతారు. ఈ పని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ఏర్పడిన 1972 నుండి పెద్ద ఎత్తున చేబడుతున్నారు. అంటే గత ఐదు దశాబ్దాలుగా ఇది నడుస్తూనే ఉంది. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి? 1990 నాటికే ప్రతి సం. 8 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో పడేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు 18 మిలియన్ టన్నులకు చేరింది. ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేసే జీవన విధానం వైపు అభివృద్ధి నమూనాలు మనలను నడిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం గురించిన నిజాలు మనలను కలవరపరుస్తున్నాయి.

ప్లాస్టిక్ కాలుష్యం - కొన్ని నిజాలు

  • 500 బిలియన్ల ప్లాస్టిక్ సంచులను ప్రతి సంవత్సరం మనం వాడుతున్నాం.
  • సముద్రాలకు చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు కనీసం 8 మిలియన్ టన్నులకు పైమాటే. ఇది ప్రతి నిమిషం ఒక లారీ ప్లాస్టిక్ వ్యర్ధానికి సమానం.
  • గత పదేళ్లలో మనం ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ గత శతాబ్దమంతా వాడిన దానికంటే ఎక్కువ.
  • మనం వాడే ప్లాస్టిక్ లో సగానికి పైగా ఒక్కసారే వాడి పారేస్తాం. ప్రతి నిమిషం ఒక మిలియన్ ప్లాస్టిక్ సీసా (బాటిళ్లు) లను కొంటాం.
  • మనం నిత్యం పడేసే వ్యర్థాల్లో ప్లాస్టిక్ వాటా 10 శాతం.
  • క్రికెట్ మాచ్ ఒక్క ఓవర్ పూర్తయ్యేలోగా 4 ట్రక్కుల ప్లాస్టిక్ ను వ్యర్థంగా పారేస్తాం.

పర్యవసానాలు

ప్లాస్టిక్ కాలుష్యం వలన పర్యావరణ సమతుల్యత (Ecological) దెబ్బతింటుంది. దీనితో తరచూ వరదలు, అడవులు కాలిపోవటం, భూతాపం పెరగటం జరుగుతుంది. సముద్రంలో నివసించే Turtles, పక్షుల శరీరాల్లోకి ప్లాస్టిక్ చేరి మరణిస్తున్నాయి. 2030 నాటికి ఆహార ధరలు 50 శాతం పెరుగుతాయి. విశ్వంలో జీవానికి, జీవులకు పుట్టినిల్లైన భూమి మనుగడే ప్రమాదంలో పడుతున్నదంటే అతిశయోక్తి కాదు.

కర్తవ్యం ఏమిటి?

ప్రభుత్వాలను, పరిశ్రమలను, సమాజాన్ని, వ్యక్తులనూ కోరుతున్నదేమంటే ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడకాన్ని నివారించమని. కనీసం ఒకే ఒక్కసారి మాత్రమే వాడి పారేసే పాలిథీన్ సంచుల వంటి వాటిని తక్షణం నిలిపివేయాలి. కొంత కాలం క్రితం మన ప్రభుత్వాలు 40 మి.మీ గేజ్ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించాయి. కాని ఆచరణలో మాత్రం ఏమీ జరుగలేదు. ముందుగా హానికరమైన పలుచని ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిశ్రమల వద్దే ప్రభుత్వాలు నిలువరించాలి. అలా కాకుండా విచ్చలవిడిగా జనం మీదికి వదిలేసి మీరు వాడకండి అని చెప్పటం ఎంత వరకు సమంజసం ఆలోచించండి.

ఇక పోతే ప్లాస్టిక్ వాడకంలో ఎంతో వెసులుబాటు ఉన్నమాట నిజం అందుకే దీన్ని తగ్గించేందుకు 5R లను పాటిస్తే కొంతమేలు అవి...

Reduce → Refuse → Reuse → Recycle → Remove

(తగ్గించడం) → (తిరస్కరించడం) → (పునర్వినియోగం) → (మళ్లీ ఉత్పత్తికి వాడటం) → (తొలగించటం)

ప్రభుత్వాలు, పరిశ్రమలు బాధ్యత తీసుకోవటం ఒక ఎత్తైతే, పౌర సమాజం, వ్యక్తులుగా మనం మన స్థాయిలో పర్యావరణం కాలుష్యం కాకుండా ఎంతో కొంత చేయగలం. ప్లాస్టిక్ గ్లాసుల బదులు స్టీలు, గాజు గ్లాసులు వాడవచ్చు. ప్లాస్టిక్ విస్తర్లకు బదులు ఆకులతో చేసిన విస్తర్లు వాడవచ్చు. ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించి, గుడ్డతో చేసి వాడవచ్చు. ఇలా నిత్యజీవితంలో మీరేమి చేయగలరో, మీ స్కూల్ లో, మీ మిత్రులతో చర్చించి ఆచరించి చూపండి. మనలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక్క మంచి పని, కాలుష్యాన్ని నివారించే పని చేస్తే భూగోళం మీద కోట్లాదిగా పర్యావరణ హితమైన మంచి పనులు ప్రతిరోజూ జరుగుతాయి. అవునా? ఏమంటారు? ఆలోచించండి.

ఆధారం: డా. కట్టా సత్యప్రసాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate